గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడి కేసు నిందితుడు ఐసిస్‌తో సంప్రదింపులు : యూపీ పోలీసులు
ABN , First Publish Date - 2022-05-01T17:15:19+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు శనివారం వెల్లడించారు. ఆ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆయన నిధులను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితుడు తన బ్యాంకు ఖాతాల ద్వారా దాదాపు రూ.8.5 లక్షల మేరకు ఐసిస్ కార్యకలాపాల కోసం అందజేసినట్లు తెలిపారు. యూరోపు, అమెరికా తదితర దేశాల్లోని ఐసిస్ మద్దతుదారులకుగల సంస్థల ద్వారా ఈ సొమ్మును ఐసిస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఏకే-47, ఎం4 కార్బైన్ వంటి వివిధ రకాల ఆయుధాలను ఇంటర్నెట్ ద్వారా పంపించినట్లు తెలిపారు. గోరఖ్‌నాథ్ మఠం వద్ద భద్రతా సిబ్బంది నుంచి రైఫిల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారని, దానిని చేజిక్కించుకున్న తర్వాత భారీ దాడికి పాల్పడాలన్నది ఆయన లక్ష్యమని చెప్పారు.
ఐసిస్ ఉగ్రవాది, ప్రచార కార్యకర్త మెహందీ మసూద్‌తో ముర్తజా సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మెహందీ మసూద్‌ను బెంగళూరు పోలీసులు 2014లో అరెస్టు చేశారన్నారు.
ముర్తజా ఐఐటీ-ముంబై గ్రాడ్యుయేట్. ఆయన ఏప్రిల్ 3న గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్ళు గాయపడ్డారు. అనంతరం మిగిలిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అతనిని అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ జైలులో ఉన్నాడు.