20వేల మంది భారతీయులు సేఫ్‌!

ABN , First Publish Date - 2022-03-07T07:51:06+05:30 IST

20వేల మంది భారతీయులు సేఫ్‌!

20వేల మంది భారతీయులు సేఫ్‌!

వీరంతా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు.. చివరి దశకు చేరుకున్న ‘ఆపరేషన్‌ గంగ’

8 ఇప్పటిదాకా 15920 మంది భారత్‌కు


న్యూఢిల్లీ, మార్చి 6: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమ పిల్లల గురించి 10-15 రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఊరట!  రష్యా యుద్ధం, ఉక్రెయిన్‌ బలగాల ప్రతిఘటనతో కల్లోలంగా మారిన ఆ దేశం ‘ఖాళీ’ అవుతోంది. ఉక్రెయిన్‌లో ఉన్నవారిలో 20వేల మంది భారతీయులు సరిహద్దు దేశాలకు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘ఆపరేషన్‌ గంగ’ కింద ఇప్పటిదాకా సరిహద్దు దేశాల నుంచి 76 విమానాల్లో 15,920 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించింది. అటు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ‘ముఖ్యమైన ప్రకటన’ను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో సొంత ఆవాసాల్లో ఉన్న భారతీయులు ఆదివారం ఉదయం 10 గంటల్లోపు (స్థానిక కాలమానం ప్రకారం) హంగరీ రాజధాని బుడాపె్‌స్టలోని ‘హంగరియా సిటీ సెంటర్‌’కు చేరుకోవాలని సూచించింది. తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ గూగుల్‌ దరఖాస్తును పోస్ట్‌ చేశామని.. ఇంకా ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులంతా తమ వివరాలను వెంటనే అందులో పొందుపర్చాలని సూచించింది. రష్యాకు దగ్గర్లోని, తూర్పు ఉక్రెయిన్‌ నగరం పిసోచియన్‌ నుంచి భారతీయులందరినీ తరలించినట్లు రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే వారంతా నగరాన్ని వీడినా సురక్షితంగా స్వదేశానికి వెళ్లేదాకా టచ్‌లో ఉంటామని, భారతీయుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. అంతకుముందు పిసోచియన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బాగ్చి శనివారం ఓ ప్రకటన చేశారు. ‘‘గత 24 గంటల్లో 18 విమానాలు భారత్‌లో దిగాయి. దాదాపు 4వేల మంది స్వదేశానికి చేరుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం 48 విమానాల్లో 10,348 మంది భారత్‌లో దిగారు’’ అని పేర్కొన్నారు. సోమవారం ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి 1500 మంది భారతీయులతో 8 విమానాలు బయలుదేరుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఆదివారం 11 విమానాల్లో 2,135 మంది స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించింది. సూమెలోని విద్యార్థుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రష్యా దాడులతో ఉద్రిక్తంగా మారిన నగరంలో బిక్కుబిక్కుమంటున్న 700 మంది విద్యార్థులు బంకర్ల కిందే కాలం వెళ్లదీస్తున్నారు. తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. తాగేందుకు నీళ్లు లేకపోవడంతో మంచును కరిగించి ఆ నీళ్లతోనే దాహం తీర్చుకుంటున్నారు. 


మీ వల్లే.. కాదు వల్లే

దక్షిణ ఉక్రెయిన్‌లోని పోర్టు సిటీ మరియుపల్‌లో బలగాల కాల్పుల మోతతో ఇంకా భీతావహ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ అమలయ్యేదెప్పుడో? ఆ నగరంలో ఉన్న 4లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలేదెప్పుడో? తెలియడం లేదు. తాత్కాలికంగా యుద్ధాన్ని విరమించి అక్కడున్న ప్రజలందరినీ రెడ్‌క్రా్‌సకు చెందిన వాహనాల ద్వారా నగరం దాటించేందుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలనే ప్రక్రియకు శనివారం ఉక్రెయిన్‌-రష్యా అంగీకరించాయి. అయితే ఆ కాసేపటికే కాల్పులు జరగడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఆదివారం కొన్ని గంటలు కాల్పుల విరమణను అమలు చేయాలని, ప్రజలందరినీ తరించాలని నిర్ణయించారు. ఇదీ అమలుకు నోచుకోలేదు. రెండుసార్లూ వైఫల్యానికి కారణం మీరంటే మీరే అంటూ రష్యా అనుకూల వేర్పాటు వాదులు, ఉక్రెయిన్‌ నేషనల్‌గార్డ్‌ బృందం సభ్యులు పరస్పరం విమర్శించుకున్నారు.తోటి విద్యార్థులకు ఆపన్న హస్తం!

న్యూఢిల్లీ/కీవ్‌, మార్చి 6: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తోటి విద్యార్థులకు సాయం చేసేందుకు వివిధ దేశాల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. చైనా, ఉజ్బెకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌లో చదువుతున్న వైద్యవిద్యార్థులు వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సోషల్‌మీడియా గ్రూపులను ఏర్పాటు చేసి.. ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా ఉంటున్నారు. వీరిలో చాలా మంది తమవర్సిటీల్లో ఉంటూనే సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరోనా కారణంగా భారత్‌కు వచ్చి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న వారు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘‘కీవ్‌లో నలుగురు వెళ్లడానికి క్యాబ్‌ కావాలి. సరిహద్దుల్లో ఆహార పొట్లాలు అందించడానికి పోలండ్‌లో ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా? ఖార్కివ్‌ నుంచి ఒక బృందం బయల్దేరింది.. రైళ్ల గురించి ఏమైనా సమాచారం ఉందా?..’’ ఇలాంటి వేల మెసేజ్‌లు ఆయా గ్రూపులకు నిరంతరం వస్తూనే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. గతంలో తాము ఇలాంటి గ్రూపుల ద్వారా ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన వివరాలు, నోటిఫికేషన్ల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేవాళ్లమని చైనాలోని హర్బిన్‌ మెడికల్‌ వర్సిటీలో చదువుతున్న పి.శర్మ తెలిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో తోటి విద్యార్థులకు సాయపడేందుకు ఈ గ్రూపులను ఎందుకు వాడుకోకూడదన్న ఆలోచన వచ్చిందన్నారు. ప్రతి 15 నిమిషాలకు 100కు పైగా మెసేజ్‌లు వస్తున్నాయని ఓ విద్యార్థి వెల్లడించారు. ఎంబసీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-03-07T07:51:06+05:30 IST