China: కొవిడ్ ఆంక్షల సడలింపు.. భయాందోళనలో చైనా ప్రభుత్వం..

ABN , First Publish Date - 2022-12-15T21:22:30+05:30 IST

ప్రజల డిమాండ్ మేరకు కొవిడ్ ఆంక్షలను సడలించిన చైనా ప్రభుత్వం కొవిడ్ కేసులు పెరుగుతాయన్న భయంతో పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం చేపడుతోంది.

China: కొవిడ్ ఆంక్షల సడలింపు.. భయాందోళనలో చైనా ప్రభుత్వం..

ఇంటర్నెట్ డెస్క్: ప్రజల డిమాండ్ మేరకు కొవిడ్ ఆంక్షలను సడలించిన చైనా(China) ప్రభుత్వం కొవిడ్ కేసులు(Covid Cases Rise) పెరుగుతాయన్న భయంతో పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం(Vaccination) చేపడుతోంది. కొవిడ్ ప్రమాదం అధికంగా ఉన్న వారికి యుద్ధప్రాతిపదికన కరోనా టీకాలు వేస్తోంది. గురువారం నాడు ఏకంగా మిలియన్ మందికి కరోనా టీకా ఇచ్చింది. జీరో కొవిడ్ పాలసీతో(Zero Covid Policy) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ప్రభుత్వం కేసుల సంఖ్య మాత్రం అదుపులో ఉంచగలిగింది. కానీ.. తాజా ఆంక్షల సడలింపు(Easing Corona Restrictions) నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ప్రజలకు కరోనా టీకాలు ఆశించిన స్థాయిలో అందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. టీకాకరణలో చైనాకు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.

గత బుధవారం నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షల సడలింపు ప్రారంభించింది. క్వారంటైన్ నిబంధనలను సడలించడం, తప్పనిసరి కరోనా టెస్టులకు ముగింపు చెప్పడం వంటి చర్యలకు పూనుకుంది. చైనా అధ్యక్షుడు మెచ్చిన జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే.. ఆంక్షల సడలింపునకు ముందే చైనాలో కేసులు పెరిగిపోయాయని ప్రపంచఆరోగ్య సంస్థ అత్యవసర వ్యవహారాల విభాగం డైరెక్టర్ మైక్ రయాన్ తెలిపారు. ‘‘ఆంక్షల సడలింపు తరువాత కేసులు పెరిగిపోయాయన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది. అయితే.. ప్రభుత్వం అనుసరించిన కరోనా చర్యలు వ్యాప్తిని అడ్డుకోలేకపోయాయి. దీంతో.. ఈ విధానం తగినది కాదని ప్రభుత్వం నిర్ణయించిందని నేను భావిస్తున్నాను’’ అని మైక్ రయాన్ చైనా ఆంక్షల సడలింపుపై వ్యాఖ్యానించారు. కాగా.. జీరో కొవిడ్ పాలసీ ముగింపుతో కరోనా పేట్రేగిపోతుందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. జ్వరంతో ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. క్లినిక్‌ల వద్ద రోగులు క్యూ కడుతున్నారు. ముందుజాగ్రత్త పేరిట మెడికల్ షాపుల్లో భారీగా ఔషధాల కొనుగోళ్లకు తెగబడుతున్నారు.

Updated Date - 2022-12-15T21:29:05+05:30 IST