గుజరాత్‌లో ‘ఆప్‌’ సర్కారు ఖాయం

ABN , First Publish Date - 2022-10-03T09:26:37+05:30 IST

గుజరాత్‌ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

గుజరాత్‌లో ‘ఆప్‌’ సర్కారు ఖాయం

ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇదే చెబుతోంది: కేజ్రీవాల్‌ 

‘గర్బా’ వేడుకల్లో ఢిల్లీ సీఎంపైకి ప్లాస్టిక్‌ బాటిల్‌ 

అహ్మదాబాద్‌, అక్టోబరు 2: గుజరాత్‌ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అయితే తమ విజయానికి మార్జిన్‌ చాలా స్వల్పంగానే ఉంటుందని ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆప్‌ ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ ఏకమయ్యాయని ఆ నివేదిక చెబుతోందన్నారు. ‘‘ఐబీ నివేదికతో బీజేపీలో తీవ్ర ఆందోళన మొదలైంది. కాంగ్రెస్‌, బీజేపీ ప్రస్తుతం ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి’’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఆప్‌ ఓట్లను చీల్చే బాధ్యతను కాంగ్రె్‌సకు అప్పగించారన్నారు.


గుజరాత్‌ అసెంబ్లీకి ఉన్న 182 సీట్లలో కాంగ్రె్‌సకు 10 కంటే ఎక్కువ రావని, వారు కూడా తర్వాత బీజేపీలో కలిసిపోతారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రజలు తమ పార్టీకి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరారు. ఇదిలాఉండగా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం రాత్రి నిర్వహించిన గర్బా కార్యక్రమంలో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమంలో పాల్గొన్న వారివైపు వెళ్తుండగా వెనకవైపు నుంచి కొందరు ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ను విసిరారు. అయితే అది అయనకు తగలలేదని, తలపై నుంచి అవతలకు వెళ్లి పడిపోయిందని ఆప్‌ నేతలు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Read more