అరికాళ్ల అందానికి.. సౌందర్య చికిత్సలు..!
ABN , First Publish Date - 2022-02-24T17:57:10+05:30 IST
పాదాల పట్ల శ్రద్థ లోపిస్తే, పగుళ్లతో అందవిహీనంగా తయారవుతాయి. నిజానికి దుమ్ము, ధూళి సోకే వీలున్న పాదాలు పలు రకాల చర్మ సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాటి పట్ల అదనపు శ్రద్ధ అత్యవసరం. పాదాలకు ఎలాంటి సౌందర్య చికిత్సలు చేసుకోవాలో తెలుసుకుందాం!

ఆంధ్రజ్యోతి(24-02-2022)
పాదాల పట్ల శ్రద్థ లోపిస్తే, పగుళ్లతో అందవిహీనంగా తయారవుతాయి. నిజానికి దుమ్ము, ధూళి సోకే వీలున్న పాదాలు పలు రకాల చర్మ సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాటి పట్ల అదనపు శ్రద్ధ అత్యవసరం. పాదాలకు ఎలాంటి సౌందర్య చికిత్సలు చేసుకోవాలో తెలుసుకుందాం!
తేమ అందించాలి!
అతి చల్లదనం, అతి వెచ్చదనం... రెండూ పాదాలకు చేటు చేసేవే! కాబట్టే చలికాలం పాదాలు పగులుతూ ఉంటాయి. పొడిబారిన పాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి పగుళ్లుగా మారతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి రోజూ పాదాలకు మాయిశ్చరైజర్ పూసుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి తేమను అందించే సౌందర్య చికిత్సలు అనుసరించాలి. అవేంటంటే....
ముల్తానీ మట్టి
పాదాల మీద పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలు వదిలి పాదాలు కోమలంగా తయారవ్వాలంటే వారానికి ఒకసారి ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం... ముల్తానీ మట్టి - రెండు చెంచాలు రోజ్‌వాటర్ - నాలుగు చెంచాలు తేనె - ఒక చెంచా, నిమ్మరసం - రెండు చెంచాలు వీటన్నిటినీ కలిపి పాదాలకు పూసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ పూసుకోవాలి.
రోజ్ ప్యాక్
పాదాలు నల్లబారి కళావిహీనంగా మారితే తిరిగి జీవం నింపే ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం...
గులాబీ రేకులు - గుప్పెడు, రోజ్ వాటర్ - రెండు చెంచాలు, పాలు - నాలుగు చెంచాలు, తేనె - ఒక చెంచా.
గులాబీ రేకులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. పాదాలు శుభ్రంగా కడుక్కోవాలి. గులాబీ ముద్దకు రోజ్ వాటర్, పాలు, తేనె చేర్చి బాగా కలిపి పాదాలకు పూసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఫలితం ఉంటుంది.