కృష్ణానదీ తీరంలో తొలి రాజ్యం ఏది? పోటీ పరీక్షల కోసం!
ABN , First Publish Date - 2022-07-25T21:07:28+05:30 IST
పురావస్తు, చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా కృష్ణానదీ తీర తొలి రాజ్యంగా ఇక్ష్వాక రాజ్యంగా గుర్తించారు. శాతవాహనుల(Satavahanas) అనంతరం ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం ఇక్ష్వాకులు. ప్రస్తుత నాగార్జునసాగర్(Nagarjuna sagar) ప్రాంతంలో ఒకప్పుడు వర్ధిల్లిన
తెలంగాణ చరిత్ర - సంస్కృతి - ఉద్యమం
పురావస్తు, చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా కృష్ణానదీ తీర తొలి రాజ్యంగా ఇక్ష్వాక రాజ్యంగా గుర్తించారు. శాతవాహనుల(Satavahanas) అనంతరం ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం ఇక్ష్వాకులు. ప్రస్తుత నాగార్జునసాగర్(Nagarjuna sagar) ప్రాంతంలో ఒకప్పుడు వర్ధిల్లిన విజయపురి పట్టణ కేంద్రంగా ఇక్ష్వాక రాజ్యం ఏర్పడింది. చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి వీరికాలం సీ.ఈ.220 నుంచి సీ.ఈ.300 వరకు సాగినట్లుగా నిర్ధారించారు.
కృష్ణానది తీరంలో అనేక ప్రాచీన జనావాస కేంద్రాలను గుర్తించారు. మహీశక లాంటి జనపద రాజ్యాలనూ గుర్తించారు. అయితే రాజ్యవ్యవస్థకు వచ్చేసరికి ఇక్ష్వాకులను ఈ తీరాన తొలి రాజ్య స్థాపకులుగా నిర్థారించారు.
ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు
ఇక్ష్వాకుల చరిత్రకు ప్రత్యేక ఆధారాలు, నాగార్జునసాగర్ తవ్వకాల సమయంలో బయల్పడిన అనేక శాసనాలు, కట్టడాలు, ఉపయోగించిన పాత్రలు. వీటిలో నాగార్జునకొండ శాసనం, విశపట్టి శాసనం, మంచికల్లు శాసనం ప్రత్యేకమైనవి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా బయల్పడిన, గుర్తించిన ‘బౌద్ధ స్థూపాలు’, ఆలయాలు, రోమన్ ఇంజనీర్లు నిర్మించిన ‘రంగభూమి’గా పిలుస్తున్న క్రీడా ప్రాంగణం లేదా స్టేడియం.
ఇక్ష్వాకుల గురించి కొన్ని సాహితీ లేదా లిఖిత ఆధారాలను కూడా గుర్తించారు. వీటిలో ప్రధానమైంది ’నయసేనుడు’ అనే జైన గురువు రాసిన ‘ధర్మామృతం’. వీరి గురించిన ప్రస్తావన యుగపురాణం, మత్స్యపురాణం, విష్ణుపుణాల్లో ఉంది. అయితే వీరు ఎక్కడివారు అనే విషయం పట్ల చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వీరు ఉత్తర భారతదేశానికి చెందినవారుగా, మరికొందరు తమిళనాడు ప్రాంతానికి చెందినవారుగా, మరికొందరు కృష్ణాతీరం వారుగా కూడా భావిస్తున్నారు.
రాజకీయ చరిత్ర
ఇక్ష్వాకులు తొలుత శాతవాహనుల వద్ద మహాతలవరులుగా, సామంతులుగా పనిచేశారు. ఈ వంశంలోని శ్రీచాంతమూలుడు శాతవాహన రాజు మూడో పులమావిపై తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీరపురుషదత్తుడి అల్లూరి శాసనంలో వీరు తొలుత శాతవాహనులకు సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. శాసనాలు, నాణాలు, ఇతర ఆధారాల ప్రాతిపదికగా ఇక్ష్వాక వంశంలో నలుగురు రాజ్య పరిపాలన నిర్వహించినట్లుగా తెలుస్తోంది. విజయపురి ఇక్ష్వాకులను ‘మత్స్యపురాణం’లో పేర్కొన్న శ్రీపర్వతీయులుగా గుర్తిస్తారు. వీరి రాజచిహ్నం ‘సింహం’. పురాణాల ప్రకారం ఇక్ష్యాకుల రాజులు ఏడుగురు. కానీ శాసనాల ప్రకారం నలుగురు రాజులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్ష్వాకుల పరిపాలన కేంద్రం నల్లమల్లూరు కొండలు. వీటినే ప్రస్తుతం నాగార్జున కొండలుగా పిలుస్తున్నారు. వాస్తవంగా ఈ కొండల ఆధారంగానే నల్లగొండ అనే పేరు ఆవిర్భవించింది. రాజక్రమాన్ని కిందివిధంగా గుర్తించాలి.
