Bilkis Bano Convicts: ఆ ఎమ్మెల్యేకు గోద్రా టికెట్ ఇచ్చిన బీజేపీ

ABN , First Publish Date - 2022-11-11T19:09:31+05:30 IST

సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో (Bilkis Bano) అత్యాచార దోషులను ‘సంస్కారవంతులైన బ్రాహ్మణులు’(Sanskari Brahmins)గా అభివర్ణించిన

Bilkis Bano Convicts: ఆ ఎమ్మెల్యేకు గోద్రా టికెట్ ఇచ్చిన బీజేపీ

గాంధీనగర్: సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో (Bilkis Bano) అత్యాచార దోషులను ‘సంస్కారవంతులైన బ్రాహ్మణులు’(Sanskari Brahmins)గా అభివర్ణించిన బీజేపీ నేతకు గోద్రా టికెట్ (Godhra Ticket) లభించింది. గుజరాత్ మాజీ మంత్రి, గోద్రా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రసింహ్ రౌల్జీ(Chandrasinh Raulji)కి బీజేపీ గోద్రా టికెట్‌ను కేటాయించింది. చంద్రసింహ్ గుజరాత్ ఎన్నికలకు ముందు 2017 ఆగస్టులో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆపై ఆమె మూడేళ్ల కుమార్తె సహా 9 మంది కుటుంబ సభ్యులను హత్యచేసి జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ కమిటీలో చంద్రసింహ్ కూడా సభ్యుడు కావడం గమనార్హం. ‘‘వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులు. కొందరు ఉద్దేశపూర్వకంగా వారిని లక్ష్యంగా చేసుకుని శిక్షించారు’’ అని రౌల్జీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న వీడియో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

అంతేకాదు, దోషులు జైలులోనూ చాలా మంచి ప్రవర్తనతో మెలిగారని ప్రశంసించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచార దోషులను జైలు నుంచి విడిచిపెట్టారు. వారికి పూలతో స్వాగతం పలికి మిఠాయిలు తినిపించి, పంచిపెట్టడం సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, గుజరాత్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.

Updated Date - 2022-11-11T19:09:41+05:30 IST