సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త! అప్రమత్తతే ఆయుధం
ABN , First Publish Date - 2022-07-26T18:16:38+05:30 IST
ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరించే కేన్సర్ కాలేయ కేన్సర్ అనీ, ఈ వ్యాధితో ప్రతి 30 సెకన్లకూ ఒకరు ప్రాణాలు

కాలేయాన్ని కుదేలు చేసే సైలెంట్ కిల్లర్... హెపటైటిస్. కాబట్టి హెపటైటిస్, లక్షణాలు, వ్యాధి నిర్థారణ, నివారణకు సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరించే కేన్సర్ కాలేయ కేన్సర్ అనీ, ఈ వ్యాధితో ప్రతి 30 సెకన్లకూ ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అయితే వైరల్ హెపటైటిస్ సోకిన వాళ్లకు కాలేయ కేన్సర్ సోకే ముప్పు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి వైరల్ హెపటైటిస్ సోకుతోంది. అయినప్పటికీ ఎయిడ్స్ కంటే 50 నుంచి 100 రెట్లు విస్తరించే అవకాశమున్న వైరల్ హెపటైటిస్‌కు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయం.
కాలేయం ఏం చేస్తుంది?
శరీరంలో అతి పెద్ద అవయమైన కాలేయం, 500 రకాల జీవక్రియలను చేపడుతుంది. మనం తినే పిండి పదార్థాలు మొదలు, కొవ్వులు, ఖనిజ లవణాలన్నీ కాలేయంలో మెటబలైజ్ అవుతూ, పేగుల ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది. కాలేయం రక్తం గడ్డడానికి తోడ్పడే ముఖ్యమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. కాలేయం, కిడ్నీలు రెండూ శరీరంలోని మలినాలను, యాసిడ్లనూ వడగడుతూ ఉంటాయి. శరీరంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఒక స్టోరేజి ఆర్గాన్‌గా కాలేయం ఉపయోగపడుతుంది.
కామెర్లు అంటే?
కాలేయం ఇన్ఫ్లమేషన్కు గురవడాన్ని హెపటైటిస్ అంటారు. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే, కాలేయం శాశ్వతంగా దెబ్బతిని, ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలు...వైరల్ హెపటైటిస్ (ప్రధానంగా హెపటైటిస్ ‘బి’, ‘సి’), ఫ్యాటీ లివర్, మద్యం. వీటితో పాటు మరో 100 కారణాల మూలంగా కాలేయం దెబ్బతిని, సిర్రోసిస్ (కాలేయ వ్యాధి చివరి దశ)కు చేరుకుంటుంది.
హెపటైటిస్ ‘సి’ని పూర్తిగా నయం చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం 3 నెలల పాటు రోజుకు ఒక మాత్ర చొప్పున తీసుకోవాలి. దీంతో 90% వైరస్‌ను అంతం చేయవచ్చు.
వైరల్ హెపటైటిస్ పట్ల అవగాహన అవసరం
గత కొన్ని దశాబ్దాలుగా హెపటైటిస్ బి, ఏటా పది లక్షల మరణాలకు కారణమవుతోంది. దాదాపు 200 కోట్ల జనాభా ప్రస్తుతం హెపటైటిస్ బితో బాధ పడుతున్నారు. హెపటైటిస్ బి సోకిన 35 కోట్ల మంది ప్రజలు, వారి నుంచి ఇతరలకు ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో, 75% మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందిలో హెపటైటిస్ సి వైరస్ ఉందని ఓ అంచనా. ఈ వైరస్ దీర్ఘకాలంలో కాలేయాన్ని పాడు చేసి, తిరిగి సరిదిద్దలేని సిర్రోసిస్, కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ప్రతి 3 కాలేయ కేన్సర్ మరణాల్లో రెండు మరణాలు వైరల్ హెపటైటిస్ వల్లే సంభవిస్తున్నాయి.
