కఠిన నిర్ణయాలు తప్పవు

ABN , First Publish Date - 2022-10-26T04:33:09+05:30 IST

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ.. తన ప్రాధామ్యాలేమిటో పేర్కొంటూ.. వాటిని నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తానని హామీ ఇచ్చారు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌.

కఠిన నిర్ణయాలు  తప్పవు

మీడియాతో ప్రధాని రిషి

లండన్‌, అక్టోబరు 25: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ.. తన ప్రాధామ్యాలేమిటో పేర్కొంటూ.. వాటిని నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తానని హామీ ఇచ్చారు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌. మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లె్‌స-3ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లలో ఉందని.. అయినప్పటికీ భవిష్యత్‌ తరాలను రుణ ఊబిలో వదిలేయలేమని, అందుకని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. శక్తివంచన లేకుండా పనిచేశారంటూ లిజ్‌ ట్రస్‌ను కొనియాడుతూనే ఆమె హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు తక్షణమే రంగంలోకి దిగుతానని ప్రకటించారు. ‘‘ఇందుకోసమే నన్ను ప్రధానిగా, పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆర్థిక స్థిరత్వం, నమ్మకం చూరగొనడం నా ప్రథమ ప్రాధాన్యాలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మాటలతో కాదు చేతలతో దేశాన్ని ఏకతాటి పైకి తెస్తా. అందరం కలిసి పనిచేస్తే అద్భుతాలు సాధించగలం’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనతో పాటు ఆరోగ్య, విద్య, భద్రతను బలోపేతం చేస్తానని.. సాయుధ దళాలకు మద్దతుగా నిలుస్తానని రిషి సునాక్‌ తెలిపారు.

చర్చిల్‌ తర్వాత.. పొట్టి ప్రధాని

ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న విన్‌స్టన్‌ చర్చిల్‌ ఎత్తు 5.5 అడుగులు! ఆయన తర్వాత ప్రధానులైన పురుషులంతా 5.7 అడుగులు, అంతకు మించి ఎత్తున్నవారే. మహిళా ప్రధానులైన మార్గరెట్‌ థాచర్‌, లిజ్‌ ట్రస్‌లిద్దరి ఎత్తూ 5.5 అడుగులే. అయితే వారు మహిళలు కావడంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు 5.6 అడుగుల ఎత్తున్న రిషి సునాక్‌ ప్రధాని కావడంతో బ్రిటన్‌ మీడియాలో ఇది కూడా ఒక వార్తాంశంగా మారింది. ప్రస్తుతం యూరప్‌ దేశాల్లో 5.7 అడుగులు, అంతకన్నా తక్కువ ఎత్తున్న దేశాధినేతలు నలుగురే. ఒకరు రిషి సునాక్‌ కాగా.. మరొకరు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (5.7 అడుగులు), జర్మనీ చాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ (5.5 అడుగులు), ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ (5.5 అడుగులు).

Updated Date - 2022-10-26T04:33:10+05:30 IST