3 తెలంగాణ ప్రాజెక్టులకు టీఏసీ ఆమోదం

ABN , First Publish Date - 2022-11-30T02:15:37+05:30 IST

తెలంగాణ చేపడుతున్న మూడు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది.

3 తెలంగాణ ప్రాజెక్టులకు టీఏసీ ఆమోదం

ముక్తేశ్వర, చౌటపల్లి ఎత్తిపోతల, చనాక కొరాట బ్యారేజీకి గ్రీన్‌ సిగ్నల్‌

ఇక అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతియే తరువాయి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నవంబరు29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ చేపడుతున్న మూడు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ కా ర్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కార్యాలయంలో టీఏసీ సమావేశం జరిగింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్‌ జిల్లాలోని చనాక కొరాట బ్యారేజీ, నిజామాబాద్‌ జిల్లాలోని చౌటపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులకు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ వెల్లడించింది. కాగా, గోదావరి నదీ యాజమన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేస్తూ 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో ఈ మూడు ప్రాజెక్టులను ఆ మోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొంది. ఈ రీత్యా ఈ మూడింటికి సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను కేంద్ర జల సంఘానికి, జీఆర్‌ఎంబీకి 2021 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలసం ఘం వాటిని జీఆర్‌ఎంబీకి పంపించిందని రాష్ట్ర ప్రభు త్వ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను పునఃసమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వవచ్చునని టీఏసీకి కేంద్ర జలసంఘం సిఫారసు చేసిందని పేర్కొన్నారు. దీంతో మూడు ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు టీఏసీ చైర్మన్‌ పంకజ్‌ కుమార్‌ ప్రకటించారని వివరించారు. కాగా, ఈ డీపీఆర్‌లను తదుపరి అనుమతుల కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ (కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాల సీఎంలు)కు పంపించనున్నారు. సమావేశంలో జల శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ ఆర్‌ కె గుప్త, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌ పాల్గొన్నారు.

తగ్గిన అనుమతి లేని ప్రాజెక్టుల సంఖ్య

తెలంగాణలోని గోదావరిపై 11 ప్రాజెక్టులను అనుమతి లేని జాబితాలో కేంద్రం చేర్చిన విషయం విదితమే. ఇందులో కాంతన పల్లి ప్రాజెక్టును గతంలోనే వెనక్కితీసుకోగా... రామప్ప-పాకాల లింకు, కందకుర్తి, కాళేశ్వరం అదనపు టీఎంసీని జాబితా నుంచి తీసేయాలని తెలంగాణ గతంలోనే విజ్ఙప్తి చేసుకుంది. గోదావరిలో మొత్తం ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించగా... అందులో మూడింటికి ఆమోదం తెలుపగా... మిగిలిన మూడు(సీతారామ, తుపాకులగూడెం, మొడికుంటవాగుల) డీపీఆర్‌లు సీడబ్ల్యూసీలోనే ఉన్నాయి.

ప్రాజెక్టుల ప్రత్యేకతలు

చనకా కొరాటా: పెన్‌గంగా నదిపై చేపట్టిన అం తరాష్ట్ర ప్రాజెక్టు ఇది. 1.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన బ్యారేజీలో 1.20 టీఎంసీలు తెలంగాణ, 0.30 టీఎంసీలు మహారాష్ట్ర వినియోగించేలా నిర్మాణం చేపట్టారు. రూ.452.50 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రూ.409.44 కోట్లు తెలంగాణ వాటా కాగా... మిగిలిన రూ.43.06 కోట్లు మహారాష్ట్ర వాటా. ప్రాజెక్టు నిర్మాణం కోసం 455 ఎకరాలు సేకరించారు. ఇందులో 453 ఎకరాలు ప్రైవేట్‌ భూములు కాగా... మిగిలింది అటవీ భూమి. 13,753 ఎకరాలకు ఈ బ్యారేజీ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించనున్నారు.

చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్‌) ఎత్తిపోతలు: సాగు, తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టును జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్మించారు. 4.50 టీఎంసీలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 4.20 టీఎంసీలు సాగునీటి అవసరాలకు, 0.30 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. 45 వేల ఎకరాల కు సాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నారు. రూ.545.15 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో 63 గ్రామాల ప్రజలకు మేలు జరుగనుంది.

చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు: 0.80 టీఎంసీల సామర్థ్యంతో 8297 ఎకరాలకు నిజామాబాద్‌ జిల్లాలో నీటిని అందించడానికి వీలుగా దీన్ని పూర్తిచేశారు. 28 చెరువులను నింపడం ద్వారా 5,807 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 2,490 ఎకరాలకు నేరుగా నీటిని అందించేలా రూ.48.20 కోట్లతో పూర్తిచేశారు.

Updated Date - 2022-11-30T02:15:37+05:30 IST

Read more