హెపటైటిస్ లక్షణాలు
80% పాడైనప్పటికీ సమర్ధంగా పనిచేయగలిగే అద్భుతమైన అవయవం కాలేయం. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు కాబట్టి లక్షణాలు బయల్పడితే, అప్పటికే ఆలస్యమైనట్టుగా భావించాలి. ఇలా లక్షణాలు బయల్పరచకుండా దెబ్బతింటుంది కాబట్టే, కాలేయాన్ని సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు. ప్రతి 10 మందిలో 9 మంది తమకు హెపటైటిస్ వైరస్ సోకినట్టు గ్రహించలేరు. వారిలోని వైరస్ ఇతరత్రా రుగ్మతల్లో చేపట్టే సాధారణ పరీక్షల్లో బయటపడుతూ ఉంటుంది. ప్రధానంగా కామెర్లు, పొట్ట వాపు, కాళ్ల వాపు, రక్తపు వాంతులు లేదా నల్లని మలం, అయోమయం, మత్తు లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కాలేయం విపరీతంగా దెబ్బ తిన్నప్పుడు మాత్రమే బయల్పడతాయి.
వైరస్‌ను కనిపెట్టే పరీక్షలు
ఈ వైరస్‌లను రక్త పరీక్ష ద్వారా తేలికగా గుర్తించవచ్చు. ఈ వైరస్‌ను కనిపెట్టిన తర్వాత, వైరస్ దశనూ, కాలేయానికి జరిగిన నష్టాన్ని కాలేయ వైద్యులు అంచనా వేస్తారు. వాటి ఆధారంగా తదుపరి చికిత్సను ఎంచుకుంటారు.
అందుబాటులో ఉన్న చికిత్సలు
ముందుగానే గుర్తిస్తే, ఈ వ్యాధిని నయం చేయడం తేలిక. మందులతో వ్యాధి సిర్రోసిస్‌కు దారి తీయకుండా అడ్డుకట్ట వేయవచ్చు. హెపటైటిస్ ‘సి’ని పూర్తిగా నయం చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం 3 నెలల పాటు రోజుకు ఒక మాత్ర చొప్పున తీసుకోవాలి. దీంతో 90% వైరస్‌ను అంతం చేయవచ్చు. తద్వారా కాలేయం సిర్రోసిస్‌కూ, కేన్సర్‌కూ దారి తీయకుండా అడ్డుకోవచ్చు. హెపటైటిస్ ‘బి’ వైరస్‌ను సైతం కట్టడి చేసే అద్భుతమైన మందులున్నాయి. అలాగే హెపటైటిస్ ‘బి’, ‘ఎ’ల కోసం కూడా అద్భుతమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అపోలో హాస్పిటల్‌లోని లివర్ క్లినిక్స్‌లు ప్రత్యేకించి ఈ ప్రాణాంతక వైరస్ల చికిత్సల కోసమే నడుస్తున్నాయి. ఈ వైరస్‌లను గుర్తించి, చికిత్స చేసే అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. చివరి దశ కాలేయ వ్యాధులను సైతం ఇక్కడి వైద్య నిపుణులు సమర్థంగా నయం చేయగలుగుతున్నారు. గత పదేళ్లుగా కాలేయ మార్పిడి అవసరమైన రోగులకు ఇక్కడ ఆ అవసరం లేకుండా విజయవంతమైన చికిత్స అందించడం జరుగుతోంది.
కాలేయాన్ని కుదేలు చేసే ఈ సైలెంట్ కిల్లర్ హెపటైటిస్ వైరస్‌లను పరీక్షలతో గుర్తించి, నెగటివ్ ఫలితం వస్తే మనందరం తప్పనసరిగా వ్యాక్సీన్లు వేయించుకుందాం. ఈ ప్రపంచాన్ని 2030 నాటికి హెపటైటిస్ రహిత ప్రపంచంగా మార్చడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మనందరం ముందుకొచ్చి, పరీక్ష చేయించుకుని పాజిటివ్ అయితే చికిత్స తీసుకుందాం, నెగటివ్ అయితే వ్యాక్సీన్ తీసుకుందాం.

-డాక్టర్ నవీన్ పోలవరపు
చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
