అధికంగా ప్రొటీన్ పౌడర్‌ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే!

ABN , First Publish Date - 2022-10-11T16:26:03+05:30 IST

వ్యాయామంలో ప్రొటీన్ల పాత్ర కీలకమే! అయితే పౌడర్ల రూపంలోని కృత్రిమ ప్రొటీన్ల మీద ఆధారపడే ఒరవడి ఊపందుకుంది. కానీ శరీరం దృఢపడడానికి

అధికంగా ప్రొటీన్ పౌడర్‌ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే!

వ్యాయామంలో ప్రొటీన్ల పాత్ర కీలకమే! అయితే పౌడర్ల రూపంలోని కృత్రిమ ప్రొటీన్ల మీద ఆధారపడే ఒరవడి ఊపందుకుంది. కానీ శరీరం దృఢపడడానికి బదులుగా దుర్భరంగా మారకుండా ఉండాలంటే, కృత్రిమ ప్రొటీన్లు ఎవరికి, ఏ మేరకు అవసరమో తెలుసుకోవాలి. 


రీర దారుఢ్యం కోసం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవాలి. అలాగే అవసరమైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. అయితే వ్యాయామం చేసే ప్రతి ఒక్కరూ ప్రొటీన్‌ పౌడర్లను తప్పక వాడాలనే అపోహ ఎక్కువ మందిలో నాటుకుపోయింది. మందుల షాపుల్లో, జిమ్స్‌లో, ఆన్‌లైన్‌లో ఎవరికి వారు వీటిని కొనేసి యదేచ్ఛగా వాడుతున్న పరిస్థితి. కానీ వీటి పట్ల అవగాహన లేకుండా వాడుకోవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.
ఇవి ఎవరి కోసం?

కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అయితే ఆ కండరాలను అవసరానికి మించి వాడే వాళ్లకే వీటి అవసరం ఎక్కువ. ఇందుకోసం ఎక్కువ ప్రొటీన్లు తీసుకునేవాళ్లు తప్పనిసరిగా వెయిట్స్‌ ఎత్తాలి, వర్కవుట్స్‌ చేయాలి. జిమ్‌లో చెమటలు కక్కించాలి. ఇలా ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడే వాటి ఫలితం కనిపిస్తుంది. లేదంటే ఫలితం పూర్తి భిన్నంగా ఉంటుంది. శారీరక శ్రమ లేని శరీరానికి అదనంగా ప్రొటీన్లు అందిస్తే అవి క్యాలరీలుగా కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉండిపోతాయి. దాంతో బరువు పెరుగుతారు. కాబట్టి అవసరం లేనివాళ్లు అదనపు ప్రొటీన్ల జోలికి వెళ్లకూడదు. పరిమితికి మించిన మాంసకృత్తులు గర్భిణులకు, ఆటలాడే యువ క్రీడాకారులకు, బాడీ బిల్డర్లకు అవసరం. నిజానికి మాంసాహారులకు సరిపడా ప్రొటీన్లను వాళ్లు ఆహారం ద్వారా తీసుకోవచ్చు. గర్భిణులు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు అదనపు ప్రొటీన్ల అవసరం ఉంటుంది కాబట్టి వైద్యులు ప్రొటీన్లను సూచిస్తారు. అయితే అవి పూర్తిగా ఆహారం నుంచి అందేలా చూసుకోవాలి. ఒకవేళ అప్పటికీ సరిపోక పోయినప్పుడే వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తారు. అలాగే మజిల్‌ మాస్‌, శరీర సౌష్టవం అవసరమైన బాడీ బిల్డర్లు, అథ్లెట్లకు కూడా ప్రొటీన్‌ అవసరం ఎక్కువే! కాబట్టి వాళ్లు ఆహారం ద్వారా అందే ప్రొటీన్లను లెక్కించుకుంటూ, అవసరాన్ని బట్టి అదనంగా ప్రొటీన్‌ పౌడర్లు వాడుకోవలసి ఉంటుంది.
రోజుకి ఎన్ని ప్రొటీన్లు?

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ కొన్ని మార్గనిర్దేశాలను సూచించింది. ఒక రోజుకు పురుషులైతే 56 గ్రాములు, స్త్రీలు 45గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అయితే ఈ లెక్కలు ఆ వ్యక్తుల శారీరక శ్రమ, వయసులను బట్టి మారుతూ ఉంటాయి. అయితే తీసుకునేవి ఎన్ని ప్రొటీన్లయినా సాధ్యమైనంత వరకూ కృత్రిమ రూపంలో కాకుండా, ఆహారం ద్వారా అందేలా చూసుకోవాలి.


