మూత్రాశయ క్యాన్సర్‌ నివారించదగినదే!

ABN , First Publish Date - 2022-05-24T18:24:18+05:30 IST

భారతదేశ జనాభాలో మూత్రాశయ క్యాన్సర్‌ ఒక సాధారణమైన క్యాన్సర్‌. దేశంలో ఇది 9వ అత్యంత సాధారణ క్యాన్సర్‌. సుమారు 35% కేసులు మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ చికిత్సలో

మూత్రాశయ క్యాన్సర్‌ నివారించదగినదే!

ఆంధ్రజ్యోతి(24-05-2022)

భారతదేశ జనాభాలో మూత్రాశయ క్యాన్సర్‌ ఒక సాధారణమైన క్యాన్సర్‌. దేశంలో ఇది 9వ అత్యంత సాధారణ క్యాన్సర్‌. సుమారు 35% కేసులు మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్‌ మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. వయసుతో పాటు ఈ కేన్సర్‌ ప్రమాదం కూడా పెరుగుతుంది. 55 ఏళ్లు దాటిన వారిలో ఈ క్యాన్సర్‌ ఎక్కువ.


మూత్రాశయ క్యాన్సర్లకు చికిత్స ప్రారంభంలోనే నిర్థారించడం జరుగుతుంది. కానీ ప్రారంభ దశలోని మూత్రాశయ క్యాన్సర్లు చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ తిరగబెడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మూత్రాశయ క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న రోగులు చికిత్స పూర్తయిన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 


మూత్రాశయ క్యాన్సర్‌ లక్షణాలు...

మూత్రంలో రక్తం పోవడం, మూత్రం ఎరుపు, గోధుమ రంగులో ఉండడం, కొన్ని సందర్భాల్లో మూత్రం సాధారణంగానే కనిపించినా పరీక్షల్లో మూత్రంలో రక్తం కనిపించడం 

తరచుగా మూత్ర విసర్జన చేయవలసి రావడం

బాధతో కూడిన మూత్ర విసర్జన

వెన్ను నొప్పి


మూత్రాశయ క్యాన్సర్‌ రోగులకు.. 

క్యాన్సర్‌ రకం, గ్రేడ్‌, దశ, వారి ఆరోగ్యం ఆధారంగా చికిత్స అందించవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, డ్రగ్‌ థెరపీ ఉంటాయి. 


అపోహలు - వాస్తవాలు

మూత్రాశయ క్యాన్సర్‌ గురించిన ఎన్నో అపోహలున్నాయి. కానీ వాస్తవాలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

అపోహ: పురుషులకు మాత్రమే మూత్రాశయ క్యాన్సర్‌ సోకుతుంది

వాస్తవం: పురుషులలో సాధారణమే అయినా, మహిళలకూ సోకే అవకాశాలున్నాయి. మహిళలకు మూత్రాశయ క్యాన్సర్‌ రాదనే అపోహతో కొందరు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, రోగనిర్థారణను ఆలస్యం చేసి, క్యాన్సర్‌ను పెంచి పోషించుకుంటూ ఉంటారు. 

అపోహ: ఇది పోరాడడానికి సులువైన క్యాన్సర్‌

వాస్తవం: క్యాన్సర్‌ చికిత్సకు భయపడేవాళ్లకు మూత్రాశయ క్యాన్సర్‌ను నయం చేయడం కష్టం. శారీరక, మానసిక ఒత్తిడులతో ఈ క్యాన్సర్‌ నయమయ్యే పరిస్థితులు ఉండవు. 

అపోహ: మూత్రాశయ క్యాన్సర్‌ ధూమపానంతో వస్తుంది

వాస్తవం: సిగరెట్లు, పొగాకు వల్ల మూత్రాశయ క్యాన్సర్‌ వృద్ధి చెందుతుంది. అయితే పొగాకు వాడకం వల్లే మూత్రాశయ క్యాన్సర్‌ వస్తుంది అనడంలో ఎలాంటి వాస్తవం లేదు.

అపోహ: మూత్రాశయ క్యాన్సర్‌కు మూత్రాశయం తొలగింపు ఒక్కటే విజయవంతమైన చికిత్స

వాస్తవం: ర్యాడికల్‌ రేడియేషన్‌ థెరపీ... అంటే కీమోథెరపీతో పాటు మూత్రాశయ సంరక్షణ విధానాలతో, మూత్రాశయ క్యాన్సర్‌ను నయం చేసే అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అనేక కొత్త ఇమ్యునోథెరపీలు మూత్రాశయ క్యాన్సర్‌ను నయం చేస్తున్నాయి. రోగిలో క్యాన్సర్‌ దశను బట్టి డాక్టర్లు చికిత్సా విధానాన్ని ఎంపిక చేసుకుని నయం చేస్తారు.


డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ

డైరెక్టర్‌ - చీఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్‌,

రెనోవా సౌమ్య క్యాన్సర్‌ సెంటర్‌,

కార్ఖానా, సికింద్రాబాద్‌.

సంప్రదించవలసిన నం: 7799982495

Read more