గుండె గండం నుంచి బయటపడే మార్గమిదే!

ABN , First Publish Date - 2022-09-13T16:22:33+05:30 IST

కొన్ని ఆరోగ్య సమస్యల లక్షణాలు ముప్పుతిప్పలు పెడతాయి, అయోమయంలో పడేస్తాయి. ప్రత్యేకంగా గుండె సమస్య నిర్ధారణలో

గుండె గండం నుంచి బయటపడే మార్గమిదే!

కొన్ని ఆరోగ్య సమస్యల లక్షణాలు ముప్పుతిప్పలు పెడతాయి, అయోమయంలో పడేస్తాయి. ప్రత్యేకంగా గుండె సమస్య నిర్ధారణలో ఇలాంటి పరిస్థితి గండాలకు దారి తీస్తుంది. కాబట్టే సమస్యను కచ్చితంగా నిర్ధారించే పరీక్షలూ, సరిదిద్దే చికిత్సలూ కీలకంగా మారాయి అంటున్నారు వైద్యులు.


ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది లాంటివి గుండె సమస్యను తెలిపే ప్రధాన లక్షణాలనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ గుండె సమస్య ఉందనే నిర్ధారణకు రావడం సరి కాదు. అలాగని అవసరమైన పరీక్షలు చేయించుకోకుండా ఉండిపోవడమూ పొరపాటే! కాబట్టి ఈ విషయంలో వైద్యులు సూచించే మార్గాన్ని అనుసరించాలి. అవసరమైన పరీక్షలతో సమస్యను కచ్చితంగా అంచనా వేయాలి. అప్పుడే వైద్యులు సమస్యను చక్కదిద్దే తగిన చికిత్సను ఎంచుకోగలుగుతారు. 


గుండె జబ్బు అంటే?

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో (కొరొనరీ ఆర్టెరీ) పూడికలు గుండె జబ్బులకు దారి తీస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటులు అదుపు తప్పినవాళ్లు, అధిక కొలెస్ట్రాల్‌ కలిగిన వాళ్లు, జన్యుపరమైన ముప్పు కలిగి ఉన్నవాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు, ఎక్కువ సమయాలు విశ్రాంత స్థితిలో గడిపేవాళ్లు, వ్యాయామం చేయని వాళ్లకు రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం కోల్పోయి, వాటిలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి, పూడికలు ఏర్పడతాయి. దాంతో గుండె జబ్బులు మొదలై లక్షణాలు మొదలవుతాయి. ఆయాసం, ఛాతీలో నొప్పి, అసౌకర్యం, గుండె దడ, కళ్లు తిరగడం... ఇలా వేర్వేరు లక్షణాల రూపంలో గుండె సమస్యలు బయటపడతాయి. అయితే కొందర్లో ఈ లక్షణాలు దీర్ఘకాలంగా ఉండి, గుండెపోటుకు దారి తీస్తే, ఇంకొందర్లో రక్తనాళం నూరు శాతం పూడుకుపోయి, లక్షణాలు అకస్మాత్తుగా తలెత్తి, గుండె పోటు రావచ్చు. 


ఎవరికి ఎలాంటి పరీక్ష?

సాధారణంగా గుండె సమస్య లక్షణాలు మొదలైనప్పుడు, సమస్యను నిర్థారించుకోవడం కోసం పరీక్షలు చేయించుకోక తప్పదు. అయుతే కొందరికి ముందు నుంచీ ఎటువంటి లక్షణాలు కనిపించకుండా, హఠాత్తుగా గుండెపోటు వస్తుంది. ఇది ‘ఎమర్జెన్సీ కొరొనరీ ఆర్టెరీ డిసీజ్‌’. ఇంకొందరికి దీర్ఘకాలం పాటు లక్షణాలు వస్తూ, పోతూ క్రమేపీ గుండె పోటుకు దారి తీస్తాయి. ఈ సమస్య ‘స్టేబుల్‌ కొరొనరీ ఆర్టెరీ డిసీజ్‌’. ఈ రెండు రకాల వ్యక్తుల సమస్యలు ఒకటే అయినా, వాళ్లకు చేపట్టే పరీక్షల్లో, అందించే చికిత్సల్లో తేడాలుంటాయి. 
ఎమర్జెనీ కొరొనరీ ఆర్టెరీ డిసీజ్‌: 

హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి మొదట ఇసిజి, తర్వాత టుడి ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్షలు చేసి, గుండె సమస్యను నిర్ధారించుకుంటారు. తర్వాత యాంజియోగ్రామ్‌ పరీక్షతో ఏ రక్తనాళం, ఎంత మేరకు పూడుకుపోయిందో స్పష్టంగా తెలుసుకుని, అదే సమయంలోనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ ద్వారా బెలూన్‌ సహాయంతో పూడికను తొలగిస్తారు. హఠాత్తుగా గుండె పోటుకు గురైన ఇలాంటి వ్యక్తులకు ఈ పరీక్షలన్నీ వెంట వెంటనే పూర్తి చేసి, అవసరాన్ని బట్టి స్టెంట్లు వేయడం లేదా, ఒకటి కంటే ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఉంటే, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని వైద్యులు ఎంచుకుంటారు. 


స్టేబుల్‌ కొరొనరీ ఆర్టెరీ డిసీజ్‌: 

వీళ్లకు కూడా ఇసిజి, టుడి ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్షలు చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని గుండె సమస్యలు ఈ రెండు పరీక్షల్లో బయటపడవు. కానీ లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు పరీక్షా ఫలితంతో సంబంధం లేకుండా లక్షణాలను బట్టి, యాంజియోగ్రామ్‌ అవసరాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. ఆ పరీక్షలో పూడికల తీవ్రత తెలుస్తుంది. పరిస్థితిని బట్టి మందులతో చికిత్స చేయవచ్చా లేక యాంజియోప్లాస్టీతో స్టెంట్‌ వేయవలసిన అవసరం ఉందా అనే విషయంలో వైద్యులు ఒక అంచనాకు వస్తారు. ఎక్కువ పూడికలు ఉన్నవాళ్లకు బైపాస్‌ సర్జరీ చేయవలసి ఉంటుంది.


ఇంట్రా కొరొనరీ ఇమేజింగ్‌

యాంజియోగ్రామ్‌లో గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయని తేలినప్పుడు, ఆ పూడిక స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేయడం కోసం ఇంట్రా కొరొనరీ ఇమేజింగ్‌ విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో ఒక చిన్న కెమెరాను రక్తనాళం లోపలకు పంపించి, పరిశీలించే వీలుంటుంది. కాబట్టి పూడికనూ, దాంతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రతనూ వైద్యులు స్పష్టంగా గమనించగలుగుతారు. అలాగే యాంజియోప్లాస్టీ ద్వారా ఏ సైజు స్టెంట్‌ వేయడం ఉపయోగకరమో, ఎంతవరకూ వ్యాకోచింపచేయడం ప్రయోజనకరమో, రక్తనాళంలో ఎక్కడ నుంచి ఎక్కడి వరకూ స్టెంట్‌ వేయడం అవసరమో, స్టెంట్‌ వేసిన తర్వాత ఎంతటి ప్రయోజనం దక్కుతుందో ఇంట్రా కొరొనరీ ఇమేజింగ్‌ ద్వారా అంచనా వేయవచ్చు. 


పూడిక గట్టిపడితే?

రక్తనాళంలో క్యాల్షియం పూడికలు బాగా గట్టిపడిపోయినప్పుడు, బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా పూడిక తొలిగించడం క్లిష్టమవుతుంది. ఇలా గట్టిపడిపోయిన క్యాల్షియంను బ్రేక్‌ చేయగలిగే కొత్త టెక్నిక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘రోటాబ్లేషన్‌’. ఈ చికిత్సలో వజ్రపు మొన కలిగిన బర్‌ సహాయంతో, క్యాల్షియం పూడి కను తొలిచి, తొలగిస్తారు. మరొక టెక్నిక్‌ ‘ఇంట్రా వ్యాస్క్యులర్‌ లిథోట్రిప్సీ’. ఈ చికిత్సలో.. ఒక బెలూన్‌ ద్వారా పూడిక ఉన్న ప్రదేశంలోకి షాక్‌ వేవ్స్‌ ప్రసరించేలా చేసి, క్యాల్షియం పూడికను పగలగొడతారు. ఈ చికిత్సల సహాయంతో పూడికను తొలగించిన తర్వాత, అంతిమంగా స్టెంట్లు వేస్తారు.


