Ajit Doval security lapse : అజిత్ ధోవల్ భద్రతలో వైఫల్యం.. ముగ్గురు కమాండోలను తొలగించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-08-18T00:03:10+05:30 IST

దేశంలో ప్రాణాలకు ముప్పుపొంచివుండే వ్యక్తుల్లో జాతీయ భద్రతా సలహాదారు(NSA) ఒకరు. అందుకే ఎన్ఎస్ఏ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు సీఐఎస్ఎఫ్ ‘

Ajit Doval security lapse : అజిత్ ధోవల్ భద్రతలో వైఫల్యం.. ముగ్గురు కమాండోలను తొలగించిన కేంద్రం

న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాలకు ముప్పుపొంచివుండే వ్యక్తుల్లో జాతీయ భద్రతా సలహాదారు(NSA) ఒకరు. అందుకే ఆ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు సీఐఎస్ఎఫ్(CISF) ‘ జడ్‌ ప్లస్’ భద్రత కల్పిస్తుంది. అయితే ప్రస్తుత ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్(Ajit Dhoval) భద్రతలో లోపం ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటపడింది. ఢిల్లీలోని అజిత్ ధోవల్ నివాసంలోకి చొరబడేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఎస్‌యూవీ వాహనంతో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది కారుని నిలువరించడంతో అవాంఛనీయ ఘటనేమీ జరగలేదు. ఆ తర్వాత నిందితుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వైఫల్యం కారణంగానే ఇదంతా జరగడంతో ధోవల్ భద్రత నుంచి ముగ్గురు కమాండోలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ జనరల్(DIG), కమాండెంట్‌లను బదిలీ చేసినట్టు వివరించాయి. ఫిబ్రవరి 2022లో ధోవల్ నివాసం వద్ద భద్రతా లోపం జరిగినట్టు తేలిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. 


కాగా అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు శాంతాను రెడ్డి. ఇతడు బెంగళూరు నివాసి. తన శరీరంలో ఒక చిప్ ఉందని, బయట వ్యక్తులు తనను నియంత్రిస్తున్నారని అతడు చెప్పాడు. కానీ ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి చిప్‌ లేదని తేలింది. మానసిక స్థితి సరిగాలేనట్టుగా ఉన్నాడని అధికారులు తెలిపారు. రెడ్ కలర్ కారుని నోయిడాలో అద్దెకు తీసుకున్నాడు.

Updated Date - 2022-08-18T00:03:10+05:30 IST