అఖిలేష్‌కు మద్దతుగా మరోసారి యూపీకి దీదీ

ABN , First Publish Date - 2022-03-02T22:31:08+05:30 IST

ఆయన యూపీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. నేను కూడా యూపీ ఎన్నికల కోసం వెళ్తున్నాను. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నాను. నాకు ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏమీ లేదు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల విషయంలో. ఎందుకంటే, విదేశీ వ్యవహారాల విషయంలో ఈ దేశమంతా ఒక్కటే..

అఖిలేష్‌కు మద్దతుగా మరోసారి యూపీకి దీదీ

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఉత్తరప్రదేశ్ వెళ్లి మరీ ప్రచారం నిర్వహించి వచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ. తాజాగా మరోసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. ‘‘అఖిలేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వారణాసికి వెళ్లబోతున్నాను. అలాగే వారణాసి గుడిని కూడా దర్శించుకుంటాను. బెంగాల్ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాకే యూపీకి వెళ్తున్నాను’’ అని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మమతా బెనర్జీ అన్నారు.


ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై మీడియా ప్రశ్నించగా ‘‘ఆయన యూపీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. నేను కూడా యూపీ ఎన్నికల కోసం వెళ్తున్నాను. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నాను. నాకు ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏమీ లేదు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల విషయంలో. ఎందుకంటే, విదేశీ వ్యవహారాల విషయంలో ఈ దేశమంతా ఒక్కటే. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న దూరం వల్ల కొన్ని జరుగుతాయి. కానీ, మన విద్యార్థుల్ని వీలైనంత తొందరగా వెనక్కి తీసుకురావాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు.


ఇంకా మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘ఒకరు చనిపోయారు. మరికొందరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇంకొందరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. కొందరు బంకర్లలో దాక్కున్నారు. మరికొందరు రొమేనియాలో ఎదురు చూస్తున్నారు. కొందరికి తినడానికి ఏమీ దొరడం లేదు. ఆహారం కోసం వెళ్లి చనిపోతున్నారు. ప్రభుత్వానికి జరుగుతున్న పరిణామాల గురించి తెలిసినప్పుడు, మన విద్యార్థులను ఎందుకు ముందుగా తీసుకురాలేదు?’’ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

Updated Date - 2022-03-02T22:31:08+05:30 IST