గాంధీ మార్గం.. మేక పాలు, వేరుశనగ

ABN , First Publish Date - 2022-08-16T16:08:48+05:30 IST

రోజుకు 18 కిలో మీటర్ల చొప్పున 40 ఏళ్ల పాటు నడిచారు. 70 ఏళ్ల వయసులో 21 రోజుల పాటు ఉపవాసం చేశారు

గాంధీ మార్గం.. మేక పాలు, వేరుశనగ

రోజుకు 18 కిలో మీటర్ల చొప్పున 40 ఏళ్ల పాటు నడిచారు. 70 ఏళ్ల వయసులో 21 రోజుల పాటు ఉపవాసం చేశారు. కాబట్టే బతికినంత కాలం చురుగ్గా నడిచారు, నడిపించారు... జాతి పిత మహాత్మా గాంధీ. ప్రకృతి వైద్యాన్ని నమ్మి, ఆచరించి, చికిత్సలకు కూడా పూనుకున్న ఆయన, ఆరోగ్యానికి మార్గం... ఆహారం, అలవాట్లలో ఉందని మార్గనిర్దేశం చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కొనసాగుతున్న సందర్భంగా ఆయన ఆచరించిన ప్రకృతి వైద్యాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం... 


రుగ్మతకు గురైన అవయవాన్ని మందులతో బలం పుంజుకునేలా చేస్తే, మందుల ప్రభావం తగ్గిన వెంటనే అవయవం కూడా కుంటుపడుతుంది. కాబట్టి స్వతఃసిద్ధంగా, తనంతట తాను బలం పుంజుకునేలా అవయవానికి దన్నుగా నిలవాలి. మహాత్ముడు అనుసరించిన ప్రకృతి వైద్యం ఈ సూత్రం ఆధారంగానే పని చేస్తుంది. మరీ ముఖ్యంగా శరీరంలోని నాలుగు విసర్జక అవయవాల సామర్థ్యం తగ్గడమే సర్వ వ్యాధులకూ మూలమని నమ్మే ప్రకృతి వైద్యం, ఆయా అవయవాలను బలోపేతం చేసే చికిత్సలే ప్రధానంగా సాగుతుంది. లక్షణాలు, మూలకారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దే చికిత్సలనూ, ఆహారాన్నీ ఎంచుకునే ప్రకృతి వైద్యంతో ఆరోగ్య సమస్యలు అదుపులోకి రావడంతో పాటు, తిరగబెట్టకుండా ఉండడం విశేషం.


ఆ నాలుగు విసర్జకాలు..

పెద్దపేగులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం.. ఈ నాలుగు ప్రధాన విసర్జక అవయవాలు ఆహారం, కలుషితాల మూలంగా పూర్తి శక్తి మేరకు పని చేయలేకపోతూ ఉంటాయి. దాంతో ఆ విసర్జకాలు, వ్యర్థాలు శరీరంలో పేరుకుపోయి, వ్యాధుల రూపంలో బయల్పడుతూ ఉంటాయి.


పెద్దపేగులు: మూడు పూటలా భోజన వేళలను క్రమం తప్పక పాటిస్తాం. ఆకలి లేకున్నా, భోజనవేళకు భోంచేస్తాం. ఇదే నియమాన్ని మలవిసర్జనకు వర్తింపచేయం. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేవరకూ మరో ఆహారం జోలికి వెళ్లకుండా, ప్రతి రోజూ మలవిసర్జన సక్రమంగా జరిగేలా చూసుకుంటూ, తిన్న ప్రతిసారీ పొట్టలో పది శాతం ఖాళీ ఉండేలా చూసుకుంటే మలబద్ధకం సమస్య తలెత్తదు. సరైన ఆహారపుటలవాట్లు పాటించకుండా, రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తూ, అస్తవ్యస్థ జీవనశైలిని అనుసరించడం వల్ల జీర్ణక్రియ, విసర్జక క్రియలు గాడి తప్పుతాయి. ఫలితంగా అజీర్తి, మలబద్ధకం, జీర్ణకోశ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలకు విరుగుడుగా పీచు ఎక్కువగా ఉండే ఆహారం, పండ్ల రసాలు, కూరగాయ రసాలు తీసుకోవాలి. ఎనీమా చికిత్సతో పేగుల్లోని వ్యర్థాలను తొలగించుకోవాలి.


మూత్రపిండాలు: ఆహారంలో అవసరానికి మించి ఉప్పు వాడకం, యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల మూత్రపిండాల సామర్ధ్యం తగ్గిపోయి, వ్యర్థాల విసర్జన మందగిస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు తలెత్తుతుంది. ఈ సమస్యకు విరుగుడుగా ఆహారంలో ఉప్పును తగ్గించడం, బార్లీ నీళ్లు, ఉలవ చారు తీసుకోవడంతో పాటు మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచే ప్రకృతి చికిత్సలను ఆశ్రయించాలి. ఇందుకోసం హైడ్రోథెరపీ (తొట్టి స్నానం), మృతిక చికిత్సలు ఉపయోగపడతాయి. హైడ్రో థెరపీ సౌలభ్యం లేనివాళ్లు, హాట్‌ ప్యాక్‌లతో మూత్రపిండాలు ఉండే ప్రదేశంలో కాపడం పెట్టుకోవచ్చు. 


