గురుకులాల్లో 9,256 పోస్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-31T03:41:16+05:30 IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు చెందిన అన్ని విద్యా సంస్థల్లో వివిధ విభాగాల్లోని 9,256 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు.

గురుకులాల్లో 9,256 పోస్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభం

జనవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ విడుదల

ట్రిబ్‌ ద్వారా 8,710 పోస్టులు.. మెడికల్‌ బోర్డు ద్వారా మిగతా 546 పోస్టుల భర్తీ

హైదరాబాదు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు చెందిన అన్ని విద్యా సంస్థల్లో వివిధ విభాగాల్లోని 9,256 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఈ పోస్టులు గతంలోనే మంజూరైనప్పటికీ పూర్తి స్థాయిలో పోస్టుల గుర్తింపు తాజాగా పూర్తికావడంతో వీటి భర్తీకి అధికారులు ఉపక్రమించారు. జనవరి రెండోవారంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 9,256 పోస్టుల్లో 546 స్టాఫ్‌ నర్సు పోస్టులున్నాయి. ఈ స్టాఫ్‌ నర్సుల పోస్టులు రాష్ట్ర మెడికల్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనుండగా, మిగతా 8,710 పోస్టులు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంఽధించిన పరీక్షలను కూడా ఆయా శాఖలే ఈ బోర్డు ద్వారా నిర్వహించనున్నాయి. తాజాగా భర్తీ కానున్న వాటిలో అత్యధికంగా మహాత్మ జ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్‌లో 3,673 పోస్టులుండగా, సోషల్‌ వెల్ఫేర్‌లో 2,143, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 1,440, మైనారిటీలో 1,318, ట్రైస్‌లో 93, దివ్యాంగుల వెల్ఫేర్‌లో 43 పోస్టులు ఉన్నాయి. కాగా బీసీ గురుకులాల్లో గతంలోనే గుర్తించిన దాదాపు 3 వేల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

Updated Date - 2022-12-31T03:41:16+05:30 IST

Read more