Maharashtra crisis: 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు
ABN , First Publish Date - 2022-06-25T22:57:26+05:30 IST
తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శివసేన రంగం

ముంబై : తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అస్సాంలోని గువాహటిలో బస చేసిన శివసేన చీలిక వర్గంలోని ఎమ్మెల్యేలకు శనివారం మహారాష్ట్ర శాసన సభ ఉప సభాపతి అనర్హత నోటీసులు పంపించారు. సోమవారంనాటికి సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంతకుముందు మాట్లాడుతూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తీసుకునే చర్యల వివరాలను శనివారం సాయంత్రానికి అందరూ తెలుసుకోవచ్చునన్నారు. ఉద్ధవ్ చేసిన కృషి ప్రశంసనీయమైనదన్నారు. తామంతా ఆయన నేతృత్వంలోనే ఎన్నికల్లో పోరాడుతామని తెలిపారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ కూటమి సమైక్యంగా ఉందన్నారు. శివసేన నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఓట్లను అడగాలనుకుంటే, శివసేన, బాలా సాహెబ్ పేర్లను ఉపయోగించుకోకూడదన్నారు. శివసేనకు ద్రోహం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీని వీడినవారిపై చర్య తీసుకునే అధికారం ఉద్ధవ్ థాకరేకు ఉందన్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం బాలా సాహెబ్ థాకరే పేరును ఉపయోగించుకునేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీని వీడినవారు శివసేన వ్యవస్థాపకుని పేరును వాడుకోకూడదన్నారు.
సమైక్య మహారాష్ట్ర, హిందుత్వ సిద్ధాంతాలతో తమ పార్టీ రాజీ పడబోదని చెప్పారు. ఈ సిద్ధాంతాలపై తాము ఆరు తీర్మానాలను ఆమోదించామని చెప్పారు.
ఇదిలావుండగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ పేరును నిర్ణయించుకున్నారు. ఈ వర్గం ప్రతినిధి, రెబల్ ఎమ్మెల్యే దీపక్ కెసార్కర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తమ గ్రూప్‌ను ‘శివసేన బాలా సాహెబ్’గా పిలుస్తామని చెప్పారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కెసార్కర్ ఈ ప్రకటన చేశారు.