ఊపిరితిత్తులు: వాతావరణ కాలుష్యం, ధూమపానం, కార్బన్‌డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చుకోవడం... వీటి వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం దెబ్బతింటుంది. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు మొదలవుతాయి. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుని, శ్వాస కష్టమవుతుంది. ఇలాంటప్పుడు పుదీనా, తులసి, పసుపు కలిపిన వేడి నీటి ఆవిరి పట్టడంతో పాటు, ప్రాణాయామం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. 


చర్మం: సౌందర్య సాధనాల వాడకం, కాలుష్యం ప్రభావంతో ఎగ్జీమా, అలర్జీలు మొదలైన చర్మ సమస్యలు వేధిస్తాయి. వీటికి విరుగుడుగా ఒండ్రు మట్టితో పట్టు, స్నానం, అరటి ఆకులను చుట్టి, ఎండ సోకేలా చేయడం, వేపాకు వేసి కాచిన నీళ్లతో స్నానం లాంటి చికిత్సలను తీసుకోవాలి. ఎగ్జీమా లాంటి చర్మ సమస్యలకు కొబ్బరినూనెలో పటికను కలిపి, పట్టు వేయాలి.


విరుగుడు మూలాలూ శరీరంలోనే...

ప్రకృతి వైద్యం ఆలోచనలు, మూలాలు వేరు. సాధారణ వైద్య విధానం జబ్బుకు కారణాన్ని వెతికే ప్రయత్నం చేస్తే, ప్రకృతి వైద్యం జబ్బుపడకపోవడానికి తోడ్పడే అంశాల మీద దృష్టి పెడుతుంది. ఉదాహరణకు... ఒకే పదార్థం తిన్న నలుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి సుస్తీ చేస్తే, ఆ సుస్తీకి ఏ సూక్ష్మక్రిములు కారణమై ఉంటాయనే దిశగా సాధారణ వైద్య విధానం ఆలోచిస్తుంది. కానీ ప్రకృతి వైద్యం, అదే పదార్థం తిన్న మిగతా ఇద్దరు కుటుంబసభ్యులకు సుస్తీ చేయకుండా రక్షణ కల్పించిన అంశాల మీద దృష్టి పెడుతుంది. వ్యక్తి ఆరోగ్యం అతను తీసుకునే ఆహారం, అలవరుచుకున్న అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది.


కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైన జీవనవిధానం దిశగా నడిపించడానికి ప్రకృతి వైద్యం మనల్ని సంసిద్ధం చేస్తుంది. నొప్పి, అసౌకర్యాలు అంతర్గత జబ్బును తెలియజెప్పే లక్షణాలు. కాబట్టి మందులతో నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తే, అంతర్గత సమస్య బయల్పడే వీలుండదు. అందుకే నొప్పి కలిగినప్పుడు దాన్ని తగ్గించే మందులు వాడడం సరి కాదని మహాత్మా గాంధీ నమ్మేవారు. నెల రోజుల పాటు టైఫాయిడ్‌తో బాధపడుతున్న తన కొడుకు మణీలాల్‌ కోసం కూడా ఆయన ప్రకృతివైద్యాన్నే ఆశ్రయించారు. ప్లేగు వ్యాధి విస్తరించిన సమయంలో జొహాన్స్‌బర్గ్‌లోని టాల్‌స్టాయ్‌లో అనుచరులతో కలిసి రోగులకు చల్లని పట్టీలు, మట్టి పట్టీలతో చికిత్స చేశారు. అలా ప్రకృతి వైద్యం పొందిన ప్లేగు రోగుల్లో మరణాలు తక్కువగా నమోదయినట్టు అప్పటి రికార్డుల్లో కూడా నమోదైంది. 


మందులు పదే పదే వాడితే డ్రగ్ డిపెండెన్సీ పెరగడంతో పాటు, స్వీయ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ రెండూ ప్రమాదకరమైనవే! అలాగే శరీరం తనలోని సమస్యను తనంతట తనే మరమ్మత్తు చేసుకోగలిగే సమయం ఇవ్వాలి. అందుకు ప్రకృతి వైద్యం ఆసరా తీసుకోవాలి.


చికిత్స మనలోనే!

