Munugode Election Results: మునుగోడులో చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-11-06T21:28:36+05:30 IST

తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులాబీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది.

Munugode Election Results: మునుగోడులో చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి
Jagadish Reddy

నల్లగొండ: తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులాబీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది. 2018లో జరిగిన ముందస్తు సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 స్థానాలకు హుజూర్‌నగర్‌, నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. 2018 సంవత్సరం నుంచి గత నాలుగు సంవత్సరాల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగగా ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. అయితే సీఎం కేసీఆర్‌కు అనుంగ శిష్యుడిగా పేరొందడమే కాకుండా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఆయన వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి జగదీష్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ అక్కడి ప్రజలకు కావల్సిన పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి అమలు చేస్తూనే మరోవైపు గులాబీ పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటూ నిత్యం ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వస్తున్నారు.

కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ వంటి కార్యక్రమాలతో మైండ్‌ గేమ్‌ ద్వారా ఎదుటి పార్టీకి ప్రజాప్రతినిధులు లేకుండా చేయడమే కాకుండా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం ఎజెంట్లు కూడా దొరకని విధంగా ఎత్తులు వేస్తూ వ్యూహంతో ముందుకు సాగుతూ ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు ఉప ఎన్నికల ప్రాంతాల్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి పార్టీ గెలుపునకు వారు సహకరించేలా చూసుకుంటూ ఉప ఎన్నికలో కారు హవా సాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రంలోనే దిగ్గజాలుగా పేరొందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో చేరి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని వరుసగా ఉప ఎన్నికలో కనుమరుగు చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి గుర్తింపు సాధించారని తల పండిన రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated Date - 2022-11-06T21:28:37+05:30 IST