Hyderabad Boy Global Record : రెండు పర్వత శిఖరాలను అధిరోహించిన 13 ఏళ్ళ బాలుడు

ABN , First Publish Date - 2022-07-27T19:51:38+05:30 IST

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు విశ్వనాథ్ కార్తికేయ (Vishwanath Karthikey

Hyderabad Boy Global Record : రెండు పర్వత శిఖరాలను అధిరోహించిన 13 ఏళ్ళ బాలుడు

హైదరాబాద్ : పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు విశ్వనాథ్ కార్తికేయ (Vishwanath Karthikey) పదమూడేళ్ళ వయసులోనే అంతర్జాతీయ స్థాయి రికార్డు సృష్టించాడు. లడఖ్ ప్రాంతంలోని మర్ఖా (Markha)లో ఉన్న కాంగ్ యాట్సే (Kang Yatse), డ్జో జోంగో (Dzo Jongo) పర్వత శ్రేణులను అధిరోహించాడు. మొదట్లో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.


హైదరాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విశ్వనాథ్ మాట్లాడుతూ, తాను జూలై 9న కాంగ్ యాట్సే, డ్జో జోంగో పర్వత శ్రేణుల  ట్రెక్కింగ్ ప్రారంభించానని తెలిపాడు. ఈ యాత్ర జూలై 22తో ముగిసిందన్నాడు. బేస్ క్యాంప్ నుంచి శిఖరాగ్రానికి చేరుకోవడం అంత సులువు కాదన్నాడు. ఎత్తయిన ప్రాంతాల్లో గాలి ఒత్తిడి తగ్గిపోవడమే దీనికి కారణమని తెలిపాడు. తాను పట్టువదలకుండా ముందుకు సాగానని తెలిపాడు. తాను పొందిన తొలి అనుభూతి మరపురానిదని చెప్పాడు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు తాను ఎంతగా శ్రమించినదీ గుర్తు చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు తన కల సాకారం అయిందని తెలిపాడు. 


శిఖరాగ్రంపై కాలు మోపే సమయంలో తాను శ్వాస సంబంధిత సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నానని తెలిపాడు. గాలిలో తేమ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైందని చెప్పాడు. డ్జో జోంగో శిఖరాగ్రానికి చేరుకునేటపుడు తన గొంతు పొడిబారిందని చెప్పాడు. ఎక్కువ దూరం నడవడం వల్ల తాను అలసిపోయానని, ఆకలి వేసిందని చెప్పాడు. 


అనేక వైఫల్యాలు

ఈ విజయం సాధించడానికి ముందు తాను ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. రష్యాలోని మౌంట్ ఎల్‌బ్రుస్, గంగోత్రి వద్దనున్న మౌంట్ రుడుగైరాపై ట్రెక్కింగ్‌ను పూర్తి చేయలేకపోయానని విశ్వనాథ్ చెప్పాడు. అయితే ఈ విఫల యత్నాలు తనకు ఆశీర్వాదాలయ్యాయని చెప్పాడు.


సోదరి నుంచి ప్రేరణ

విశ్వనాథ్ సోదరి కూడా ఫిట్‌నెస్, ట్రెక్కింగ్‌లను ఎంజాయ్ చేస్తుంది. ఆమెను చూసి విశ్వనాథ్ కూడా ట్రెక్కింగ్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. తన మొట్టమొదటి ఎక్స్‌పెడిషన్ మౌంట్ రుడుగైరా అని, కనీసం ఈ బేస్ క్యాంప్ వద్దకు చేరుకోలేకపోయానని చెప్పాడు. మొదటి ప్రయత్నం విఫలమైందని చెప్పాడు. ఆ తర్వాత తాను నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో పది రోజులపాటు శిక్షణ పొందానని చెప్పాడు. ఇక్కడ కూడా తాను విఫలమయ్యాయన్నాడు. మౌంట్ ఎల్‌బ్రుస్ అధిరోహణ కోసం శిక్షణ పొందానని చెప్పాడు. కానీ తాను మరోసారి విఫలమయ్యానని తెలిపాడు. ఆ తర్వాత నిరంతర అభ్యాసం, సరైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ వల్ల నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మనాలీలోని ఫ్రెండ్‌షిప్ శిఖరాలను విజయవంతంగా అధిరోహించానని తెలిపాడు. 


ఈ ట్రెక్ పూర్తి చేయడానికి తనకు మార్గదర్శనం చేసిన మెంటర్స్ భరత్, రోమిల్‌లకు ధన్యవాదాలు చెప్పాడు. సాయితేజ, చైతన్య తన కోచ్‌లని, బలం పుంజుకోవడం, కార్డియో సంబంధిత శిక్షణను ప్రశాంత్ ఇచ్చారన్నాడు. తన ఆహారాన్ని తన తల్లి తయారు చేస్తారని, ఆమె పోషక విలువలతోపాటు రుచిగా ఉండేవిధంగా వండుతారని చెప్పాడు. తగిన పాళ్లలో కొవ్వు, కార్బొహైడ్రేట్లు, కూరగాయలు, విటమిన్లు ఉండేవిధంగా వండుతారని చెప్పాడు. 


తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ 

తన తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ శిఖరారోహణ, ఏడు శిఖరాగ్రాల (Seven summits) అధిరోహణ అని చెప్పాడు. రక్షణ దళాల్లో చేరాలనేది తన ఆకాంక్ష అని తెలిపాడు. 


నాకు రోడ్డు దాటడానికి భయం

విశ్వనాథ్ కార్తికేయ తల్లి లక్ష్మి మాట్లాడుతూ, తనకు రోడ్డు దాటడమన్నా భయమేనని, అలాంటిది తన కుమారుడు అంత ఎత్తుకు చేరుకున్నాడంటే తనకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. తన మనసులోని భావాలను వర్ణించడానికి మాటలు లేవని చెప్పారు. తాము విశ్వనాథ్‌ను రోజూ ఉదయం 5 గంటలకు మేలుకొలిపి, జిమ్‌కు తీసుకెళ్ళేవారమని తెలిపారు. శిక్షణ ముగించుకుని ఇంటికి వచ్చి, మళ్లీ పాఠశాలకు వెళ్లేవాడన్నారు. 


విశ్వనాథ్ సోదరి వైష్ణవి మాట్లాడుతూ, తన సోదరుడు అతని లక్ష్యాలను సాధించడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. అతను చేసిన కృషిని తాను తన కళ్ళారా చూశానని చెప్పారు. ఆయన ఓ వ్యక్తిగా ఎదిగాడని, పరిపక్వత సాధించాడని అన్నారు. 


విశ్వనాథ్‌కు శిక్షణ ఇస్తున్న భరత్ మాట్లాడుతూ, చాలాసార్లు విఫలమయ్యానని విశ్వనాథ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు పరిస్థితి చాలా మారిందని చెప్పారు. 


Read more