వ్యాధికి చికిత్స బయట నుంచి కాకుండా, శరీరం లోపలి నుంచే అందించాలి. ఇందుకోసం వ్యాధితో పోరాడే శక్తిని శరీరానికి అందించే చికిత్స కొనసాగాలి. ఆహారం ద్వారా చికిత్స ఉపవాసం రూపంలో ఉండవచ్చు. నీళ్లు, మజ్జిగరసం, పళ్లరసం, గోధుమ గడ్డి రసం, గోధుమలు నానబెట్టి రసం తీసి తాగడం లాంటి ఎన్నో రకాల ఆహారనియమాల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని గాంధీ చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా మితాహారం ఆరోగ్యకరం అని సూచించారాయన. కాలక్రమేణా జీవనవిధానంలో వచ్చిన మార్పులపరంగా శారీరక కదలికలు తగ్గాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆహారంలో మితం పాటించలేకపోతున్నాం. శరీరానికి వ్యాయామం తగ్గినప్పుడు ఆహారంలో కూడా మితం పాటించడం అవసరం అన్నారు గాంధీ.


లంఖణం పరమౌషధం!

ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి కనీసం వారానికి ఒక రోజు పాటైనా ఉపవాసం ఉండడం అవసరం. బయట నుంచి ఆహారం అందనప్పుడు శరీరం ఆహారం కోసం లోపల్లోపల వెతుక్కుంటుంది. దాంతో శరీరం యాక్టివేట్‌ అవుతుంది. గాంధీ 70 ఏళ్ల తర్వాత, 21 రోజుల పాటు రెండు సందర్భాల్లో ఉపవాసాలు చేశారు. తర్వాత ఫలాహారంతో ఉపవాసాన్ని విరమించేవారు. ఓ సందర్భంలో తగ్గిన బరువును క్రమబద్ధమైన ఆహారనియమాలతో పెంచుకున్న గాంధీ ‘ఉపవాసాలతో దీర్ఘాయుష్షునూ సాధించవచ్చు’ అని చెబుతూ, ఇలాగైతే తాను 120 ఏళ్లపాటు జీవించి ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అన్నారు. కాబట్టి జలోపవాసం (నీళ్లు తాగి ఉపవాసం ఉండడం), రసోపవాసం (పళ్లరసాలు తాగి ఉపవాసం ఉండడం), నిర్జలోపవాసం (ఎలాంటి ఘన, ద్రవ పదార్థాలూ తీసుకోకుండా ఉపవాసం ఉండడం)  అనే మూడు రకాల ఉపవాసాల్లో అనువుగా ఉన్నదాన్ని అనుసరించవచ్చు.


ఒండ్రు మట్టి శ్రేష్టం

ఔషధ మొక్కలతో నిండి ఉండే అడవుల గుండా ప్రవహించే నీటిలో వ్యాధులను నయం చేయగలిగే ఔషధ గుణాలు కలిసి ఉంటాయి. అలా ఆ నీరు ప్రవహించే నదీ తీరాల్లోని ఒండ్రు మట్టిలోకి ఆ పోషకాలు చేరుకుంటాయి. కాబట్టి ఆ మట్టిని చికిత్సల్లో ఉపయోగించడం ద్వారా పలు రకాల వ్యాధులను నయం చేయవచ్చని ప్రకృతి వైద్యం నమ్ముతుంది. మూత్రపిండాల సమస్యలు, చర్మ సమస్యలు, మలబద్ధకం, స్థూలకాయం.. ఇలా పలు రకాల రుగ్మతలకు మృతిక చికిత్సలు ఉపయోగపడతాయి.


గాంధీ మెచ్చిన మేక పాలు, వేరుశనగలు 

మహాత్మా గాంధీ మేకపాలు తాగేవారు. వేరుశనగలను ఇష్టంగా తినేవారు. వాటిని తినమని అందరినీ ప్రోత్సహించేవారు. ఇందుకు కారణం లేకపోలేదు. మేకలు గడ్డి తినడం మూలంగా, గడ్డిలోని పోషకాలన్నీ మేక పాలలోకి చేరతాయి. స్వాతంత్ర్యానికి పూర్వం గేదె పాలను తాగే సౌలభ్యం, పోషకాలతో నిండిన పప్పుధాన్యాలు తినగలిగే స్థోమత పేదలకు ఉండేది కాదు. కాబట్టే వాటికి ప్రత్యామ్నాయంగా, అంతే సమానమైన పోషక విలువలున్న చవకైన, అందరికీ అందుబాటులో ఉండే ఆహారం పట్ల పేదలకు అవగాహన కల్పించి, ప్రోత్సహించడం కోసం మహాత్ముడు, వాటిని సేవించేవారు. 


-డాక్టర్‌ టి. కృష్ణమూర్తిజి.సి మెంబర్‌ (న్యాచురోపతి),

రెడ్‌ క్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచర్‌ క్యూర్‌, హైదరాబాద్‌Updated Date - 2022-08-16T16:08:48+05:30 IST