కార్డియోవాస్క్యులర్ ఫిట్‌నెస్ కావాలా?.. మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకోండి: నిపుణులు చెబుతున్నది ఇదే!

ABN , First Publish Date - 2022-10-02T03:16:20+05:30 IST

మెట్లు ఎక్కడం ద్వారా కార్డియోవాస్క్యులర్ (cardiovascular) ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు

కార్డియోవాస్క్యులర్ ఫిట్‌నెస్ కావాలా?.. మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకోండి: నిపుణులు చెబుతున్నది ఇదే!

హైదరాబాద్: మెట్లు ఎక్కడం ద్వారా కార్డియోవాస్క్యులర్ (cardiovascular) ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత నెల 29న ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day) సందర్భంగా ఆరోగ్యవంతమైన గుండె కోసం ‘హార్ట్ 2 హార్ట్’(Heart 2 Heart Challenge) సవాలును ఇండియా స్వీకరించింది. నిజానికి ఇదో వినూత్నమైన ప్రచారం. ఆరోగ్యవంతమైన అలవాట్లను ఆచరిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ  సవాల్‌లో భాగంగా 90 సెకన్లలో నాలుగు ఫ్లోర్లు (60) మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రపంచంలోని సుప్రసిద్ధ కార్డియాలజీ జర్నల్ ప్రకారం.. గుండె ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఇది సులభమైన పరీక్షా పద్ధతి. పైన పేర్కొన్న నిర్ణీత సమయంలో 60 మెట్లు ఎక్కలేకపోతే గుండె పనితీరు మందగిస్తుందని అర్థం చేసుకోవాలి. ‘హార్ట్‌ 2 హార్ట్‌ ఛాలెంజ్‌ ఫర్‌ హెల్తీ హార్ట్‌’ చాలెంజ్‌ను స్వీకరించిన వారు నిమిషంలో 40 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. 


ఈ ఫిట్‌నెస్ట్ టెస్టుపై అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే కార్డియోవాస్క్యులర్ మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, నిశ్చల జీవనశైలి వంటివి ఇందుకు కారణమవుతాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మధుమేహ నియత్రణ వంటి వాటి ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ‘హార్ట్‌ 2 హార్ట్‌’(Heart 2 Heart Challenge) ప్రచారం ద్వారా కార్డియాక్‌ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. రెండు నిమిషాలలో మీ గుండె పనితీరును ఖర్చు లేకుండా ఈ మెట్ల పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ ‘హార్ట్‌ 2 హార్ట్‌ హెల్తీ హార్ట్‌ ఛాలెంజ్‌’ను జేబీ ఫార్మా ప్రారంభించింది.  

Read more