National Flags : చెత్త కుప్పలో జాతీయ జెండాలు... చెత్త వస్తువుల డీలర్‌ అరెస్ట్...

ABN , First Publish Date - 2022-07-19T23:48:24+05:30 IST

కేరళ (Kerala)లోని ఇరుంపణమ్‌లో జాతీయ జెండా (National Flag)కు అవమానం

National Flags : చెత్త కుప్పలో జాతీయ జెండాలు... చెత్త వస్తువుల డీలర్‌ అరెస్ట్...

తిరువనంతపురం : కేరళ (Kerala)లోని ఇరుంపణమ్‌లో జాతీయ జెండా (National Flag)కు అవమానం జరిగిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) నుంచి కాంట్రాక్టు పొందిన డీలర్ సజర్ కాగా, మిగిలిన ఇద్దరు ఆయన నియమించుకున్న సిబ్బంది. వీరి వద్దకు జాతీయ జెండాలు ఎలా చేరాయి? అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. 


రోడ్డు పక్కన చెత్త కుప్పలో జాతీయ జెండాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ లైఫ్ జాకెట్లు కనిపించడంతో, జూలై 12న స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసు అధికారి అమల్ టీకే (Amal TK) ఆ ప్రదేశానికి వెళ్ళి, మన దేశానికి ప్రతిరూపమైన జాతీయ జెండాలను చూసి, గౌరవ వందనం చేశారు. స్థానికుడు పీఆర్ నాయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చెత్త కుప్పలో పడి ఉన్న జాతీయ జెండాకు పోలీసు అధికారి అమల్ గౌరవ వందనం చేసినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ అధికారి అందరి ప్రశంసలు అందుకున్నారు. 


గుర్తు తెలియని నిందితులపై జాతీయ గౌరవ చిహ్నాలకు అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 2 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూలై 11-12 మధ్య రాత్రి జాతీయ జెండాలను, Coast Guard లైఫ్ జాకెట్లను ఈ ప్రదేశంలో పడేసినట్లు గుర్తించారు. తొప్పుంపడికి చెందిన సజర్, కిఝకంబళంకు చెందిన షమీర్, ఇడుక్కికి చెందిన మణి భాస్కర్‌లను అరెస్టు చేశారు. అనంతరం భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 278 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో చెత్త వేశారనే  ఆరోపణలను జోడించారు. 


కొచ్చి (Kochi)లోని భారత నావికా దళ స్థావరం, మెటీరియల్ ఆఫీస్ నుంచి స్క్రాప్ కాంట్రాక్ట్ పొందిన సజర్‌ను అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేశారు. ఆయన నియమించుకున్న సిబ్బంది షమీర్, మణి భాస్కర్‌లకు కోర్టు రిమాండ్ విధించింది. నేరం రుజువైతే దోషులకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష, లేదా జరిమానా లేదా ఈ రెండు శిక్షలను విధించే అవకాశం ఉంది. 


జాతీయ జెండా స్మృతి, 2002 (The Flag Code of India, 2002) ప్రకారం జెండా పాడైనట్లయితే లేదా మురికి పట్టడం, మరకలు పడటం వంటివి జరిగితే, దాని ఉనికిని గోప్యంగా పోగొట్టాలి. దానికిగల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని దహనం చేయడం ద్వారా కానీ, వేరొక పద్ధతిలో కానీ దాని ఉనికిని పోగొట్టాలి. కాగితపు జెండాలను కూడా నేలపై పడేయకూడదు. 


కొచ్చిలోని రక్షణ రంగ శాఖ ప్రజా సంబంధాల అధికారి (PRO) కమాండర్ అతుల్ మాట్లాడుతూ, ఫ్లాగ్ కోడ్ నిబంధనల ప్రకారం జాతీయ జెండాలను విసర్జిస్తామని తెలిపారు. పాత జెండాలను గౌరవప్రదంగా మడతపెట్టి, దహన పేటికలో దహనం చేస్తామని, లేదంటే ఓ పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెడతామని తెలిపారు. అయితే ప్రస్తుత కేసులో చెత్త కుప్పలోకి జాతీయ జెండాలు ఏ విధంగా వచ్చాయో ఇప్పటికప్పుడు తాను చెప్పలేనన్నారు. దీనిపై అంతర్గత దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. స్థానిక పోలీసులకు కూడా తాము సహకరిస్తున్నామన్నారు. స్క్రాప్ కాంట్రాక్టుల మంజూరు కోసం ఆన్‌లైన్ టెండరింగ్ విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. రక్షణ స్థావరాల ప్రాంగణాలలో పని చేసేవారిని ఎంపిక చేసేటపుడు ముందుగా స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల విషయంలో ఇప్పటి వరకు అలాంటి విధానాన్ని అనుసరించలేదని వివరించారు. 


సజర్ మాట్లాడుతూ, తాను గతంలో చాలాసార్లు ఇటువంటి స్క్రాప్ కాంట్రాక్టులను పొందానని తెలిపారు. నౌకను విడిభాగాలుగా విడగొట్టి, విలువైన వ్యర్థాలను తీసుకుంటామని చెప్పారు. బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలను ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తూ ఉంటామన్నారు. ఈసారి తాను వ్యర్థాలను పారబోసే బాధ్యతను షమీర్‌కు అప్పగించానని చెప్పారు. వ్యర్థాలన్నిటినీ షమీర్‌కు విక్రయించానని తెలిపారు. ఈ వ్యర్థాలలో జాతీయ జెండాలు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. జాతీయ జెండాలను రోడ్డుపక్కన పడేసినట్లు వార్తలు వచ్చిన తర్వాత మాత్రమే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. 


సజర్ సోదరుడు, వ్యాపార భాగస్వామి అబీ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తవహిస్తామన్నారు. మెటీరియల్స్‌ను రవాణా చేయడానికి ముందు కోస్ట్ గార్డ్‌ చేత నిరభ్యంతర ధ్రువపత్రంపై సంతకం చేయించుకుంటామన్నారు. 


Read more