శ్రీచాంతమూలుడు
శాతవాహనుల వద్ద సామంతుడిగా పనిచేసిన చాంతమూలుడు లేదా వాశిష్టీపుత్ర చాంతమూలుడు ధనక, పూగియ వంశాల సహాయంతో రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఐదో పరిపాలన సంవత్సరంలో వేసిన రెంటాల శాసనం, 13వ పాలన సంవత్సరంలో వేసిన కేసనపల్లి శాసనాలు శ్రీచాంతమూలుడిని వంశ స్థాపకుడిగా పేర్కొంటున్నాయి. ఇతడు ‘కార్తికేయుని’ లేదా ‘మహాసేన విరూపాక్ష స్వామి’ భక్తుడు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల విస్తరణ కోసం అనేక ‘నాగళ్ల’ను పంచి ‘శత సహస్ర హాలక’ బిరుదును పొందాడు. ప్రస్తుత శ్రీశైల ప్రాంతమంతా ఈయన ఏలుబడిలోనే ఉండేది. చాంతమూలుడికి ఇద్దరు సోదరిలు ఉన్నారు.
శాంతాశ్రీ, హార్మశ్రీ. శాంతాశ్రీ బౌద్ధమత అభిమాని. ఈమె పారావత మహావిహారాన్ని పునరుద్ధరించింది. శ్రీచాంతమూలుడి భార్యపేరు మాఢరిశ్రీ, కూతురు అటవి శాంతిశ్రీ. కుమారుడిపేరు మాఢరీపుత్ర వీరపురుషదత్తుడు. చాంతమూలుడుకి దక్షిణాపథపతి అనే బిరుదు కూడా ఉంది. ఇతడు వాజపేయ, అశ్వమేథ యాగాలు నిర్వహించాడని చాంతమూలుడి కుమారుడు వీరపురుషదత్తుడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
వీరపురుషదత్తుడు
వాస్తవంగా ఇక్ష్వాకుల వంశంలో వీరపురుషదత్తుడు ప్రత్యేకమైనవాడు. ఇతను మొదట్లో వైదిక మతాన్ని ఆవలంభించినప్పటికీ తరువాత బౌద్ధం స్వీకరించాడు. వీరపురుషదత్తుడికి ఐదుగురు భార్యలు. తన మేనత్త కూతుర్లయిన బాపిశ్రీ, పష్టశ్రీని వివాహం చేసుకున్నాడు(చారిత్రకంగా మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే ఆచారం మొదటిసారిగా ఇక్కడే కనిపిస్తుంది.). వీరు కాకుండా బట్టిమహాదేవి, రుద్రభట్టారిక, శాంతిశ్రీ భార్యలుగా ఉన్నారు. ఇందులో రుద్రభట్టారిక ఆ కాలంలో శక్తిమంతమైన శక వంశరాజు రెండో రుద్రసేనుడి కుమార్తె.
’రుద్రబట్టారిక’ను వివాహం చేసుకోవడం వల్ల అదనపు బలం చేకూరి బలమైన ఇక్ష్వాక రాజ్యం ఏర్పడింది. వీరపురషదత్తుడి పాలనకాలం తెలంగాణ బౌద్ధమత చరిత్రలో ఒక స్వర్ణయుగం. ఈ కాలంలో రాణులు, అంతపురం స్త్రీలు పోటీలు పడి బౌద్ద ఆరామాలకు దానధర్మాలు చేశారు. ప్రాశస్తమైన నేలకొండపల్లి బౌద్ధస్థూపం, ప్రత్యేకమైన శైలితో నిర్మించిన ఫణిగిరి బౌద్ధస్థూపం వీరపురుషదత్తుని కాలం నిర్మాణాలే. తల్లి పేరున మాడరిపుత్ర వీరపురుషదత్తునిగా కూడా ఇతడిని పిలిచేవారు. ఇతనికి కొడబలిశ్రీ అనే కూతురు, ఎహోబల శాంతమూల, ఎలి ఎహావులాదాసా అనే కుమారులు ఉన్నారు.
