Fee reimbursement: విద్యార్థుల్ని వెంటాడుతోన్న బకాయిలు!

ABN , First Publish Date - 2022-11-11T10:28:05+05:30 IST

రాష్ట్రంలో విద్య బకాయిల్లో కూరుకుపోయింది. ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతో సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులకు

Fee reimbursement: విద్యార్థుల్ని వెంటాడుతోన్న బకాయిలు!
వెంటాడుతోన్న బకాయిలు!

బకాయిల్లో విద్య

రూ.3,350 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌

ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు అన్నీ బకాయిలే

త్రైమాసిక చెల్లింపులకు మంగళం పాడిన సర్కారు

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న కాలేజీలు

అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు

వడ్డీ భారం పెరిగిపోతున్నా బకాయిలివ్వని సర్కారు

సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ చార్జీల పెంపు ఊసే లేదు

అద్దె భవనాల్లోనే సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు

హైదరాబాదు, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్య బకాయిల్లో కూరుకుపోయింది. ఇంటర్‌(Inter) నుంచి ఇంజనీరింగ్‌ (Engineering) వరకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee reimbursement) చేయకపోవడంతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతో సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3,350 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అలాగే కళాశాలల నిర్వహణ భారంగా మారడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే కాలేజీలు మూతపడతాయని పేర్కొంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలను వాయిదాల పద్ధతిలో ప్రతి మూడు నెలలకోసారి చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది.

విద్యాసంవత్సరం ప్రారంభంలో 25%, మధ్యలో 50%, ఏడాది ముగిసే నాటికి 25% చెల్లిస్తామని పేర్కొంది. కానీ ఈ విధానానికి మంగళం పాడింది. గత విద్యాసంవత్సరం బకాయిలు పూర్తిగా ఇవ్వకపోగా, రెండేళ్ల బకాయిలు దాదాపు రూ.3,350 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ప్రభుత్వం సమయానికి చెల్లించకపోవడంతో వార్డెన్లు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,750 హాస్టళ్లు ఉండగా.. 650 పోస్టు మెట్రిక్‌, 1,100 ప్రీ మెట్రిక్‌ ఉన్నాయి. ఈ హాస్టళ్లలో దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులు ఉంటున్నారు.

ఫీజు కడితేనే సర్టిఫికెట్లు..

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా సర్కారు మాత్రం రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము విడుదల చేయడంలేదని వారు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.

అద్దె భవనాల్లోనే కాలక్షేపం

రాష్ట్రంలోని 1,750 హాస్టళ్లలో పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు చాలా వరకు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వీటికి అద్దె చెల్లింపు ప్రభుత్వానికి భారంగా మారింది. ఏడాదికి రెండు, మూడు దఫాల్లో చెల్లిస్తున్నది. ఉమ్మడి మహాబూబ్‌నగర్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో మరికొన్ని హాస్టళ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపగా, వాటి నిర్మాణ అంశం ఇంకా ఖరారు కాలేదు. గురుకులాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మెస్‌ చార్జీలు చెల్లించడంలో సైతం ప్రభుత్వం జాప్యం చేస్తోంది. 3 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950, 8 నుంచి పదో 10 తరగతికి రూ.1,100, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున చెల్లిస్తోంది. కానీ పెరిగిన ధరల ప్రకారం మెస్‌ చార్జీలను పెంచాలని సర్వత్రా డిమాండ్లు వస్తున్నాయి.

బకాయిలు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘం గురువారం తెలుగు సంక్షేమ భవన్‌తో పాటు కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బోధనా రుసుములు పెండింగ్‌లో ఉండడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సంఘం తెలిపింది. రాష్ట్రంలో మరో 120 బీసీ గురుకులాలు, 50డిగ్రీ కళాశాలలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - 2022-11-11T10:35:23+05:30 IST