పౌడర్లు - దుష్ప్రభావాలు

ప్రొటీన్‌ పౌడర్లతో కండరాల దృఢత్వం పెరిగినా, వాటికీ కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని ప్రొటీన్‌ పౌడర్లు సరిపడవు. 

వే ప్రొటీన్‌: ప్రొటీన్‌ పౌడర్లలో బాగా వాడుకలో ఉన్నది ‘వే ప్రొటీన్‌’. బాడీ బిల్డర్లు, వెయిట్‌ లిఫ్టర్లు, బరువు తగ్గటం కోసం వెయిట్‌ ట్రైనింగ్‌ చేసేవాళ్లకు ఉద్దేశించిన ప్రొటీన్‌ ఇది. పాలలోని లాక్టోస్‌ సరిపడని పసికందుల్లో అలర్జీల నివారణకు, పెద్దపేగు కేన్సర్‌ చివరి దశలో ఉన్నవాళ్లకు ఈ ప్రొటీన్‌ను వైద్యులు సూచిస్తూ ఉంటారు.

దుష్ప్రభావాలు: కడుపులో కదలికలు పెరుగుతాయి. తల తిరగటం, దాహం, త్రేన్పులు, ఉబ్బరం, ఆకలి మందగించటం, తలనొప్పి, నీరసం.

సోయా ప్రొటీన్‌: వే ప్రొటీన్‌ సరిపడని వాళ్లకు సోయా ప్రొటీన్‌ ప్రత్యామ్నాయం. అయితే సోయా వల్ల శరీరంలో ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రొటీన్‌ను పురుషులు వాడకపోవడమే ఉత్తమం. మహిళా క్రీడాకారులు, అథ్లెట్లు, వెయిట్‌ లిఫ్టర్ల కోసం ఉద్దేశించిన పూర్తి ప్లాంట్‌ బేస్‌డ్‌ ప్రొటీన్‌ ఇది. 

దుష్ప్రభావాలు: మలబద్ధకం, ఉబ్బరం, తల తిరగటం, చర్మంపై దద్దుర్లు.
ప్రొటీన్‌ ఫుడ్‌ 

మాంసాహారంతో పాటు కొన్ని శాకాహార ఉత్పత్తుల్లో కూడా సమృద్ధిగా మాంసకృత్తులు ఉంటాయి. వాటి పట్ల అవగాహన పెంచుకుని, రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

 • తక్కువ కొవ్వు కలిగిన చీజ్‌ స్లయిసెస్‌
 • పెరుగు 
 • స్లిమ్‌ మిల్క్‌ పనీర్‌
 • క్వినోవా, అవిసె గింజలు
 • సోయా నగ్గెట్స్‌, సోయా మిల్క్‌
 • ఓట్స్‌, పీనట్‌ బటర్‌ 
 • సబ్జా గింజలు
 • నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గసగసాలు
 • బఠాణీ, చిక్కుళ్లు
 • క్యాబేజి, కాలీఫ్లవర్‌ 
 • క్యాప్సికమ్‌ 
 • పుట్టగొడుగులు
 • కందిపప్పు, మినుములు, పెసలు 
 • అవకాడొప్రొటీన్లు ఎక్కువైతే?

శరీరానికి సరిపడా ప్రొటీన్లు తీసుకోవటం ఎంత అవసరమో, వాటిని ఖర్చు చేయడమూ అంతే అవసరం. కాబట్టి ఖర్చయ్యే క్యాలరీల ఆధారంగా ప్రొటీన్ల పరిమాణాన్ని అంచనా వేసి తీసుకోవాలి. అవగాహన లేకుండా అవసరానికి మించి ప్రొటీన్లు తీసుకుంటే ఆరోగ్య నష్టాల్ని భరించాల్సి వస్తుంది.

బోన్‌ లాస్‌: అత్యధిక ప్రొటీన్లు తీసుకుంటే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో శరీరం ఎక్కువైన యాసిడ్‌ను విసర్జించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఎముకల నుంచి క్యాల్షియం కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి.

కిడ్నీ డ్యామేజ్‌: అధిక ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కిడ్నీల మీద భారం పడుతుంది. వాటిలోని కీటోన్లను వడగట్టడంలో కిడ్నీలు ఒత్తిడికి లోనవుతాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

డీహైడ్రేషన్‌: తగినన్ని పిండి పదార్థాలు లేకుండా అత్యధిక ప్రొటీన్లను తీసుకోవటం వల్ల విషపూరిత కీటోన్లు శరీరంలో పెరుగుతాయి. దాంతో కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. పైగా వ్యాయామం వల్ల చమట ద్వారా ద్రవాలు వెళ్లిపోతాయి. వీటన్నిటి కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

Updated Date - 2022-10-11T16:26:03+05:30 IST