China : పట్టు బిగించిన జీ జిన్‌పింగ్... భారీ నష్టాల్లో చైనా కుబేరులు...

ABN , First Publish Date - 2022-10-24T18:10:36+05:30 IST

చైనా ప్రభుత్వంపై ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) పట్టు బిగిస్తుండటంతో ఆ దేశంలోని సంపన్నులు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.

China : పట్టు బిగించిన జీ జిన్‌పింగ్... భారీ నష్టాల్లో చైనా కుబేరులు...
xi jinping

బీజింగ్ : చైనా ప్రభుత్వంపై ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) పట్టు బిగిస్తుండటంతో ఆ దేశంలోని సంపన్నులు భారీ నష్టాలను చవి చూస్తున్నారు. షేర్ల అమ్మకాలు మితిమీరడంతో పారిశ్రామికవేత్తలు సుమారు 9 బిలియన్ డాలర్ల మేరకు కోల్పోయినట్లు అంచనా. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం విధిస్తున్న అష్టదిగ్బంధనాలపై ప్రజాగ్రహం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం సమయంలో బిలియనీర్ల సంపద విలువ క్షీణిస్తోంది.

సోమవారం విడుదలైన చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థ జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 3.9 శాతం వృద్ధిని కనబరచింది. ఇది మొదటి త్రైమాసికంలో వృద్ధి కన్నా 0.4 శాతం అధికం.

వారం రోజులపాటు జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో జీ జిన్‌పింగ్‌ను ఆ పార్టీ అధినేతగా ప్రకటించారు. దీంతో ఆయన అత్యున్నత పాలక మండలిలో తన వీర విధేయులను నియమించుకున్నారు. తన శత్రువులను బయటికి పంపించేశారు. మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో టెన్సెంట్ హోల్డింగ్స్ చీఫ్ పోనీ మా (Pony Ma), దేశంలో అత్యంత సంపన్నుడు ఝోంగ్ షన్‌షాన్ (Zhong Shanshan) దాదాపు 2 బిలియన్ డాలర్ల చొప్పున కోల్పోయారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మార్పులు, చేర్పుల తర్వాత వీరి కంపెనీల షేర్లు పతనమవడమే దీనికి కారణం. సంపన్నులు, ప్రైవేట్ వ్యాపారవేత్తలపై ప్రభుత్వం విరుచుకుపడటం కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తం కావడంతో వీరి షేర్లు పతనమయ్యాయి.

స్వేచ్ఛా వ్యాపార సంస్థలకు మద్దతిచ్చేవారికి ఏడుగురు సభ్యులుగల స్టాండింగ్ కమిటీలో చోటు దక్కలేదు. మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌ను కూడా ఈ కమిటీ నుంచి తప్పించేశారు. 1994లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ సమావేశాల తర్వాత చైనా కంపెనీల షేర్ల పరిస్థితిని పరిశీలించినపుడు, ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి చైనా కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

Updated Date - 2022-10-24T18:10:40+05:30 IST