China : చదవడం, రాయడం రాదు కానీ, ఈమె చైనా హాటెస్ట్ మహిళ !
ABN , First Publish Date - 2022-11-06T19:34:52+05:30 IST
చదువు రాని వాళ్లు దిగులు చెందనక్కర్లేదు. దృఢ సంకల్పం, సృజనాత్మకత ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
బీజింగ్ : చదువు రాని వాళ్లు దిగులు చెందనక్కర్లేదు. దృఢ సంకల్పం, సృజనాత్మకత ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఇలాంటి సానుకూల దృక్పథంతోనే చైనా మహిళ టావో హువాబీ (Tao Huabi) ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి, ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. తన గ్రామస్థులకు ఉపాధి చూపించారు. ఫ్రిడ్జ్‌లు, కప్‌బోర్డుల్లో లావో గన్ మా స్పైసీ చిల్లీ క్రిస్ప్ (Lao Gan Ma Spicy Chilli Crisp) అనే హాట్ సాస్ (Hot Sauce)ను చూసిన ప్రతిసారీ ఆమె గుర్తుకు రావలసిందే.
వేరుశనగలు, సోయాబీన్స్, ఎంఎస్‌జీ, నూనె, మిరపకాయల ముక్కలతో తయారు చేసే ఈ సాస్‌కు చైనాలో గొప్ప ప్రజాదరణ ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఫోర్బ్స్ చైనా అంచనా ప్రకారం ఆమె ఆస్తి విలువ 1.05 బిలియన్ డాలర్లు.
టావో హువాబీ 1947లో గ్విఝౌ గ్రామంలో జన్మించారు. ఆమె మొదట్లో భవన నిర్మాణ పనులు చేసేవారు. ఆ తర్వాత కూరగాయలు అమ్మేవారు. దురదృష్టవశాత్తూ ఆమె భర్త మరణించారు. అనంతరం 1989లో షిహుయి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. చిల్లీ సాస్‌తో కూడిన ఆహారాన్ని తయారు చేసి, అమ్మేవారు. ఇక్కడికి వచ్చే ట్రక్ డ్రైవర్లకు ఉచితంగా సాస్ ప్యాకెట్లను ఇచ్చేవారు. దీంతో గొప్ప ప్రచారం లభించింది. 1996లో ఓ ఇంట్లో ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. 1997లో లావో గన్ మా స్పెషల్ ప్లేవర్ ఫుడ్‌స్టఫ్స్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ రోజుకు 1.3 మిలియన్ సీసాల (Bottles) సాస్‌ను తయారు చేస్తున్నారు.
ఆమె చేస్తున్న వ్యాపారం వల్ల గ్విఝౌ గ్రామ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఆ గ్రామం అత్యంత పేదరికంలో ఉండేది. 2016లో బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం ఈ గ్రామం 10.5 శాతం వృద్ధితో వర్ధిల్లుతోంది. చైనా జాతీయ వృద్ధి రేటు 6.7 శాతం కాగా, ఈ గ్రామం 10.5 శాతం వృద్ధితో దూసుకెళ్తుండటం విశేషం.