రష్యా సైనిక కేంద్రంలో కాల్పులు 11 మంది సైనికుల మృతి
ABN , First Publish Date - 2022-10-17T08:45:06+05:30 IST
రష్యా సైనిక శిక్షణ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది సైనికులు మరణించారు.
- మరో 15 మందికి గాయాలు
- ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఘటన
మాస్కో, అక్టోబరు 16: రష్యా సైనిక శిక్షణ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది సైనికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న ఓ గ్రూపుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులను సైన్యం కాల్చి చంపినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు తగులుతున్న ఎదురుదెబ్బల్లో ఇదొకటి. ఈ నగరంలో విద్యుత్, ఇంధన సరఫరా వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్ తరచుగా దాడులకు పాల్పడుతోందని అధికారులు ఆరోపిస్తున్నారు.