Ttaxi Strike: కేప్‌టౌన్‌లో ట్యాక్సీల సమ్మె.. బస్సులకు నిప్పు

ABN , First Publish Date - 2022-11-22T17:19:06+05:30 IST

దక్షిణాఫ్రికా రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌ (Cape Town)లో ట్యాక్సీల సమ్మె హింసాత్మకంగా మారింది. నిధుల లేమి కారణంగా

Ttaxi Strike: కేప్‌టౌన్‌లో ట్యాక్సీల సమ్మె.. బస్సులకు నిప్పు

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌ (Cape Town)లో ట్యాక్సీల సమ్మె హింసాత్మకంగా మారింది. నిధుల లేమి కారణంగా ట్యాక్సీ డ్రైవర్లకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ ప్రోగ్రాంను ప్రావిన్షియల్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో క్యాబ్ డ్రైవర్లు భగ్గుమన్నారు. దీనికి వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మెకు స్థానిక ట్యాక్సీ యూనియన్లు పిలుపునిచ్చాయి. సురక్షిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు ఇన్సెంటివ్ పథకాన్ని ఏడాదికిపైగా అమలు చేస్తోంది.

అయితే, నిధుల కొరత వేధిస్తుండడంతో ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై ట్యాక్సీ డ్రైవర్లు భగ్గుమన్నారు. సోమవారం నుంచి రెండు రోజుల సమ్మె (Taxi Strike)కు ట్యాక్సీ అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. ట్యాక్సీలు నిలిచిపోవడంతో రవాణా సౌకర్యం లేక పనులు, స్కూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. బస్టాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ బస్సుపై దాడిచేశాడు. దానిని ఆపేందుకు టైర్లపై కాల్పులు జరిపాడు. దీంతో భయపడిన ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు కానీ, డ్రైవర్ కానీ గాయపడలేదని గోల్డెన్ యారో బస్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంస్థ కేప్‌టౌన్‌లో 1100 బస్సులను నడుపుతోంది. తమ బస్సుల్లో ఒకదానికి దుండగులు నిప్పు పెట్టినట్టు సంస్థ ధ్రువీకరించింది. కేప్‌టౌన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజర్ జేపీ స్మిత్ మాట్లాడుతూ.. బస్సులను అడ్డుకున్న ఘటనలు చాలానే జరిగినట్టు చెప్పారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ప్రస్తుతం పోలీసుల భద్రత నడుమ బస్సులను నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-11-22T17:19:09+05:30 IST