యువతను బెంబేలెత్తిస్తోన్న డెంగీ

ABN , First Publish Date - 2022-08-31T18:24:34+05:30 IST

జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది(Dengue rise). అస్వస్థతతో ఆస్పత్రులకు వచ్చిన వారిలో ఇప్పటి వరకు 12,300 మంది నమునాలను వైద్యులు

యువతను బెంబేలెత్తిస్తోన్న డెంగీ

పెరుగుతున్న కేసులు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది(Dengue rise). అస్వస్థతతో ఆస్పత్రులకు వచ్చిన వారిలో ఇప్పటి వరకు 12,300 మంది నమునాలను వైద్యులు పరీక్షించారు. వారిలో 1,490  మంది వరకు డెంగీ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 332 మంది, మేడ్చల్‌ జిల్లాలో 136 మందికి డెంగీ సోకింది. ఈ నేపథ్యంలో ఫీవర్‌ ఆస్పత్రిలో 120 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చే వైరల్‌ ఫీవర్ల కేసుల్లోనూ 30 నుంచి 40 శాతం వరకూ డెంగీ నిర్ధారణ అవుతోంది. చాలా మందికి ఓపీలోనే చికిత్స అందిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజుకు 10 నుంచి 20 మంది డెంగీ అనుమానిత లక్షణాలతో వస్తున్నారు. 


పడిపోతున్న ప్లేట్‌లెట్స్‌ 

వైరల్‌ ఫీవర్లు ఒక్కోసారి సీరియ్‌సగా మారుతున్నాయి. బీపీ తగ్గడం, విపరీతంగా జ్వరం, శరీరంపై ర్యాషెస్‌ వంటివి వస్తున్నాయి. కొందరికి ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయి. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. పగటి పూట కుట్టే టైగర్‌ దోమతోనే డెంగీ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.


యువతే  బాధితులు

ఎక్కువగా యువతే డెంగీ బారిన పడుతున్నారు. సాధారణ జ్వరం రెండు, మూడు రోజుల్లో తగ్గుతుంది. డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శరీరంపై ర్యాషెస్‌ వస్తాయి. జాయింట్‌ వద్ద నొప్పి ఉంటుంది. జ్వరం 103 డిగ్రీల నుంచి 105 ఉండే అవకాశాలు ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్‌ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో సత్తువ తగ్గితే వెంటనే కొబ్బరిబొండం తాగడం మంచిది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం, నూనెలతో చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. 

- డాక్టర్‌ హరికిషన్‌, జనరల్‌ ఫిజిషియన్‌, కామినేని ఆస్పత్రి



Updated Date - 2022-08-31T18:24:34+05:30 IST