5జీ స్పెక్ట్రమ్ ‘వేలం’లో దగా
ABN , First Publish Date - 2022-08-10T06:14:29+05:30 IST
5జీ స్పెక్ట్రమ్ వేలంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పెక్ట్రమ్ వేలానికి ముందు ప్రభుత్వం చెప్పిన ఆదాయానికి, వేలం ద్వారా వచ్చిన ఆదాయానికి పొంతనే లేదు.

చెప్పింది కొండంత, వచ్చింది గోరంత.. కుమ్మ క్కైన కంపెనీలు ..
తక్కువ ధరకే బిడ్స్
న్యూఢిల్లీ : 5జీ స్పెక్ట్రమ్ వేలంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పెక్ట్రమ్ వేలానికి ముందు ప్రభుత్వం చెప్పిన ఆదాయానికి, వేలం ద్వారా వచ్చిన ఆదాయానికి పొంతనే లేదు. దీంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా ఖజనాకు ఎంత లేదన్నా రూ.5 లక్షల కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి వైష్ణవ్ ప్రకటించారు.
వచ్చింది రూ.1.5 లక్షల కోట్లే
ట్రాయ్ నిర్ణయించిన కనీస ధర (రిజర్వు ధర) ప్రకారం చూసినా 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా ఖజానాకు రూ.4.3 లక్షల కోట్లు రావాలి. వారం రోజుల పాటు జరిగిన ఈ వేలంలో ప్రభుత్వానికి సమకూరిన మొత్తం రూ.1.5 లక్ష కోట్లు మాత్రమే. అంటే ట్రాయ్ సూచించిన కనీస ధర కూడా రాలేదు.
కుంభకోణమే : ఏ రాజా
దీంతో 5జీ స్పెక్ట్రమ్ వేలం పెద్ద కుంభకోణమని విపక్షాలు ఆరోపణలకు దిగాయి. 2జీ కుంభకోణంలో తీహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టిన, మాజీ టెలికం మంత్రి ఏ.రాజా అయితే 5జీ స్పెకమ్ వేలం ముమ్మాటికీ పెద్ద కుంభకోణమన్నారు. కంపెనీలన్నీ కూడబలుక్కుని వేలం ‘ముసుగు’లో తక్కువ ధరకు 5జీ స్పెక్ట్రమ్ కొట్టేశాయని ఆరోపించారు. వేలం సరిగ్గా జరిగి ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఎంత లేదన్నా కనీసం ఐదారు లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఉండేవన్నారు.
నిరాధారం
ప్రభుత్వం మాత్రం విపక్షాల ఆరోపణల్ని కొట్టి వేస్తోంది. 5జీ సేవల కోసం మొత్తం 72,098 మెగాహెర్జ్‌ల స్పెకా్ట్రన్ని వేలానికి పెడితే కంపెనీలు 51,236 మెగాహెర్జ్‌ల స్పెక్ట్రమ్ (71 శాతం) కోసం మాత్రమే బిడ్స్ వేసిన విషయాన్ని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. బిడ్స్ రాని 5జీ స్పెక్ట్రమ్ ధరే రూ.2,81,432 కోట్ల వరకు ఉంటుందన్నారు. టెల్కోల ఆర్థిక పరిస్థితి బాగోక పోవడం, బరిలో మూడు కంపెనీలకు మించి లేకపోవడమూ ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 5జీ స్పెక్ట్రమ్‌లో అత్యంత ఖరీదైన 700-800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ జియో తప్ప, మరే కంపెనీ బిడ్ వేయక పోవడమూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది.
నామమాత్రంగా అదానీ బిడ్
అదానీ గ్రూపు కూడా 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. అయితే ఆ కంపెనీ తన సొంత అవసరాల కోసమే వేలంలో పాల్గొంది. కేవలం రూ.200 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ కోసం బిడ్స్ దాఖలు చేసింది. టెల్కోల్లా పూర్తి టెలికం సేవల కోసం అదానీ గ్రూపు రంగంలోకి దిగుంటే పోటీ ఎక్కువై ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
నెలాఖరులోగా 5జీ : ఎయిర్టెల్
ఈ నెలాఖరులోగా 5జీ సేవలు ప్రారంభిస్తామని ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ వెల్లడించారు. మార్చి, 2024కల్లా దేశంలోని 5,000 పట్టణాలు, నగరాలకు తమ 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిపారు. దేశంలో టెలికం ఛార్జీలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.