ఎలన్ మస్క్ మాట్లాడకుండా నిరోధించేందుకు తిరస్కరించిన జడ్జి
ABN , First Publish Date - 2022-04-21T23:31:05+05:30 IST
టెస్లా ఇంక్ వాటాదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ దాఖలైన

శాన్ఫ్రాన్సిస్కో : టెస్లా ఇంక్ వాటాదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యం గురించి మాట్లాడకుండా ఎలన్ మస్క్‌ను నిరోధిస్తూ గ్యాగ్ ఆర్డర్‌ను జారీ చేసేందుకు అమెరికా జిల్లా జడ్జి ఎడ్వర్డ్ చెన్ బుధవారం తిరస్కరించారు. తన ఎలక్ట్రిక్ కార్ కంపెనీని ప్రైవేట్ చేస్తుండటం గురించి 2018లో ఆయన ట్వీట్ చేసి, ఈ వాటాదారులను మోసం చేసినట్లు ఈ వ్యాజ్యంలో ఆరోపించారు.
ప్రతిపాదిత తాత్కాలిక నిరోధక ఆదేశం మితిమీరినదిగా కనిపిస్తోందని, ఈ కేసు గురించి ఎవరితోనూ మాట్లాడకుండా నిరోధిస్తోందని ఎలన్ మస్క్, టెస్లా చేసిన వాదనతో జడ్జి చెన్ ఏకీభవించారు. బహిరంగంగా మాట్లాడటానికి మస్క్‌కు అనుమతి ఇవ్వడం వల్ల ఎదురయ్యే స్పష్టమైన, ప్రస్తుత అపాయం కానీ, తీవ్రమైన, సమీపిస్తున్న ముప్పు కానీ కనిపించడం లేదని చెన్ చెప్పారు. దీనికి సంబంధించిన రుజువులేవీ లేవన్నారు. అయితే తప్పు అని తెలిసియుండి కూడా మస్క్ ఆ ట్వీట్లను చేశారని, అందువల్ల ఆ ట్వీట్లు తప్పు అని తాను ఇప్పటికే రూలింగ్ ఇచ్చానని, 2023 జనవరిలో జరిగే విచారణలో జ్యూరర్స్కు కూడా ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
ఎలన్ మస్క్ 2018 ఆగస్టు 7న ఇచ్చిన ట్వీట్లో, ఒక్కొక్క షేర్‌కు 420 డాలర్ల వద్ద టెస్లాను ప్రైవేటీకరించేందుకు నిధులకు భద్రత కల్పించినట్లు తెలిపారు. పెట్టుబడిదారుల మద్దతు ధ్రువపడిందన్నారు. ఈ ట్వీట్ నేపథ్యంలో టెస్లా షేర్లలో ఒడుదొడుకులు రావడంతో నష్టాలకు గురైన షేర్హోల్డర్లు కోర్టును ఆశ్రయించారు.
షేర్‌హోల్డర్ల తరపు న్యాయవాది నికొలస్ స్పందిస్తూ, ఎలన్ మస్క్ మోసపూరితంగా ట్వీట్లు చేశారని, అవి తప్పుడు ట్వీట్లు అని జ్యూరర్స్కు సూచిస్తామని జడ్జి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇక మిగిలిన ముఖ్యమైన సమస్య నష్టపరిహారానికి సంబంధించినదేనని తెలిపారు. ఎలన్ మస్క్, టెస్లా తరపు న్యాయవాదులు స్పందించలేదు.
వాంకోవర్‌లో ఏప్రిల్ 14న జరిగిన TED సదస్సులో ఎలన్ మస్క్ మాట్లాడుతూ, టెస్లాను ప్రైవేటీకరించేందుకు నిధులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆ మర్నాడే ఆయనపై గ్యాగ్ ఆర్డర్‌ను జారీ చేయాలని పిటిషన్ దాఖలైంది. అయితే ఆయన ట్వీట్లు ఇవ్వడం మోసపూరితమని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దావా వేసింది.
గ్యాగ్ ఆర్డర్‌ను జారీ చేస్తే, ఓ స్థాయిలో సెన్సార్షిప్ తమపై అమలవుతుందని, ఇది అమెరికా రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యానికి తగినది కాదని ఎలన్ మస్క్, టెస్లా తమ వాదనలలో పేర్కొన్నారు. టెస్లా వాటాదారులతో మాట్లాడేందుకు, ట్విటర్ ఇంక్‌ను కొనాలనే ప్రతిపాదనలపై చర్చించేందుకు కూడా అవకాశం ఉండదని తెలిపారు.