ఎత్తు పెరగాలంటే ఆ చికిత్సలు సేఫేనా?

ABN , First Publish Date - 2022-09-29T20:13:20+05:30 IST

మా బాబుకు పదేళ్లు. తోటి పిల్లలతో పోలిస్తే, తక్కువ ఎత్తు ఉన్నాడు. బాబు ఎత్తు పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎత్తు పెంచే

ఎత్తు పెరగాలంటే ఆ చికిత్సలు సేఫేనా?

డాక్టర్‌! మా బాబుకు పదేళ్లు. తోటి పిల్లలతో పోలిస్తే, తక్కువ ఎత్తు ఉన్నాడు. బాబు ఎత్తు పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎత్తు పెంచే శస్త్రచికిత్సలు సురక్షితమైనవేనా?


- ఓ సోదరి, హైదరాబాద్‌


త్తు పెరిగే వయసు గురించి మనలో చాలా అపోహలున్నాయి. టీనేజ్‌కి చేరుకునేవరకూ పిల్లలు పెరగుతూనే ఉంటారనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. ఆడపిల్లలు రజస్వల అయ్వేవరకూ మగపిల్లలు కౌమారంలోకి ప్రవేశించేవరకూ మాత్రమే ఎత్తు పెరుగుతారు. ఆడపిల్లలు రజస్వల అయ్యాక పెరుగుదల మందగించి అప్పటినుంచి మహా అయితే మరో అంగుళం ఎత్తు పెరుగుతారు. అంటే 13 ఏళ్ల వయసుకి వాళ్లు ఎంత ఎత్తు ఉంటే అదే అంతిమంగా పరిగణించాలి. మగపిల్లలు ఆడపిల్లలకంటే రెండేళ్లు ఎక్కువ పెరుగుతారు. అంటే వాళ్లు 15 ఏళ్ల వరకూ పెరిగి ఆగిపోతారు. అయితే ఎత్తు పెరిగే వేగం ఆడ మగ పిల్లల్లో వేర్వేరుగా ఉంటుంది. ఆడపిల్లలు రజస్వల వయసుకి వేగంగా పెరిగి, ఆ తర్వాత ఆగిపోతారు. మగపిల్లలు కౌమారానికి చేరుకునేవరకూ తక్కువ ఎత్తుతో ఉండి, చివరి రెండేళ్లు వేగంగా పెరుగుతారు. అలాగే పుట్టింది మొదలు రెండేళ్ల వయసుకి చేరుకునేవరకూ పెరిగే వేగం త్వరితంగా ఉండి తర్వాత మందగిస్తుంది. 


  • ఎత్తు పెరగటానికి పౌష్టికాహారం ఎలా తోడ్పడుతుందో వ్యాయామాలు కూడా అంతే తోడ్పడతాయి. ముఖ్యంగా కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పెంచే రెసిస్టెన్స్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల ఎముకలు వేగంగా పెరుగుతాయి.
  • వ్యాయామం చేయటం వల్ల గ్రోత్‌ హార్మోన్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. బాస్కెట్‌ బాల్‌ ఆడటం, స్ట్రెచింగ్‌, కార్డియోలాంటి వ్యాయామాలు ఎత్తు పెరగటానికి తోడ్పడతాయి.  
  • మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంధి విడుదల చేసే 6 స్రావాల్లో గ్రోత్‌ హార్మోన్‌ ఒకటి.  ఈ హార్మోన్‌ స్రావం వ్యాయామం చేసినప్పుడు, నిద్ర పోతున్నప్పుడు, ప్రొటీన్‌ పరిమాణం సమంగా ఉన్నప్పుడు పెరుగుతుంది. 
  • పిల్లల గ్రోత్‌ను పెంచే చికిత్సలన్నీ ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి పిల్లలు వయసుకు తగిన ఎత్తు పెరుగుతున్నారో లేదో ఎప్పటికప్పుడు పీడియాట్రిషియన్‌ సహాయంతో గ్రోత్‌ చార్ట్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ ఉండాలి.
  • గ్రోత్‌ హార్మోన్‌ లెవెల్స్‌ తగ్గితే ఆ హార్మోన్‌ను అందించే చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. అయితే ఎంత త్వరగా పెరుగుదల లోపాన్ని కనిపెట్టి అంత త్వరగా గ్రోత్‌ హార్మోన్‌ అందించగలిగితే ఫలితం కూడా అంతే బాగుంటుంది. 

ఎముకలు పెంచే సర్జరీ

పుట్టుకతోనే ఒక కాలు పొట్టి మరో కాలు పొడుగు ఉండి నడవలేని వారికి, ప్రమాదాల్లో కాళ్లు రూపం కోల్పోయినవారికి ఉద్దేశించిన ‘ఇలిజరోవ్‌’ సర్జరీ ఇది. అంతే తప్ప ఎత్తును పెంచుకోవడం కోసం ఈ సర్జరీని ఆశ్రయించడం సరి కాదు. ఈ సర్జరీలో మోకాలి కింది ప్రదేశంలో ఎముకను కత్తిరించి దూరం జరిపి రాడ్లు బిగిస్తారు. కత్తిరించిన ఎముకల రెండు చివర్లను రెండు వైపులా లాగుతూ రాడ్లు బిగించటం వల్ల ఆ ఒత్తిడికి ఎముక రెండు నుంచి మూడు అంగుళాల మేరకు పెరుగుతుంది. ఇందుకు దాదాపు 10 నెలలపాటు మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత శ్రమకోర్చి, ఖర్చుపెట్టి సర్జరీ చేయించుకున్నా కొత్తగా పెరిగే ఎముకలు పుట్టుకతో వచ్చిన ఎముకలంత బలంగా ఉండచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సర్జరీ సక్సెస్‌ అవుతుందనే గ్యారెంటీ ఉండదు. ఇన్‌ఫెక్షన్లు తలెత్తి కొన్ని సందర్భాల్లో పూర్తి కాళ్లే తొలగించాల్సిన దుస్థితి కూడా తలెత్తవచ్చు. పైగా కేవలం ఎత్తు పెంచటం కోసం ఈ సర్జరీ చేయించుకుంటే పెరగని రక్తనాళాలు, నరాల సంగతేమిటి? అవి కురచగానే మిగిలిపోయి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే పూర్తి శరీరాన్ని పరిశీలిస్తే చేతులు, నడుము పైభాగం పొట్టిగా ఉండి కాళ్లు మాత్రమే పొడవుగా కనిపిస్తూ శరీరాకారం ఇబ్బందికరంగా తయారవుతుంది.


-డాక్టర్‌. వి .శ్రీ నగేష్‌, 

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌, శ్రీ నగేష్‌ డయాబెటిస్‌, 

థైరాయిడ్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌, టోలిచౌకి, హైదరాబాద్‌.

Updated Date - 2022-09-29T20:13:20+05:30 IST