దోమలొస్తున్నాయ్‌.. జాగ్రత్త! అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

ABN , First Publish Date - 2022-07-19T20:28:59+05:30 IST

వరుస వానలకు బస్తీలు, మురికివాడలు, కాలనీలు అధ్వానంగా మారుతున్నాయి. నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.

దోమలొస్తున్నాయ్‌.. జాగ్రత్త! అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : వరుస వానలకు బస్తీలు, మురికివాడలు, కాలనీలు అధ్వానంగా మారుతున్నాయి. నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇటువంటి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌, వ్యాధులు ప్రభలే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో మరిన్ని వ్యాధులు విస్తరించే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొంటున్నారు. 


జాగ్రత్తలు ఇలా..

  • దోమలు కుట్టకుండా తెరలు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి.
  • పగటి పూట కూడా శరీరం పూర్తిగా కవర్‌ అయ్యేలా దుస్తులు ధరించాలి. 
  • చిన్నచిన్న గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
  • ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో డీడీటీ లాంటి పౌడర్లను చల్లాలి. 
  • పూల తొట్టెలు, ఫ్లవర్‌ వాజ్‌లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
  • వంట గదిలో ఆహార వ్యర్థాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • ఎప్పటి చెత్తను అప్పుడే పారేయాలి. 
  • రోడ్డు మీద అమ్మే తినుబండారాలు తినొద్దు.
  • నీటిలో క్లోరిన్‌ బిళ్లలు కలిపి శుద్ధి చేయాలి. 
  • ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.
  • వర్షపు నీటిలో చెప్పులు లేకుండా తిరగొద్దు. 
  • తడిసి ఇంటికి వచ్చిన వారు వేడి నీటితో స్నానం చేయాలి. 
  • పిల్లలకు రెయిన్‌కోటు వేసి స్కూళ్లకు పంపాలి. 
  • స్కూల్‌ షూ నిత్యం శుభ్రం చేయాలి. 
  • పిల్లలు ఇంటికి రాగానే చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి. 
  • 48 గంటలకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. 


Updated Date - 2022-07-19T20:28:59+05:30 IST