ప్రారంభ దశలో గుర్తిస్తే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు

ABN , First Publish Date - 2022-09-06T15:41:14+05:30 IST

గర్భసంచి లోపలి పొరే ఎండోమెట్రియం. ప్రతి నెలా నెలసరికి ముందు ఈ పొర గర్భధారణకు అనువుగా మందంగా మారుతుంది

ప్రారంభ దశలో గుర్తిస్తే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు

ర్భసంచి లోపలి పొరే ఎండోమెట్రియం. ప్రతి నెలా నెలసరికి ముందు ఈ పొర గర్భధారణకు అనువుగా మందంగా మారుతుంది. గర్భధారణ జరగనప్పుడు నెలసరి స్రావంతో బయటకు వచ్చేస్తుంది. ఈ ఎండోమెట్రియల్‌ హార్మోన్లలో హెచ్చుతగ్గులు జరగడం వల్ల పొర పలుచనై సంతానలేమికి దారి తీస్తుంది. సాధారణంగా మెనోపాజ్‌ దశలో ఈ పొర పలుచగా మారిపోతుంది. పిల్లలను కనే వయసులో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువై పొర మందంగా మారితే, ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండే గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల పలుచగానూ మారుతుంది. గర్భధారణ సమయంలో మందంగా మారే ఈ పొర ద్వారా గర్భంలో పెరిగే బిడ్డకు పోషకాలు, ఆక్సిజన్‌ అందుతాయి. కాబట్టే సంతానలేమితో బాధపడేవారు, కృత్రిమ గర్భధారణను ఆశ్రయించేవారికి ఈ పొర మందాన్ని నిర్ధారించే పరీక్షలు చేపడతారు. 6 నుంచి 14 మిల్లీమీటర్ల మందంతో ఉండవలసిన ఈ పొర, అవసరానికి మించి ఎక్కువ మందంగా ఉన్నా, పలుచగా ఉన్నా, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఫైబ్రాయిడ్లు, సిస్ట్‌లు, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. 55 నుంచి 65 ఏళ్ల మహిళల్లో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 


ముప్పు వీళ్లలో ఎక్కువ

  • శరీరంలో ఈస్ట్రోజన్‌ మోతాదులు ఎక్కువగా ఉన్నవాళ్లలో...
  • సంతానం కలగని మహిళల్లో...
  • రొమ్ము క్యాన్సర్‌ సోకిన వారిలో...
  • ఆలస్యంగా మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో...
  • అధిక బరువు ఉన్న మహిళల్లో...


వ్యాధి లక్షణాలు

  • పొత్తికడుపులో నొప్పి
  • కలయికలో నొప్పి
  • మూత్రాన్ని నియంత్రించుకోలేకపోవడం
  • నెలసరిలో అధిక రక్తస్రావం
  • అజీర్తి
  • అలసట

వ్యాధి నిర్థారణ పరీక్షలు

ఎండోమెట్రియాసిస్‌, యుటెరైన్‌, ఫైబ్రాయిడ్స్‌, గర్భసంచి క్యాన్సర్‌ లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వాళ్లకు పాప్‌స్మియర్‌తో పాటు, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, హిస్టరోస్కోపీ, అలా్ట్రసౌండ్‌ మొదలైన పరీక్షలు చేయించవలసి ఉంటుంది. 


చికిత్సా విధానాలు

లక్షణాలు కనిపించిన వెంటనే ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రారంభ దశలోనే వ్యాధిని కనిపెడితే, మందులతో వ్యాధిని నియంత్రించవచ్చు. వ్యాధి మొదటి దశ దాటిటే శస్త్రచికిత్స తప్పదు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మొదటి దశలో కీహోల్‌ సర్జరీ చేయవచ్చు. మొదటి దశ దాటి వ్యాధి ముదిరినప్పుడు, గర్భాశయాన్ని తొలగించి, వ్యాధి దశ ఆధారంగా కీమోథెరపీ, రేడియో థెరపీలను ఇవ్వవలసి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఆధారంగా హార్మోన్‌ థెరపీ కూడా ఇవ్వవచ్చు.


ఈ జాగ్రత్తలు పాటించాలి

రొమ్ము క్యాన్సర్‌కు ‘‘టోమాక్యిఫెన్‌’’ మందులు వాడిన మహిళలు, ఇతర కారణాలతో నడుము ప్రదేశానికి రేడియేషన్‌ థెరపీ తీసుకున్నవారు, హార్మోన్‌ థెరపీ ఎక్కువగా తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసరి ఆగనివారు, ధూమపానం చేసేవారు తగిన వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా పాప్‌స్మియర్‌, అలా్ట్రసౌండ్‌, కాల్పోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.


-డాక్టర్ సి.హెచ్ మోహన వంశీ

చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్

ఒమేగా హాస్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

ఫోన్: 98490 22121



Updated Date - 2022-09-06T15:41:14+05:30 IST