ఎహోబల శాంతమూలుడు
ఇతడిని రెండో శాంతమూలుడు అని కూడా అంటారు. ఈ కాలంలోనే తాతపేరు పెట్టుకునే సంప్రదాయం వచ్చింది. తండ్రి తాత్విక విచారణధారకు భిన్నంగా శాంతమూలుడు వైదిక మతాన్ని అనుసరించాడు. దక్షిణ భారతదేశంలో తొలి ఆలయ నమూనాను ఆవిష్కరించాడు. ఇతని కాలంలో దేవాలయాల నిర్మాణం ముమ్మరంగా సాగింది. నవగ్రహ, కుబేర, నొదగేశ్వర, హారీతి, కార్తికేయ తదితర దేవాలయాలు నిర్మితమయ్యాయి. అభిరరాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ సమీపంలో అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఇది తెలుగు ప్రాంతాల్లో నిర్మితమైన తొలి వైష్ణవ దేవాలయం. శాంతమూలుని సోదరి కొండబలిసిరి మహిషాసకులనే బౌద్ధమత శాఖీయులకు నాగార్జున కొండలో ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది. ఇక తొలి సాంస్కృతిక శాసనం దక్షిణాదిలో ఎహోబల శాంతమూలుడే వేయించాడు. ఇతని కాలంనాటి ప్రాకృత శాసనం గుమ్మడిగుర్రు శాసనం లభ్యమైంది. ఎహుబల కుమారుడు రాణి కపనాశ్రీ పుత్రుడు వీరపురుషదత్త వారసుడిగా, మహారాజ కుమార, మహాసేనాపతిగా బిరుదులు స్వీకరించాడు. అయితే కారణం తెలియదు కాని ఇతను రాజ్యాధికారం చేపట్టలేదు. తండ్రికంటే ముందే మరణించి ఉంటాడని చరిత్రకారులు భావిస్తున్నారు. దీంతో ఎహుబల తరువాత రాణి వమ్మబట్ట కుమారుడు రుద్రపురుషదత్తుడు రాజ్యాధికారానికి వచ్చాడు.
రుద్రపురుషదత్తుడు
ఇక్ష్వాక వంశంలో చివరిరాజు రుద్ర పురుషదత్తుడు. తల్లి పేరున ఒక గొప్ప స్మారక ఛాయస్థంభాన్ని నిర్మించి, స్మారక చిహ్నాల నిర్మాణాలకు ఆద్యుడుగా గుర్తింపు పొందాడు. రుద్రపురుషదత్తుని వివరాలు గురిజాల, మంచికల్లు శాసనాల్లో ఉన్నాయి. అయితే అప్పటికే తమిళనాట బలపడి, తెలుగు ప్రాంతాలవైపు విస్తరించే క్రమంలో పల్లవ రాజు సింహవర్మ చేతిలో రుద్రపురుషదత్తుడు ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ విషయం మంచికల్లు శాసనం ద్వారా తెలుస్తోంది. నాగార్జున కొండ వద్ద శ్రీలంక రాజులు తమ బౌద్ద సన్యాసుల కోసం ‘సింహళవిహారం’ను నిర్మించారు. అప్పట్లో నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంగా అవతరించింది. విజయపురి కేంద్రంగా ప్రస్తుత నల్లగొండ, మహబూబ్‌నగర్ నుంచి ఉత్తరాన మంథని, మహదేవ్‌పూర్ సరిహద్దుల వరకు, తూర్పున గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు ఇక్ష్వాకుల రాజ్యం విస్తరించింది.
ఆర్థిక వ్యవస్థ
ఇక్ష్వాకుల కాలంనాటి ఆర్థిక వ్యవస్థ గూర్చి సరైన ఆధారాలు లభ్యం కాలేదు. అయితే నాగార్జున సాగర్ తవ్వకాల్లో బయల్పడిన విషపట్టి శాసనం ఇక్ష్వాకుల ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని కొంతమేర అందిస్తోంది. శాతవాహన కాలంతో పోల్చినప్పుడు జనాభా పెరిగినట్లుగా గుర్తించారు. ఇక్ష్వాకుల నాణాలపై కూర్చున్న సింహం బొమ్మ ముద్రించి ఉంది. వీరి నాణాలపై బంగారు పూత మాత్రమే పూసి ఉంది. శాతవాహన నాణాలతో పోల్చితే వీటి పరిణామం తక్కువగా ఉంది.
