మోదీతో సమావేశం కానున్న త్రివిధ దళాధిపతులు

ABN , First Publish Date - 2022-06-21T01:18:53+05:30 IST

'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ పథకంపై వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రివిధ దళాల అధిపతులు మంగళవారంనాడు..

మోదీతో సమావేశం కానున్న త్రివిధ దళాధిపతులు

న్యూఢిల్లీ: 'అగ్నిపథ్' (Agnipath) రిక్రూట్‌మెంట్ పథకంపై వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రివిధ దళాల అధిపతులు మంగళవారంనాడు కలుసుకుకోనున్నారు. ఈనెల 14న ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానిని త్రివిధ దళాధిపతులు కలుసుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది.


అగ్నిపథ్ పథకం కింద ఎంపిక చేసిన యువకులను అగ్నివీరులుగా పిలుస్తారు. ఈ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకూ నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ పరోక్షంగా ప్రస్తావన చేశారు. దేశం కోసం ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు ప్రతిపక్షాలు రాజకీయ రంగు పులుముతున్నాయని ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సంబంధించిన సొరంగం మార్గాన్ని, ఐదు అండర్ పాస్‌లను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఆరోపించారు. ఈ పరిణామం దురదృష్టకరమన్నారు. ఆ మరుసటి రోజే (సోమవారం) బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. చాలా పథకాలు, సంస్కరణలు మొదట్లో ఇబ్బందికరంగా అనిపించినా దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తుంటాయని అన్నారు. కాగా, కాంగ్రెస్ సహా పలు విపక్షాలు అగ్నిపథ్ పథకాన్ని ప్రభుత్వ తప్పిదంగా పేర్కొంటున్నాయి. పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు బాసటగా నిలుస్తున్నాయి.

Updated Date - 2022-06-21T01:18:53+05:30 IST