స్టెంట్లు పూడుకుపోతే...

శరీరంలో గుండె జబ్బు తీవ్రం కాకుండా నిలువరించడానికి స్టెంట్లు వేయించుకోవడంతో పాటు బ్లడ్‌ థిన్నర్లు కూడా వాడుకోవాలి. అయితే ఎంత మెరుగైన చికిత్స అందించినప్పుటికీ, ఐదు నుంచి పది శాతం మందికి, మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి, స్టెంట్లు వేయించుకున్న 8 నుంచి 12 నెలల లోపు తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలుంటాయి. అవి కొత్త పూడికలు కావచ్చు, లేదా స్టెంటు వేసిన చోటే పూడిక ఏర్పడవచ్చు, లేదా స్టెంటు వ్యాకోచించకపోయి ఉండచ్చు. కొందరికి రక్తనాళంలో రియాక్షన్‌ మూలంగా స్టెంట్‌ పూడుకుపోవచ్చు. అలాంటప్పుడు కొరొనరీ ఇమేజింగ్‌ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించి, కారణాన్ని కనిపెట్టి, బెలూన్‌ యాంజియోప్లాస్టీతో పూడికను తొలగించి, అవసరాన్ని బట్టి మరొక స్టెంటు వేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో డ్రగ్‌ ఎల్యూటింగ్‌ బెలూన్‌ను ఉపయోగిస్తారు. అలాగే పదే పదే స్టెంట్లు పూడుకుపోతున్నప్పుడు, బైపాస్‌ సర్జరీ చేయవలసి ఉంటుంది. 
సిటి కొరొనరీ యాంజియోగ్రామ్‌

గుండె జబ్బు కావచ్చు, కాకపోవచ్చు అనే సందిగ్ధ పరిస్థితి తలెత్తినప్పుడు చేసే నాన్‌ ఇన్వేజివ్‌ పరీక్ష ఇది. అనుమాన నివృత్తి కోసం ఎంచుకునే ఈ పరీక్షతో, రక్తనాళాల్లో పూడికలు ఉన్నదీ, లేనిదీ తెలిసిపోతుంది. లక్షణాలను బట్టి, ఇసిజి, టుడి ఎకో కార్డియోగ్రామ్‌ ఫలితాలను బట్టి పరిస్థితిని అంచనా వేయలేని పక్షంలో మాత్రమే, సాధారణ స్కాన్‌ను పోలి ఉండే సిటి కొరొనరీ యాంజియోగ్రామ్‌ను వైద్యులు ఎంచుకుంటారు. 
డ్రగ్‌ కోటెడ్‌ స్టెంట్లు ప్రయోజనకరం

ప్రస్తుతం డ్రగ్‌ కోటెడ్‌ స్టెంట్లు వాడుకలో ఉన్నాయి. స్టెంట్‌కు మందు పైపూత ఉంటుంది కాబట్టి రక్తనాళాలు త్వరగా పూడుకుపోకుండా ఉంటాయి. దీనికి ముందు లేజర్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళంలోని పూడికను తొలగించ వలసి ఉంటుంది.


స్టెంట్లు పూడుకుపోకుండా...

రక్తనాళం తిరిగి పూడుకుపోకుండా ఉండాలంటే... స్టెంటు వేయించుకుని, రక్తం పలుచనయ్యే మందులు వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలి. అవేంటంటే...

  • మధుమేహం, అధిక రక్తపోటులను మందులతో అదుపులో ఉంచుకోవాలి.
  • ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కొనసాగించాలి.
  • వైద్యుల సూచన మేరకు తగిన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. 
  • ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.


-డాక్టర్‌ వి. రాజశేఖర్‌

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.Read more