శ్రీ చాంతమూలుడి కాలంలో వ్యవసాయ క్షేత్రాల విస్తరణ ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. రాజు తన విధిగా వేల సంఖ్యలో నాగళ్లను పంచిపెట్టడం దీనికి సాక్ష్యం. తోటల పెంపకం వ్యవసాయంలో భాగంగా మారింది. తమల పాకుల పంపిణీ ఆర్థిక వ్యవస్థలో ‘కరెన్సీ పంపిణీ’ పాత్రను పోషించింది.
వీర పురుషదత్తుడు బౌద్ధ మతాన్ని ఆచరించి ప్రోత్సహించడం వల్ల విదేశీ వాణిజ్యం బౌద్ధ మత ప్రచారకులతో పాటుగా విస్తరించింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ మొదలైన దేశాలకు వాణిజ్యం విస్తరించింది. ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపార శ్రేణులను పర్తకులు, వేగిమాలు అనే పేర్లతో పిలిచేవారు. ఎహుబల శాంతమూలుడి కాలంనాటికి ఆర్థికంగా రాజ్యం స్థిరత్వాన్ని సంతరించుకుంది. మిగులు ఆదాయంతో ఎహుబల శాంతమూలుడు అనేక ఆలయాలను నిర్మించాడు.
ఇక్ష్వాకుల ఆర్థిక మిగులును తిరిగి పెట్టుబడులకే ఎక్కువగా కేటాయించారు. సైన్య నిర్మాణం వైపు దృష్టి సారించలేదు. ఫలితంగా వీరి సైనిక వ్యవస్థ పల్లవులతో పోటీ పడలేకపోయింది.
సమాజం- సంస్కృతి:
తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఇక్ష్వాకుల కాలంనాటికి మత విశ్వాసాలు బలపడ్డాయి. ఈ రాజ్యస్థాపకుడైన శ్రీ చాంతమూలుడు తాను ‘విరూపాక్ష మహాసేన’ భక్తుడిని అని స్వయంగా ప్రకటించుకున్నాడు. వేలాది గోవులను దానం చేసి ‘గో శత సహస్ర’ అనే బిరుదును కూడా పొందాడు.
వాస్తవంగా ఇక్ష్వాకుల కాలంలో వీరపురుషదత్తుని కాలం బౌద్ధానికి స్వర్ణయుగం. నాగార్జున కొండ అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా వర్ధిల్లింది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం. ప్రస్తుత చైనాలోని టిబెట్ భౌగోళిక ప్రాంతంలోని ‘ద పాండ్’ అనే విశ్వవిద్యాలయంతో విద్యాపరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. సింహళ, గాంధార, కశ్మీరీ, చీని ప్రాంతాల నుంచి విద్యార్థులు నాగార్జున కొండకు వచ్చేవారు. వీరికోసం బౌద్ధ ఆరామాలు, సంఘారామాలు నిర్మించారు. వీర పురుషదత్తుని కాలంలో అనేక బౌద్ధ స్థూపాలు నిర్మించారు. నేలకొండపల్లి స్థూపం ప్రత్యేకమైనది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇదే! ఫణిగిరి స్థూపాన్ని మహా శాసక శైలిలో నిర్మించారు.
వీర పురుషదత్తుని కాలంలో ‘బోధిసిరి’ అనే ఉపాసిక, హీనయాన బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసింది. ఈమే అనేక బౌద్ధ స్థూపాలను నిర్మించినట్లు తెలుస్తోంది. వీర పురుషదత్తుని కుమార్తె కొండబలిసిరి నాగార్జున కొండవద్ద మహా చైత్య స్థూపం నిర్మించింది. బౌద్ధ మత విస్తరణకు కృషి చేసిన భావవివేకుడనే బౌద్ధమత గురువు ప్రభావం అప్పటి సమాజంపై ఎక్కువగా ఉండేది.
వైదికమత ఆరాధాన స్వరూపాలు ఇక్ష్వాకుల కాలంలో స్థిరమైన రూపాన్ని సంతరించుకున్నాయి. ఎహుబల శాంతమూలుడు వేయించిన సంస్కృత శాసనం దక్షిణ భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత దేవాలయ ఆకృతులు, ఇక్ష్వాకుల కాలంలోనే స్థిరపడ్డాయి. గర్భగుడి, గోపురం, ధ్వజ స్థంభం నమూనాలు ఈ కాలం నుంచే నిర్మాణ రూపంలోకి వచ్చాయి. ప్రసిద్ధిపొందిన అష్ఠభుజ దేవాలయం, హారీతి దేవాలయం, పుష్పభవ్ర దేవాలయం, కుబేర స్వామి దేవాలయం, మహాసేన దేవాలయం, నవగ్రహాలయం అతి ముఖ్యమైన నిర్మాణాలు. ఇక్ష్వాకుల కుల దేవతగా ‘హారీతి దేవీ’ని గుర్తించారు. ఈ దేవత దేవాలయాన్ని చిన్న పిల్లల దేవాలయంగా పిలుస్తున్నారు. ఏహుబలి శాంతమూలుడి సైన్యాధిపతి ‘ఎలిసిరి’ తన పేరున ఏలేశ్వర పట్టణాన్ని నిర్మించాడు. ఇది బ్రాహ్మణ విద్యా కేంద్రంగా భాసిల్లింది. ప్రస్తుత నాగార్జున సాగర్ తీర ప్రాంతంలో నేటికీ ఉనికిలో ఉంది.
