అణు ప్రమాదమే జరిగితే?
ABN , First Publish Date - 2022-03-05T07:01:08+05:30 IST
ఉక్రెయిన్‌లోని జాపొరీజియాలోని అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...
జాపొరీజియాలోని అణు విద్యుత్ కేంద్రంలో
ఉన్నవి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్లు.. సురక్షితమే!
ఉక్రెయిన్‌లోని జాపొరీజియాలోని అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూరో్‌పలోనే అతి పెద్దది.. ప్రపంచంలోని 10 అతి పెద్ద అణు విద్యుత్‌కేంద్రాల్లో ఒకటి అయిన ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఆరు అణు రియాక్టర్లున్నాయి. అయితే, మంటలు అంటుకుంది.. ఆ అణు రియాక్టర్లకు కొద్ది దూరంలో ఉన్న శిక్షణ భవనానికేనని.. ఆ మంటలను కూడా వెంటనే ఆర్పేశారని తెలిశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. రష్యా క్షిపణి దాడుల్లో అణు రియాక్టర్లకు మంటలు అంటుకుని ఉంటే? ఆ ఊహే భయంకరమని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ అణువిద్యుత్ కేంద్రం ఎంత పెద్దది? అణురియాక్టర్లకు అగ్ని ప్రమాదం జరిగితే ముప్పు ఏ స్థాయిలో ఉంటుంది అంటే... చెర్నోబిల్ ప్రమాదానికి పదిరెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ పేలితే?
దురదృష్టవశాత్తూ ఈ అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్లున్న ప్రాంతం క్షిపణి దాడులకు గురై మంటల్లో చిక్కుకుంటే? సాధారణంగా.. రియాక్టర్లను చల్లబరిచే వ్యవస్థలుంటాయి. ఆ వ్యవస్థలు విఫలమైతే అధిక ఉష్ణానికి (ఓవర్‌హీట్‌కు) గురై కోర్ కరిగిపోయే ప్రమాదం ఉంది. అలా కోర్ కరిగిపోతే దాన్నుంచి రేడియో ధార్మికత చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది. 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్‌లో జరిగింది ఇదే. ఒక ప్రయోగంలో భాగంగా చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలోని రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో దానికి కూలింగ్ వాటర్‌ను సరఫరా చేసే టర్బైన్ల పనితీరు దెబ్బతింది. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు అప్రమత్తమయ్యేలోపే రియాక్టర్ మూత తొలగిపోయి కోర్ నుంచి రేడియో ధార్మికత బయటి వాతావరణంలోకి వ్యాపించింది. ఆ సమయంలో చెలరేగిన మంటలు పదిరోజులపాటు కొనసాగాయి. ఈ ప్రమాదానికి మొత్తంగా 50మంది బలయ్యారు. ఆ అణుధార్మికత బాధితులను ఉక్రెయిన్‌లో ‘పోటర్‌పిలి’గా వ్యవహరిస్తారు. 2000 సంవత్సరం నాటికి ఇలాంటి ప్రయోజనాలు అందుకునే ‘పోటర్‌పిలి’ల సంఖ్య 35 లక్షలుగా ఉంది.
అంత ముప్పు లేదు
జాపొరీజియా కేంద్రం పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను కలిగి ఉందని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ వెన్‌మాన్ తెలిపారు. ‘‘ఈ కేంద్రంలో రియాక్టర్‌ను ‘ఉక్కుతో బలోపేతం చేసిన కాంక్రీట్ భవనం’లో ఉంచారు. ఆ భవనం ఎలాంటి విపత్తులనైనా, దాడులనైనా తట్టుకోగలదు. అంతేకాదు.. జాపొరీజియా ప్లాంట్‌లోని రియాక్టర్‌లో గ్రాఫైట్‌ను వినియోగించలేదు’’ అని ఆయన భరోసా ఇచ్చారు. చెర్నోబిల్ ప్రమాదంలో రియాక్టర్‌లో ఉన్న గ్రాఫైట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఇక.. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టోనీ ఇర్విన్ కూడా ఈ అణువిద్యుత్ కేంద్రం భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదని భరోసా ఇచ్చారు. ‘జాపొరీజియాలో ఉంది ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఈ తరహా రియాక్టర్లు చాలా సురక్షితమైనవి’’ అని ఆయన వివరించారు. ఈ ప్లాంటును తమ అధీనంలోకి తీసుకున్న రష్యన్లు, ఉక్రెయిన్ ఇంజనీర్లకు విధులను నిర్వర్తించడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రమాదం జరిగే ముప్పు ప్రస్తుతానికి లేనట్టే. (సెంట్రల్ డెస్క్)
ఉక్రెయిన్ విద్యుత్‌కు కీలకం
రాజధాని కీవ్‌కు 550 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఉన్న జపొరిజ్జియా నగరంలోని అణు విద్యుత్ కేంద్రంలో.. మొత్తం ఉక్రెయిన్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో ఐదో వంతు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఆరు వీవీఈఆర్-1000 ప్రెజరైజ్డ్ లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లు (పీడబ్ల్యూఆర్) ఉన్నాయి. ఆరు రియాక్టర్లూ కలిసి.. 5700 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. నిజానికి 2014 దాకా ఉక్రెయిన్‌కు కావాల్సిన విద్యుత్తులో 41 శాతం బొగ్గు ద్వారానే తయారుచేసుకునేవారు. కానీ.. ఆ దేశంలో బొగ్గు గనులు ఎక్కువగా ఉండే డాన్‌బా్‌స ప్రాంతాన్ని 2014లో రష్యా నియంత్రణలోకి తీసుకోవడంతో ఇప్పుడు అణు విద్యుత్తుపైనే ఆధారపడుతోంది.
