classroom scan: ఢిల్లీలో క్లాస్‌ రూం స్కాం

ABN , First Publish Date - 2022-11-26T02:47:31+05:30 IST

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దానిపై ప్రత్యేక విచారణ జరిపించాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫారసు చేసింది.

classroom scan: ఢిల్లీలో క్లాస్‌ రూం స్కాం

ప్రత్యేక దర్యాప్తునకు విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫారసు

న్యూఢిల్లీ, నవంబరు 25: ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దానిపై ప్రత్యేక విచారణ జరిపించాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫారసు చేసింది. మొత్తం 193 బడుల్లో 2,405 తరగతి గదుల నిర్మాణలో 1,300 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ విభాగం పేర్కొనడం మళ్లీ సంచలన చర్చకు కారణమైంది. వీటి నిర్మాణంలో భారీగా ఉల్లంఘనలు, అవినీతి చోటు చేసుకుందని, ఈ అవినీతి, అక్రమాలకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని కూడా విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సూచించింది. 2015లో సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతించింది. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) 2020 ఫిబ్రవరి 17న నివేదిక ఇచ్చింది. దీనిని ఢిల్లీ విజిలెన్స్‌ డైరెక్టరేట్‌కు పంపింది. అయితే, రెండేళ్లుగా దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక, ఈ నివేదికను కూడా ఆప్‌ నేత, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తప్పుబట్టారు. ఇవన్నీ బీజేపీ కార్యాలయంలో తయారైనవేనని ఆయన ఆరోపించారు.

కేజ్రీవాల్‌ హత్యకు బీజేపీ కుట్ర: సిసోడియా

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హత్యకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ స్థానిక ఎన్నికలు, గుజరాత్‌ ఎన్నికలలో ఆప్‌ దూసుకుపోతున్న తీరుతో భయపడుతున్న బీజేపీ నేతలు తమ నేతను హతమార్చే కుట్ర చేస్తున్నారని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రకు సహకరిస్తున్న బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ను తివారీ ఒక ట్వీట్‌లో బహిరంగంగానే బెదిరించారని తెలిపారు. సిసోడియా ఆరోపణలను తివారీ ఖండించారు. ‘సిసోడియాను అరెస్టు చేస్తారంటూ కేజ్రీవాల్‌, అతడిని చంపబోతున్నారంటూ సిసోడియా మాట్లాడతారు. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు’ అని తివారీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-26T02:47:32+05:30 IST