అది అమిత్ షా పెద్దరికం : మాయావతి

ABN , First Publish Date - 2022-02-23T20:14:31+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఎస్‌పీ నేతలు పరస్పరం

అది అమిత్ షా పెద్దరికం : మాయావతి

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఎస్‌పీ నేతలు పరస్పరం ప్రశంసించుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ తన పార్టీ పట్ల వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించడం ఆయన ఔన్నత్యమని చెప్పారు. 


అమిత్ షా మంగళవారం ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బీఎస్‌పీకి కొన్ని దళిత, ముస్లిం ఓట్లు వెళ్ళడం వల్ల ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రయోజనం పొందుతుందా? అని అడిగినపుడు అమిత్ షా స్పందిస్తూ, దీనివల్ల బీజేపీకి లాభమా? నష్టమా? అనేది తనకు తెలియదన్నారు. నియోజకవర్గాన్నిబట్టి ఇది ఉంటుందన్నారు. అయితే  బీఎస్‌పీ అధినేత్రి మాయావతి పని అయిపోయిందనడం సరైనది కాదని చెప్పారు. ఆమె ప్రచారం స్థాయి తక్కువగా కనిపించినంత మాత్రానికి ఆమెకుగల యావత్తు మద్దతు తుడిచిపెట్టుకుపోయిందని భావించకూడదని అన్నారు. 


బీఎస్‌పీ సత్తాను అమిత్ షా సానుకూలంగా అంచనా వేయడంపై స్పందించాలని విలేకర్లు కోరినపుడు మాయావతి బుధవారం మాట్లాడుతూ, వాస్తవాన్ని గుర్తించడం ఆయన పెద్దరికమని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తమ పార్టీ బీఎస్‌పీకి దళితులు, ముస్లింలు మాత్రమే కాకుండా అగ్ర వర్ణాలు, వెనుకబడిన తరగతులకు చెందినవారు కూడా ఓట్లు వేశారని ఆయనకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. 


రాష్ట్రంలోని 403 స్థానాల్లో 300కు పైగా స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ చెప్తుండటంపై స్పందిస్తూ, కాలమే సమాధానం చెప్తుందన్నారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకు బదులు బీఎస్‌పీయే విజయం సాధించవచ్చు, ఎవరికి తెలుసు? అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా, గూండారాజ్ ఉంటుందని దుయ్యబట్టారు. 


Updated Date - 2022-02-23T20:14:31+05:30 IST