వేసవిలో ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-03-14T17:00:31+05:30 IST

వేసవిలోకి అడుగుపెట్టేశాం. వేడి వాతావరణం ప్రభావం చర్మం మీదే ఎక్కువ కాబట్టి, చర్మ రక్షణ చర్యలు మొదలుపెట్టాలి. అందుకోసం ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని సౌందర్య చికిత్సలు ఉన్నాయి. అవే ఇవి!

వేసవిలో ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(14-3-2022)

వేసవిలోకి అడుగుపెట్టేశాం. వేడి వాతావరణం ప్రభావం చర్మం మీదే ఎక్కువ కాబట్టి, చర్మ రక్షణ చర్యలు మొదలుపెట్టాలి. అందుకోసం ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని సౌందర్య చికిత్సలు ఉన్నాయి. అవే ఇవి!


తేనె, రోజ్‌ వాటర్‌ ప్యాక్‌!  

తేనె, పెరుగు, రోజ్‌ వాటర్‌ సమపాళ్లలో కలుపుకోవాలి. ముఖం మీద పూసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. 

చల్లని నీళ్లతో కడిగేయాలి.


ఉపయోగాలు: తేనె, పెరుగు రెండూ చర్మాన్ని చల్లబరుస్తాయి. పొడిని పారదోలి చర్మానికి తేమను అందిస్తాయి. ఈ ప్యాక్‌తో చర్మం తాజాగా మారుతుంది. రోజ్‌వాటర్‌ చర్మం జిడ్డుగా మారకుండా నియంత్రిస్తుంది. ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పిస్తుంది.


ఓట్స్‌, బాదం ప్యాక్‌!  

పది బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి ఉదయం ముద్దలా నూరుకోవాలి. ఈ ముద్దకు ఒక చెంచా ఓట్స్‌, ఒక చెంచా తేనె, పెరుగు కలపాలి.  అన్నీ బాగా కలిపి ముఖం మీద పూసుకోవాలి.  15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  

చల్లని నీళ్లతో కడిగేయాలి.


ఉపయోగాలు: ఓట్లు చర్మం మీద పేరుకున్న అదనపు జిడ్డును తొలగిస్తాయి. బాదం చర్మానికి తేమను అందిస్తుంది.


బొప్పాయి, అరటి ప్యాక్‌!  

బొప్పాయి, అరటి గుజ్జు తీసుకోవాలి.  

దీనికి తేనె చేర్చాలి.  

మెత్తని ముద్దలా చేసి, ముఖానికి పూసుకోవాలి. పూర్తిగా ఆరనివ్వాలి.  

చల్ల నీళ్లతో కడిగేయాలి.


ఉపయోగాలు: చర్మం మీది జిడ్డు వదులుతుంది. పొడిబారిన చర్మం తేజస్సుతో పాటు మృదువుగా మారుతుంది. 


ముల్తానీ మట్టి ప్యాక్‌!

ముల్తానీ మట్టి చర్మాన్ని పొడిబారుస్తుంది. కాబట్టి దీనికి తప్పనిసరిగా రోజ్‌వాటర్‌ చేర్చి సౌందర్య చికిత్సల్లో వాడాలి. ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌ కలపాలి. మెత్తని ముద్దగా చేసి, ముఖానికి పూసుకోవాలి. ఆరిన తర్వాత నీళ్లతో రుద్ది కడిగేసుకోవాలి.


ఉపయోగాలు: ఈ ప్యాక్‌తో చర్మం నునుపుగా మారుతుంది. 

Updated Date - 2022-03-14T17:00:31+05:30 IST