నిధుల్లో మునుగోడు
ABN , First Publish Date - 2022-11-01T04:37:23+05:30 IST
ఉప ఎన్నికల వేళ మునుగోడుకు నిధుల వరద పారుతోంది...
ఉప ఎన్నిక వేళ పెండింగ్ నిధులన్నీ చకచకా మంజూరు
2015 నాటి భూనిర్వాసితులకు రూ.116 కోట్లు
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మికి రూ. 14.73 కోట్లు
140 యూనిట్లతో దళిత బంధు జాబితా సిద్ధం
7,600 గొర్రెల యూనిట్లకు రూ. 99.75 కోట్లు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల విడుదల
పెండింగ్ పనులకు వెనువెంటనే నిధులు
మధ్యాహ్న భోజనానికి రూ. 40 లక్షల బిల్లులు
ఠంఛనుగా ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణాలు
గౌడ, పద్మశాలీ ఓటర్లపై టీఆర్‌ఎస్ గురి
వారితో ‘ఆత్మీయ’ సమావేశాలు
సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలపై హామీ
పద్మశాలీలకు ఇటీవలే బీమా ప్రకటన
సంక్షేమ అధికారులతో రహస్య సమావేశాలు!
అంగన్‌వాడీలు, ఆశాలకూ బాధ్యతల అప్పగింత!!
(నల్లగొండ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉప ఎన్నికల వేళ మునుగోడుకు నిధుల వరద పారుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రూ. వందల కోట్ల విడుదలను చకచకా పూర్తిచేశాయి. 2015 నాటి డిండి ఎత్తిపోతల భూ నిర్వాసితులు తమకు అందాల్సిన పరిహారం, పునరావాస నిధుల కోసం చేయని పోరాటం లేదు. లాఠీ దెబ్బలూ తిన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక పుణ్యమా అని ఆ సమస్యకు మోక్షం లభించింది. దళిత బంధు జాబితా మొదలు.. గొర్రెల యూనిట్లు.. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులు విడుదలయ్యాయి. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు సైతం రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నా.. ఇక్కడ మాత్రం చకచకా మంజూరయ్యాయి. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక్కడ గంపగుత్తగా ఓట్లను సాధించే ఉద్దేశంతో సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. నిధులను విడుదల చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గానికి కృష్ణా నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ 2015లో డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పలు రిజర్వాయర్లకు రైతుల నుంచి వ్యవసాయ భూములను సేకరించారు.
ఇళ్లను పూర్తిగా ఎత్తివేసి మరోచోట పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోవడంతో.. 2016 నుంచి నాంపల్లి, మర్రిగూడెం మండలాల పరిధిలోని కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల పరిధిలోని గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు పనులకు ఆటంకం కలిగించడంతో లాఠీచార్జి సైతం జరిగింది. ఇప్పుడు ఆ ఫైలుకు మోక్షం లభించింది. ఈ రెండు మండలాల పరిధిలోని నిర్వాసితులకు రూ.116 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 101.50 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి చేరగా.. పునరావాసానికి సంబంధించిన రూ.14.50 కోట్లను జిల్లా ప్రణాళిక శాఖ పీడీ ఖాతాలో జమ చేశారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెండెన్సీ గడువు ఏడాదికి పైగా ఉంది. మునుగోడులో మాత్రం ఉప ఎన్నిక పుణ్యమా 1,631 పెండింగ్ దరఖాస్తుల్లో 1,473 క్లియర్ అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 14.73 కోట్లు జమయ్యాయి. నిధుల కొరతతో రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు నెమ్మదించగా.. మునుగోడులో మొదటి దశలో భాగంగా 140 యూనిట్ల ఎంపిక పూర్తయింది. గ్రౌండ్ ప్రక్రియను చకచకా పూర్తిచేసిన అధికారుల.. రూ. 14 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు లైన్ క్లియర్ చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 40 లక్షలను తాజాగా విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కింద ఈ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 90ు ఫైళ్లకు ఇటీవలే మోక్షం లభించింది. కొత్తగా 9 వేల ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. గ్రామాల్లో పంపిణీ కూడా మొదలైంది.
యాదవ, గౌడ, పద్మశాలి ఓట్లే లక్ష్యంగా..
మునుగోడులో బీసీ ఓటర్లు 60ు దాకా ఉన్నారు. వీరిలో 30,842 మంది ఓటర్లు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. వీరికోసం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా.. కేవలం 7 మండలాల్లో 7,600 గొర్రెల యూనిట్లను ఎంపిక చేయడం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 99.75 కోట్లను జమచేయడం పూర్తయిపోయింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో.. లబ్ధిదారుల ఖాతాల్లోని ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఎన్నికలయ్యాక లబ్ధిదారులు ఆ నిధులను వాడుకోవచ్చు. ఇక గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ 45 వేల మంది దాకా ఉండగా.. ఇటీవల వీరిని ఆకట్టుకునేందుకు సర్వాయిపాపన్న జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో సర్వాయిపాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఏటా జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించింది. టీఆర్‌ఎస్ నేతలు ఎక్కడికక్కడ గౌడ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. 25 వేల మంది పద్మశాలి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఇటీవల రైతుబీమా తరహాలో నేతన్నలకు బీమా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర సామాజిక వర్గాల ఓటర్లతోనూ టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగులను ఆకట్టుకునేలా..
డీఏ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, అలవెన్సులు, సరండర్ లీవ్స్, జీపీఎఫ్ పార్ట్, ఫైనల్ పేమెంట్ విడుదల కాక.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. మునుగోడులో మాత్రం.. ఉప ఎన్నిక ఎఫెక్ట్‌తో ఏడు మండలాలకు సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ. 20 కోట్ల బకాయిలు విడుదలయ్యాయి. వీరిలో ఓటర్లు కొందరే ఉన్నా.. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు. అందుకే ఈ బకాయిలు విడుదలైనట్లు స్పష్టమవుతోంది.
రోడ్లకు మోక్షం
గతంలో బిల్లులు మంజూరు కాక పలువురు కాంట్రాక్టర్లు వదిలిపెట్టిన పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. చండూరు మండలం అంగడిపేట నుంచి తుమ్మలపల్లి వరకు మాల్ నుంచి మర్రిగూడకు రూ.కోటితో రోడ్డు, నాంపల్లి మండలంలో రూ.3 కోట్లతో బ్రిడ్జి, చౌటుప్పల్ నుంచి తంగెడపల్లి వరకు రూ.3.16 కోట్లతో రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను దాదాపుగా పూర్తిచేశారు. రైతులకు కావాల్సిన విద్యు త్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మం జూరు చేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు.
సంక్షేమ అధికారులతో రహస్య భేటీ
సంక్షేమ శాఖల అధికారులు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ. దాంతో.. వారు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేలా నియోజకవర్గంలోని సంక్షేమ అధికారులతో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో రిసార్టులు, ఫంక్షన్ హాళ్లలో రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. ఓటర్లతో.. ఇంకా చెప్పాలంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరితో పరిచయం ఉండే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, వైద్యశాఖ సిబ్బంది, ఆశావర్కర్లతో భేటీలు నిర్వహించారు. వీరితో రహస్య ఎజెండాను అమలు చేయిస్తున్నట్లు సమాచారం.