yoga: శీతాకాలంలో ఈ ఆసనంతో..

ABN , First Publish Date - 2022-11-01T18:14:17+05:30 IST

సింహపు గాండ్రింపును మరిపించే ఈ యోగాసనంతో గొంతు, ముఖం, చేతులతో పాటు, శ్వాసకోశ అవయవాలు లాభపడతాయి. కాబట్టి శ్వాసకోశ సమస్యలు వేధించే శీతాకాలంలో ఈ ఆసనం సాధన చేయడం అవసరం.

yoga: శీతాకాలంలో ఈ ఆసనంతో..
ఈ ఆసనంతో..

సింహాసనంతో శ్వాస సాఫీ

సింహపు గాండ్రింపును మరిపించే ఈ యోగాసనంతో గొంతు, ముఖం, చేతులతో పాటు, శ్వాసకోశ అవయవాలు లాభపడతాయి. కాబట్టి శ్వాసకోశ సమస్యలు వేధించే శీతాకాలంలో ఈ ఆసనం సాధన చేయడం అవసరం.

ఇలా చేయాలి

  • వజ్రాసనంలో (మోకాళ్ల మీద) కూర్చుని, ముందుకు వంగి, చేతులను నేలపై ఆనించాలి.

  • తర్వాత ఎడమ కాలిని వెనక్కి మడిచి, కుడి తొడ వెనక భాగంలో, కుడి కాలిని ఎడమ తొడ మీదా ఉంచాలి.

  • ఈ భంగిమలో శరీర బరువు చేతుల మీద పడేలా చూసుకోవాలి.

  • నడుము పైభాగం ముందుకు వంగినప్పటికీ, శరీరం 90 డిగ్రీల కోణంలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

  • ఈ భంగిమలో తలను వెనక్కి, ఛాతీని పైకీ లేపాలి.

  • నోటిని తెరచి, నాలుకను వీలైనంత బయటకు చాపి దీర్ఘ శ్వాస తీసుకోవాలి.

  • ఇప్పుడు కళ్లను పైకి లేపి, కనుబొమల మధ్య కేంద్రీకరించాలి.

  • గొంతు కండరాలను వదులు చేసి, గాలిని వదులుతూ శ్వాసను వదులుతూ శబ్దం చేయాలి.

  • ఇలాంటి భంగిమలో వీలైనన్ని సార్లు శ్వాస తీసుకుని, వదులుతూ ఉండాలి.

  • చివర్లో కాళ్లను వదులు చేసి, ముందుకు చాపి కూర్చోవాలి.

  • మొదట వజ్రాసనంలో కూర్చుని, తర్వాత బాలాసనం వేయాలి.

ఉపయోగాలు

ప్లాసిస్మా పటిష్ఠం: కాలర్‌ బోన్‌ నుంచి దవడ వరకూ ఉండే గొంతులోని, చదునైన, దీర్ఘచతురస్రాకార కండరాలు దృఢపడతాయి.

బంధాలు బలం: జలంధర, మూల, ఉద్యాన అనే మూడు ప్రధాన బంధాలు చైతన్యం పొందుతాయి.

చక్రాల ప్రేరణ: మణిపుర, విశుద్ధ చక్రాలు ప్రేరణ పొంది, గొంతు చుట్టూ ఉండే అవయవాలు దృఢపడతాయి.

ముఖాకర్షణ: శరీరంలోని, ముఖంలోని కండరాలు ఈ ఆసనంతో సాగుతాయి. దాంతో రక్తప్రసరణ మెరుగై చర్మ సౌందర్యం, మరీ ముఖ్యంగా ముఖాకర్షణా పెరుగుతాయి.

దుర్వాసన దూరం: నాలుకను బయటకు చాపడం వల్ల నోటి పనితీరు పూర్తి స్థాయిలో పుంజుకుని, నోటికి వ్యాయామం అంది నోటి దుర్వాసన దూరమవుతుంది.

దృష్టి దృఢం: రోజూ క్రమం తప్పక ఈ ఆసనం సాధన చేసే కంటిచూపు మెరుగవుతుంది.

స్వరపేటికలు: ఈ ఆసనంతో స్వరపేటికలు బలం పుంజుకుంటాయి. గాయకులకు ఈ ఆసనంతో ఉపయోగం కలుగుతుంది. నత్తి సమస్య తొలగిపోతుంది.

థైరాయిడ్‌: ఈ ఆసనంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు పుంజుకుంటుంది. హార్మోన్లు క్రమబద్ధమవుతాయి.

Updated Date - 2022-11-01T18:14:23+05:30 IST