కలుషిత వాతావరణంతో జాగ్రత్త అంటున్న..
ABN , First Publish Date - 2022-07-29T19:38:58+05:30 IST
వర్షాలకు కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు, చెత్తాచెదారం రోడ్లపై చేరుతోంది.

జ్వరంతో ఆస్పత్రులకు క్యూ
చలి, వర్షంతో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు
హైదరాబాద్ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వర్షాల(rain)కు కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల డ్రైనేజీ(Drainage)లు పొంగిపొర్లి మురుగునీరు, చెత్తాచెదారం రోడ్లపై చేరుతోంది. దీంతో దర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు విజృంభించడంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాలకు కొంత మేర చల్లబడింది. వాతావరణంలో వచ్చిన మార్పుతో ప్రజలు చలి జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే న్యూమోనియా, అస్తమా ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వాతావరణం మరింతగా ఇబ్బందిపెట్టే అవకాశమంది.
వర్షం, చలితో పెరుగుతున్న కేసులు
జ్వరాలతో వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, టైపాయిడ్ వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఓపీ సంఖ్య పెరిగింది. హైదరాబాద్(hyderabad) జిల్లాలో గడిచిన 20 రోజులలో టైపాయిడ్ కేసులు 20, వివిధ కారణాలతో జ్వరాలు 1300, ఫ్లూ కేసులు 3 వేల వరకు నమోదైనట్లు సమాచారం. ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, గాంధీ ఆస్పత్రుల ఓపీకి వచ్చే రోగులలో సగానికిపైగా జ్వరాలకు సంబంధించినవే ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.
ఫ్లూతో ముప్పు
కలుషిత వాతావరణంతో ఫ్లూతో ముప్పు పొంచి ఉంది. తేమ వాతావరణంలో వైరస్ రెట్టింపు శక్తితో దాడి చేస్తుంది. ఫ్లూ వల్ల స్వైన్ఫ్లూ, న్యుమోనియా, ఆస్తమా, కొవిడ్ వంటివి విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఫ్లూ పెరిగితే వైద్యుల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పని సరి..
- వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి.
- ఎప్పటికప్పుడు ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.
- ఫ్రిజులో నీళ్లు, ఆహారం తీసుకోవద్దు. కాచి చల్లార్చిన నీరు తాగాలి.
- పండ్లు, కూరగాయాలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.
- వర్షాకాలం పనిచేసే వారు మంచినీరు, ఎలక్ర్టాల్ పౌడర్ తాగాలి.
- దుస్తులు, పరుపులు, దుప్పట్లు తడి కాకుండా చూసుకోవాలి.
- వెచ్చటి దుస్తులను ధరించాలి. ఏ రోజుకారోజు దుస్తులను మారుస్తుండాలి.
- ఇంటిలోకి గాలి, వెలుతురు వచ్చే విధంగా జాగ్రత్త పడాలి.
- ఇంట్లో దోమ తెరలు తప్పనిసరిగా వినియోగించాలి.
- ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి.
- ఇంటి గోడలకు పేరుకునే నాచు, నీటి ధారాలు, మట్టివి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- మల, మూత్ర విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
- 48 గంటలకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి.
- డాక్టర్ నందన జాస్తీ, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ ఆస్పత్రి
