హాలోవిన్‌లో తొక్కిసలాట 120 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2022-10-30T05:11:58+05:30 IST
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరలో దారుణం చోటుచేసుకుంది.
సెలబ్రిటీని చూసేందుకు ఎగబడిన జనం
ఇరుకు వీధిలో ఒక్కసారిగా తొక్కిసలాట
మరో 200 మందికి తీవ్ర గాయాలు
వారిలో 50 మందికి గుండెపోటు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన
సియోల్, అక్టోబరు 29: దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరలో దారుణం చోటుచేసుకుంది. హాలోవిన్ ఉత్సవం సందర్భంగా ఇటావోజ్ లీజర్‌లోని హామిల్టన్ హోటల్ సమీపంలో లక్షల మంది వేడుకల్లో పాల్గొనగా.. తమ అభిమాన సెలబ్రిటీ వచ్చాడని తెలుసుకుని.. అంతా అటువైపు పరుగెత్తారు. ఇరుకైన వీధిలో వందల మంది వెళ్లడంతో.. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 120 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో సుమారు 50 మందికి గుండెపోటు వచ్చిందని, వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని అగ్నిమాపక విభాగం చీఫ్ చోయ్ సియోంగ్ బియోమ్ మీడియాకు వెళ్లడించారు. ‘‘ఆస్పత్రుల్లో మార్చురీలు శవాలతో నిండిపోయాయి. 74 మృతదేహాలను ఆస్పత్రులకు తరలించాం. మరో 46 మృతదేహాలను ఇటావోజ్‌లీజర్‌లోని ఓ జిమ్‌లో భద్రపరిచాం. సమాచారం అందిన వెంటనే 400 మంది ఎమర్జెన్సీ సిబ్బంది 140 అంబులెన్సులతో రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించాం’’ అని ఆయన వివరించారు. కరోనా నిబంధనలను సడలించడం వల్ల ప్రజలు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో హాలోవిన్ ఉత్సవానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఎయోల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో భద్రతను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.