Twitter: ఒక్క వార్నింగ్‌తో దిగొచ్చిన ఎలాన్ మస్క్.. ట్విటర్‌లో బహిరంగంగానే..

ABN , First Publish Date - 2022-11-01T16:41:42+05:30 IST

బ్లూ టిక్ మార్క్ విషయంలో ప్రముఖ రచయితతో ఎలాన్ మస్క్ బేరసారాలు

Twitter: ఒక్క వార్నింగ్‌తో దిగొచ్చిన ఎలాన్ మస్క్.. ట్విటర్‌లో బహిరంగంగానే..

ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్(Twitter) ఖాతాలను వెరిఫై చేసే నీలి రంగు టిక్ మార్క్‌ల(Blue Tick) కోసం యూజర్లు ఇకపై డబ్బు చెల్లించక తప్పదన్న వార్త నెట్టింట్లో పెద్ద చర్చకే దారితీసింది. కొద్ది రోజుల క్రితమే ట్విటర్‌ను చేజిక్కించుకున్న టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk).. ట్విటర్‌ను లాభాలబాట పట్టించేందుకే ఈ కొత్త ఆలోచనను ప్రజల ముందుంచారు. అయితే..నెటిజన్లకు ఇది అంతగా నచ్చడం లేదు. దీనిపై ప్రముఖులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్(Stephen King) ట్విటర్ వేదికగానే దీన్ని వ్యతిరేకించారు. ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘ఏంటి.. నా అకౌంట్‌కు బ్లూ టిక్ మార్క్ కొనసాగాలంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలా..? అలా అయితే నాకది అవసరమే లేదు.. అసలు వాళ్లే నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నేను ఇక్కడ ఉండను..’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ కావడంతో మస్క్ వెంటనే రంగంలోకి దిగారు. ట్విటర్ వేదికగా అందరూ చూస్తుండగానే బేరసారాలకు(Negotiations) దిగారు.

‘మాకూ బోలెడన్ని ఖర్చులు ఉంటాయి.. కేవలం ప్రకటనల ఆధారంగా ట్విటర్ నిర్వహణ కష్టం. 8 డాలర్లు అయితే మీకు ఓకేనా’’ అంటూ స్టీఫెన్ కింగ్‌కు మెసేజ్ పెట్టారు. అంతేకాకుండా..బాట్స్, ట్రోల్స్‌ను నిరోధించాలంటే ఇదొక్కటే మార్గమని కూడా చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని అమలు పరిచేలోపే అన్ని కారణాలను వివరిస్తా అని మాటిచ్చారు. అయితే.. అందరూ చూస్తుండగా జరిగిన ఈ బేరసారాలు ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఇదంతా కూరగాయల బేరాలను తలపిస్తున్నాయంటూ మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 5 డాలర్లకైతే నేను రెడీ అంటూ కొందరు జోకులు పేల్చారు. ఇలాంటి చర్యలు ట్విటర్‌లో పారదర్శకంగా జరగడం కొందరు హర్షం వ్యక్తం చేశారు.

ఇక ట్విటర్‌లో సమూల మార్పులు తెచ్చేందుకు మస్క్ రంగంలోకి దిగారు. సంస్థ తన చేతికొచ్చిన తొలి రోజే మస్క్.. అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించడంతో పాటూ పలువురు కీలక అధికారులకు గుడ్ బై చెప్పేశారు. పరాగ్ స్థానంలో.. మరో భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 16జెడ్ క్రిప్టో అనే సంస్థలో మస్క్‌, కృష్ణన్ భాగస్వాములుగా ఉన్నారు. ట్విటర్‌లో తాను కోరుకున్న మార్పులు చేసేందుకు మస్క్.. తన స్నేహితులను కూడా రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగించి ఖర్చులు తగ్గించుకునేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారట. ట్విటర్‌ను లాభాల బాట పట్టించడంతో పాటూ దాన్ని వాక్ స్వాతంత్ర్యానికి అసలైన నిర్వచనంగా మారుస్తానని మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-01T16:41:47+05:30 IST