మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌దీ ఒకే ఎజెండా : మోదీ
ABN , First Publish Date - 2022-02-17T19:14:36+05:30 IST
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016లో భారత సైన్యం నిర్వహించిన

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌ది ఒకే విధమైన ఎజెండా అని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌కు రానివ్వొద్దని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్పడాన్ని కూడా మోదీ ఖండించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా మోదీ విరుచుకుపడ్డారు. ‘‘మిమ్మల్ని ఢిల్లీకి రానివ్వనివారు, ఇప్పుడు పంజాబ్‌కు వచ్చి మీ ఓట్లు కోరుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
అమరులైన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని, అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పట్ల యావద్భారతావని కలిసికట్టుగా స్పందించిందని, కేవలం కాంగ్రెస్ మాత్రమే రుజువులు చూపాలంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రజలను మాత్రమే కాకుండా మన సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైనవారిని సంస్మరించుకునే సమయంలో కూడా కాంగ్రెస్ ఇదే వైఖరిని ప్రదర్శించిందన్నారు. కాంగ్రెస్ ‘పాపాత్మ లీల’ను ప్రదర్శించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వ పథకాల వల్ల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, చికిత్స అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. పంజాబ్‌లో మాఫియా పాలనను కేవలం బీజేపీ మాత్రమే మార్చగలదని చెప్పారు. పీఎం-కిసాన్ పథకం వల్ల రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు.
నూతన దార్శనికతతో కూడిన ప్రభుత్వం పంజాబ్‌కు అవసరమని చెప్పారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత గొప్ప మార్పు తీసుకురాగలదన్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా మోదీ గురువారం బీజేపీ కూటమి తరపున అభోర్‌లో జరిగిన సభలో మాట్లాడారు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. 2016 సెప్టెంబరు 18న కశ్మీరులోని ఉరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. అనంతరం సెప్టెంబరు 28-29 తేదీల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.