Pakistan : ఇమ్రాన్ ఖాన్ భార్య ఆడియో లీక్!
ABN , First Publish Date - 2022-07-03T16:33:54+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓవైపు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓవైపు బహిరంగ సభలో మాట్లాడుతూండగా, మరోవైపు ఆయన భార్య బుష్రా బీబీ ఆడియో బయటకు పొక్కినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆయన నేతృత్వంలోని పార్టీ పీటీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజిక మాధ్యమ విభాగానికి బుష్రా బీబీ సూచనలు ఇస్తున్నట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపించినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, విద్యుత్తు సంక్షోభం గురించి పెరేడ్ గ్రౌండ్స్ సభలో ఇమ్రాన్ మాట్లాడారు.
పీటీఐ డిజిటల్ మీడియాకు అత్యంత కీలక వ్యక్తి డాక్టర్ అర్సలాన్ ఖలీద్‌కు బుష్రా బీబీ సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు లీక్ అయిన రెండు నిమిషాల నిడివిగల ఆడియో క్లిప్‌లో ఉందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. అయితే ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదని పేర్కొంది.
ఈ ఆడియోను ఉటంకిస్తూ పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, పీటీఐ సోషల్ మీడియా అకస్మాత్తుగా ఎందుకు ఉదాసీనంగా మారిపోయిందని బుష్రా బీబీ ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకులు విదేశీ కుట్రలకు సహకరిస్తున్నట్లు ఓ భావాన్ని సృష్టించాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా ఇమ్రాన్ వ్యతిరేకులు తన గురించి, ఫరా గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని, దానిని దేశద్రోహంతో ముడిపెట్టి ప్రచారం చేయాలని చెప్పారు. రష్యా నుంచి పాకిస్థాన్ ప్రభుత్వం చమురును కొనడం లేదని, ఈ విషయం మరుగున పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. విషయాలు బయటపడటానికి ముందే అన్నిటి గురించి ఇమ్రాన్ ఖాన్‌కి ఎలా తెలుస్తోందని అందరూ అనుకుంటున్నారన్నారు. ‘ఈ విషయాన్ని మీరు ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు, అది మీకు తెలుసు’ అన్నారు.
బుష్రా బీబీ పాకిస్థాన్ రాజకీయాలకు దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది. ఆమెను 2018లో ఇమ్రాన్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శి.