Digital war in Gujarat: గుజరాత్‌లో డిజిటల్‌ వార్‌!

ABN , First Publish Date - 2022-11-21T03:11:33+05:30 IST

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టాయి.

Digital war in Gujarat: గుజరాత్‌లో డిజిటల్‌ వార్‌!

సోషల్‌ మీడియా వేదికగా ప్రచార హోరు.. ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న నినాదాలు

మోదీ విజయాలే బీజేపీ అస్త్రాలు

గత వైభవమే కాంగ్రెస్‌ ఆయుధం

ఉచితాల చుట్టూ ‘ఆమ్‌ ఆద్మీ’

ప్రచార యజ్ఞంలో వేల మంది కార్యకర్తలు, వలంటీర్లు

అహ్మదాబాద్‌, నవంబరు 20: గుజరాత్‌ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టాయి. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్ర నినాదాలు పోస్టు చేస్తున్నాయి. వేల మంది కార్యకర్తలు, వలంటీర్లు ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నిజానికి బీజేపీ ఆరు నెలల ముందే డిజిటల్‌ ప్రచారం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆ పార్టీకి పెద్దసంఖ్యలో ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్వారా ప్రచారం హోరెత్తిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌ ఎక్కువగా వాట్సా్‌పపై ఆధారపడ్డాయి. దీనిద్వారా క్షేత్ర స్థాయిలో ఓటర్లకు చేరువయ్యేందుకు కృషిచేస్తున్నాయి. 182 స్థానాల అసెంబ్లీకి డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

స్థానిక నినాదాలతో బీజేపీ..

27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 2001 నుంచి 14 వరకు మోదీ సీఎంగా ఉన్నప్పుడు సాధించిన విజయాలు, ప్రధానిగా రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, రాష్ట్రంపై ఆయన ప్రభావం మొదలైన అంశాలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. ‘గుజరాత్‌ రూపకర్తను నేనే’ అని ప్రతి గుజరాతీ అనుకునేలా సరికొత్త ప్రచారాన్ని మోదీయే ప్రారంభించారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన నినాదంగా మారింది. 20 ఏళ్ల విశ్వాసం, 20 ఏళ్ల అభివృద్ధి.. మోదీ 20 ఏళ్ల స్వర్ణయుగం.. వందే భారత్‌.. బీజేపీ అంటేనే నమ్మకం.. తదితర నినాదాలను బీజేపీ గుజరాతీలో ప్రచారం చేస్తోంది. ఆరు నెలల కిందటే తాము డిజిటల్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టామని బీజేపీ సోషల్‌ మీడియా సహ ఇన్‌చార్జి మనన్‌ దానీ వెల్లడించారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు బీజేపీ 15కి పైగా యాప్‌లను ఉపయోగిస్తోంది. ఫేస్‌బుక్‌లో ఆ పార్టీ రాష్ట్ర శాఖకు 35 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 57.8 లక్షల మంది, ట్విటర్‌లో 15 లక్షల మంది, యూట్యూబ్‌లో 45,600 మంది ఫాలోయర్లు ఉన్నారు. 20 వేల మంది కార్యకర్తలు, 60 వేల మందికి పైగా వలంటీర్లు డిజిటల్‌ ప్రచారాన్ని నడుపుతున్నారు.

కాంగ్రెస్‌ ‘వర్గాల’ గ్రూపులు

మూడు దశాబ్దాల కిందట తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధికి ఏమేం చేసిందో వివరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రచారం చేస్తోంది. గుజరాత్‌ కాంగ్రె్‌సకు ఫేస్‌బుక్‌లో 7 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 64.3 లక్షల మంది, ట్విటర్‌లో 1.64 లక్షల మంది, యూట్యూబ్‌లో 8.91 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అసెంబ్లీ స్థానాలు, వర్గాలవారీగా ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని సిద్ధం చేశామని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చైర్మన్‌ కేయూర్‌ షా తెలిపారు. బూత్‌ స్థాయిలో, గ్రామస్థాయిలో 50 వేల వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశామని, ఠాకూర్‌, పాటీదార్‌, ఆదివాసీల కోసం గ్రూపులు నడుపుతున్నామని వ్లెడించారు. కథనాలు రాయడానికి ఏజెన్సీలను పెట్టుకున్నామని, 10-12 వేల మంది వలంటీర్లు స్థానికంగా 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపారు.

ఉచితాలపై ఆప్‌ నమ్మకం

ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌ ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఉచిత హామీలను ఆప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ ఉచిత పథకాలను ప్రజలకు తెలియజెప్పేందుకు వాట్సాప్‌ సందేశాలతో ముంచెత్తుతోంది. ఆప్‌కు జాతీయ స్థాయిలో ఫేస్‌బుక్‌లో 5.67 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.17 లక్షల మంది, యూట్యూబ్‌లో 42.3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. కాలేజీ విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌పై ఆప్‌ అధికంగా ఆధారపడుతోంది. వాట్సాప్‌ తమ ప్రధాన ప్రచార ఆయుధమని ఆ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సఫిన్‌ హసన్‌ అన్నారు. ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ ఫేస్‌బుక్‌ పేజీ ఇతర పార్టీల కంటే ఎక్కువగా ప్రభావితం చూపుతోంది.

Updated Date - 2022-11-21T09:07:01+05:30 IST