కాంగ్రెస్, ఆప్ కలిసి 25 సీట్లు గెలవలేవు: సుఖ్‌బీర్ సింగ్ బాదల్

ABN , First Publish Date - 2022-02-19T03:03:47+05:30 IST

శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమిపై నమ్మకం ఉంచినందుకు పంజాబీలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద స్థాయిలో పంజాబీల ఆదరణ ఎప్పుడూ చూడలేదు. రోడ్లన్నీ నిండిపోయాయి..

కాంగ్రెస్, ఆప్ కలిసి 25 సీట్లు గెలవలేవు: సుఖ్‌బీర్ సింగ్ బాదల్

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి 25 సీట్లు కూడా గెలవలేవని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. ఇక ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా పెద్ద ఎత్తున చేయడమే కాకుండా దళిత-బలహీన వర్గాలను కాంగ్రెస్ పీడించిందని ఆరోపించిన ఆయన.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పది సీట్లు కూడా గెలవలేదని జోస్యం చెప్పారు. పంజాబీలు తనను వ్యతిరేకిస్తున్నట్లు కేజ్రీవాల్ గ్రహించారని, అయితే దాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైరి పార్టీలపై నిందలు మోపుతున్నారని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు.


పంజాబ్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ‘‘శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమిపై నమ్మకం ఉంచినందుకు పంజాబీలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద స్థాయిలో పంజాబీల ఆదరణ ఎప్పుడూ చూడలేదు. రోడ్లన్నీ నిండిపోయాయి. తమ ఆట ముగిసిందని కాంగ్రెస్, ఆప్‌లు ఎట్టకేలకు గ్రహించాయి. ఒకరేమో రైతు వ్యతిరేకి (అరవింద్ కేజ్రీవాల్), మరొకరేమో మాఫియా సిండికేట్ (కాంగ్రెస్). వీరిద్దరినీ పంజాబీలు విసిరికొడతారు. ఇద్దరు కలిసినా 25 సీట్లు సాధించలేరు’’ అని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘తనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని కేజ్రీవాల్ దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. నిజానికి పంజాబీలే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఢిల్లీ మోడల్ అనేది ఉత్తిదేనని ఆయనకు తెలుసు. అందుకే 850 కోట్ల రూపాయలతో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, స్కాంలు, గూండాగిరి, గ్యాంగ్‌స్టర్లు, ఇసుక-లిక్కర్ మాఫియా, దళిత-బలహీన వర్గాలపై జరిగిన పీడన అనేక రెట్లు పెరిగింది. కాంగ్రెస్‌ను పంజాబీలు ఇప్పటికే తిరస్కరించారు. ఎన్నికల్లో మరోసారి వారి తిరస్కారాన్ని తెలియజేస్తారు’’ అని అన్నారు.


పంజాబ్‌లో ఈరోజుతో ప్రచారం ముగిసింది. ఎన్నికల పోలింగ్ 20వ తేదీన (ఆదివారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి.

Updated Date - 2022-02-19T03:03:47+05:30 IST