Pakistan Floods : పాక్ వరద బాధితులను ఆదుకున్న హిందూ మందిరం

ABN , First Publish Date - 2022-09-11T23:45:18+05:30 IST

వరద బీభత్సంతో అతలాకుతలమైన పాకిస్థాన్‌లో లక్షలాది మంది

Pakistan Floods : పాక్ వరద బాధితులను ఆదుకున్న హిందూ మందిరం

కరాచీ (పాకిస్థాన్) : వరద బీభత్సంతో అతలాకుతలమైన పాకిస్థాన్‌లో లక్షలాది మంది అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి సమయంలో బలూచిస్థాన్‌లోని ఓ కుగ్రామంలో ఉన్న ఓ హిందూ మందిరం సుమారు 300 మందిని ఆదుకుంది. ఇక్కడ ఆహారం, ఆశ్రయం పొందినవారిలో అత్యధికులు ముస్లింలు కావడం విశేషం. 


కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ గ్రామంలో బాబా మాధవ్ దాస్ మందిరం ఉంది. ఇది ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో వరద తాకిడిని తట్టుకోగలిగింది. కారు చీకట్లో కాంతి రేఖ మాదిరిగా వరద బాధితులను ఆదుకుంటోంది. నారి, బోలన్, లేహ్రి నదులు ఉప్పొంగడంతో ఈ గ్రామానికి మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ మారుమూల గ్రామ ప్రజలు నిస్సహాయ స్థితిలో గడుపుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించిన హిందువులు వీరికి ఈ మందిరంలో ఆశ్రయం, భోజన వసతులు కల్పించారు. మనుషులకు మాత్రమే కాకుండా వారి వద్ద ఉన్న గొర్రెలు, మేకలు, పశువులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.  


మాధవ్ దాసు ఓ సాధువు. ఆయన కుల, మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూస్తూ, సేవలందించారు. మానవత్వానికి ప్రాధాన్యమిచ్చేవారు. ఆయనను హిందూ, ముస్లింలు గౌరవించేవారు. బలూచిస్థాన్ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ మందిరానికి వచ్చి, పూజలు చేస్తుంటారు. 


జలాల్ ఖాన్ గ్రామంలోని హిందువులు చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస పోయారు. కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ మందిరాన్ని కాపాడుకుంటూ, ఇక్కడ ఉంటున్నాయి. భాగ్ నారీలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్న రతన్ కుమార్ (55) ఈ మందిరం నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. బలూచిస్థాన్ వ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి వసతి కల్పించేందుకు దాదాపు 100 గదులను నిర్మించారు. వీటిలో కొన్ని గదులు వరద వల్ల దెబ్బతిన్నాయి. 


ఈ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్యుడు ఇస్రార్ ముఘేరీ మాట్లాడుతూ, వరదల్లో చిక్కుకున్న ముస్లింలు మందిరంలోకి రావాలని స్థానిక హిందువులు లౌడ్‌స్పీకర్ల ద్వారా పిలుపునిచ్చారని చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చి తలదాచుకున్న ముస్లింలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమకు ఆహారం, ఆశ్రయం ఇచ్చిన హిందువులకు రుణపడి ఉన్నామని చెప్తున్నారు. 


ఈ వివరాలను పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. వరదల నుంచి బయటపడినవారికి ఈ మందిరంలో ఆశ్రయం కల్పించడం స్థానిక హిందువులు మానవత్వానికి, మతసామరస్యానికి పెద్ద పీట వేస్తారని చెప్పడానికి నిదర్శనమని తెలిపింది. ఇది శతాబ్దాల నుంచి హిందువుల సంప్రదాయమని వివరించింది. 


పాకిస్థాన్ వరదల్లో దాదాపు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మూడో వంతు వరద నీటిలో చిక్కుకుంది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 3 కోట్ల 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 


Updated Date - 2022-09-11T23:45:18+05:30 IST