బౌద్ద, వైదిక నిర్మాణాలతో పాటుగా ఇతర లౌకిక నిర్మాణాలు కూడా ఇక్ష్వాకుల కాలంలో నిర్మించారు. వీటిల్లో నాగార్జునకొండపై చెక్కిన శిల్పాలు మాట్లాడే శిల్పాలుగా పిలుస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభించిన పచ్చని పాలరాయి శిల్పం మాంధాత శిల్పంగా గుర్తింపు పొందింది. ఈ శిల్పం ఆనాటి శిల్పకళా సౌందర్యానికే అద్భుతమైన ప్రతీక.
నాగార్జునకొండపై లభించిన రోమన్ సైనిక విగ్రహం ‘సిథియన్’ రోమ్ - భారత్ సంబంధాలకు సాక్ష్యం. తవ్వకాల్లో బయల్పడిన స్టేడియాన్ని పొలిన నిర్మాణాన్ని రండభూమిగా గుర్తిస్తున్నారు. రుద్ర పురుషదత్తుడు తన తల్లి పేరున ఛాయ స్థంభాన్ని ఏర్పాటు చేశాడు. ఇది జ్ఞాపక చిహ్నంగా గుర్తింపు పొందింది.ఇక్ష్వాకుల చివరి దశలో బలవంతపు సతీసహగమన విధానం ఉనికిలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పంచాంగం ఉనికిలోకి వచ్చింది. శాతవాహన రాజులు కొనసాగించిన మాతృ సంజ్ఞలు, ఇక్ష్వాకు రాజు కొనసాగించారు. ఇక్ష్వాకుల శిల్పకళను ‘అపర శైలి’గా గుర్తించారు.
శిల్పుల పేర్లు రాసుకోవడం క్రమంగా ఆరంభమైంది. ఆలయాల నిర్మాణాల్లో ‘రపశ్య’ అనే స్త్రీ కీలకమైన పాత్రను పొషించింది. హారీతి ఆలయంలో సప్తమాతృకల విగ్రహాలు లభించాయి. వీటిని హైదరాబాద్ కేంద్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు.బౌద్ధుల సాహిత్యం పాళి భాషలో ఉండేది. వీర పురుషదత్తుడి కాలంలో ఈ భాషకు రాజ్య గుర్తింపు ఉండేది. వైదిక విద్యకు ఏలేశ్వరం కేంద్రంగా కొనసాగింది. సంస్కృత భాషకు ఎహుబల శాంతమూలుడి కాలంలో అత్యధిక రాజ్యాధరణ ఉండేది. ‘ధర్మామృతం’ గ్రంథం ద్వారా జైన మత ప్రాధాన్యం తెలుస్తుంది. జైన మత గ్రంథాలను అర్థమాగాధి శైలిలో రాశారు. శాతవాహన పరిపాలన విధానాన్నే ఇక్ష్వాకులు కొనసాగించినట్లుగా తెలుస్తుంది. రాజ్యం విషయాలుగా; విషయం హారాలుగా; హారం పదాలుగా; పదం పంచికగా; పంచిక కంచిక అనే గ్రామ పునాదిగా వర్గీకరించారు.
శాతవాహనుల అనంతరం, విష్ణుకుండినులకు ముందు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం ఇక్ష్వాకుల ద్వారా సాధ్యమైంది. గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఇక్ష్వాకుల ప్రత్యేకతను గుర్తించి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అవకాశం ఉంటే నాగార్జునసాగర్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ‘మ్యూజియం’ దర్శించాలి. ప్రముఖ చరిత్రకారుడు, పురావస్తు పరిశోధన సంస్థ పూర్వ డైరెక్టర్ ఎ.ఆర్. సరస్వతి సేకరించిన అనేక పురావస్తు ఆధారాలను ఈ మ్యూజియంలో పొందుపర్చారు.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్
డైరెక్టర్, 5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
