తెలంగాణలో తొలి మానవ ఆవాసాలు ఎప్పట్నుంచంటే..! గ్రూప్1 అభ్యర్థులకు!

ABN , First Publish Date - 2022-07-11T22:44:13+05:30 IST

తొలి మానవ పరిణామక్రమం 10 లక్షల సంవత్సరాల క్రితం ఆరంభమైనట్లుగా చరిత్ర నిర్ధారిస్తోంది. తెలంగాణ భౌగోళిక భూభాగంలో పురావస్తు ఆనవాళ్లు 3వేల సంవత్సరాల క్రితం నాటివి

తెలంగాణలో తొలి మానవ ఆవాసాలు ఎప్పట్నుంచంటే..! గ్రూప్1 అభ్యర్థులకు!

తెలంగాణ చరిత్ర-సంస్కృతి-ఉద్యమం


తొలి మానవ పరిణామక్రమం 10 లక్షల సంవత్సరాల క్రితం ఆరంభమైనట్లుగా చరిత్ర నిర్ధారిస్తోంది. తెలంగాణ భౌగోళిక భూభాగంలో పురావస్తు ఆనవాళ్లు 3వేల సంవత్సరాల క్రితం నాటివి లభ్యమవుతున్నాయి. చరిత్ర అధ్యయనంలో లిపికి ముందున్న కాలాన్ని చారిత్రక యుగంగా గుర్తిస్తారు. సాధారణంగా చారిత్రక పూర్వయుగ ఆధారాలు పురావస్తు లేదా ఆర్కియాలజిక్‌ ఆధారాలుగా; చారిత్రక యుగ ఆధారాలు సాహిత్య, సారస్వత ఆధారాలుగా గుర్తింపు పొందుతున్నాయి. తెలంగాణ చరిత్ర రచనకు పురావస్తు, చారిత్రక ఆధారాలు వందల, వేల సంఖ్యలో లభించాయి.



పురావస్తు ఆధారాల్లో జీవజాల అస్థిపంజరాలు, పాటరీ, జీవజాల ఉనికిని తెలియజేసే శిలలు, శిలాజాలు, శాసనాలు, నాణాలు, శిథిలమైన నిర్మాణాలు, ఆభరణాలు, మూర్తులు, పరికరాలు, ఆయుధాలు అంతర్భాగంగా ఉంటాయి. చారిత్రక ఆధారాలలో ప్రతులు, పత్రికలు, పుస్తకాలు, గ్రంథాలు, డాక్యుమెంట్లు, స్వీయచరిత్రలు,  జీవిత చరిత్రలు, సాహిత్య, సారస్వతాలు భాగంగా ఉంటాయి. పురావస్తు ఆధారాల ప్రాతిపదికగా తెలంగాణ చరిత్ర 3 దశలలో కొనసాగింది. అవి...

  • ఎలియో లిథిక్‌/రాతియుగం
  • మెగా లిథిక్‌/బృహత్‌ శిలాయుగం
  • మెటల్‌/ లోహయుగం

  • శిలాయుగ మానవుడు రాతిగొడ్డళ్లు, గోకుడు రాళ్లు, వృత్తాకారపు రాళ్లను వేటకోసం ఉపయోగించి తన జీవన మనుగడను సాగించాడు. వీటి ఆనవాళ్లు గోదావరి నదీ తీరంలోని బోధన్‌, పొచ్చెర, నిర్మల్‌, పెదవాగు, పెద్దపల్లి, రామగుండం, చెన్నూరు, మంచిర్యాల, ఏటూరు నాగారం, రాజుపల్లి, దామర వంచ, ఎక్కాల, సెలబాక, పాల్వంచ, చర్ల తదితర ప్రాంతాల్లో; కృష్ణా నదీ తీరంలోని సంగోవోనిపల్లె, మన్నెంకొండ, దామరచెర్ల తదితర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
  • మానవ జీవన గమనంలో మరో ఉన్నత దశ బృహత్‌ శిలాయుగం. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు కొనసాగిన దశ ఇది. పశువుల పెంపకం, మొక్కల పెంపకం ఈ కాలంలోనే ఆరంభమైంది. కుమ్మరి చక్రం ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. భారతదేశ చరిత్రలో జమ్మూకశ్మీర్‌లోని  బుర్జహుం గుహలు, మహారాష్ట్రలోని బాజీ గుహ లు ఈ నాగరికతను సూచిస్తున్నాయి. తెలంగాణలో ఈ నాగరికతకు ప్రధాన సాక్ష్యాలు బృహత్‌ శిలాయుగ సమాధులు. అంతకు ముందు చరిత్రకు భారతదేశంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న బీంబెట్కా గుహలు ప్రాథమిక ఆధారాలు కాగా, తెలంగాణలో అనేక గుహ చిత్రాలు పురావస్తు యు గానికి సాక్ష్యాలు. తెలంగాణలో లభ్యమైన బృహత్‌ శిలాయుగానికి సాక్ష్యాలుగా నిలిచే సమాధులు నాలుగు రకాలు. పిట్‌ బరియల్స్‌ మొదటి రకం. వీటిలో ఆదిడిపల్లి, ఉప్పలపాడు, ఈర్లదిన్నె ముఖ్యమైనవి. భూమిలో పాతివేయబడిన ఈ సమాధుల్లో ఉంచిన వస్తువులు చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి. రెండో రకం సిస్ట్‌ లేదా గూడు సమాధులు. ఇవి స్వస్తిక్‌ ఆకారంలోని సమాధులు. గూడులాగ పేర్చబడిన ఈ సమాధులు కృష్ణానదీ తీరంలోని చిన్నమరూర్‌, పెద్ద మరూర్‌లో గుర్తించారు. మూడో రకం డాల్మాన్స్‌ లేదా గుట్టపై సమాధులు. తెలంగాణలో అనేక కొండ ప్రాంతాల్లో ఈ సమాధులను గుర్తించారు. వీటిలో ప్రధానమైన వాటిని బయ్యారం, మెదక్‌లో గుర్తించారు. చివరివి రాతి సమాధులు లేదా రాక్‌ కట్‌ బరియల్స్‌. లేబర్తి, ఫణిగిరి, శివారు వెంకటాపురం, రాజుపల్లి, కాంచనపల్లి, పోచంపాడు పరిసర ప్రాంతాల్లో ఈ సమాధులను గుర్తించారు. వీటితోపాటుగా శవపేటికలు లేదా సర్కోఫాగ్‌సలు రాయగిరి, నార్కట్‌పల్లి, హుజూర్‌నగర్‌, మంగంపేట, జానంపేట, మంజీర నదీ తీర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఏలేశ్వరంలో ప్రధానంగా ఏనుగు ఆకార శవపేటికలు గుర్తించారు.
  • వీటి అన్నిటి ఆధారంగా తెలంగాణలో ఒక గొప్ప నాగరికత పునాదులు బృహత్‌ శిలాయుగంలోనే ఆరంభమైందని, భారతదేశంలో ఏ నాగరికతకు తీసిపోని నాగరిక పునాదులు తెలంగాణలో కూడా ఉన్నాయని ధృవపడుతోంది.

లోహయుగ లేదా మెటల్‌ ఏజ్‌ నాగరికతలు

సాధారణంగా బృహత్‌ శిలా నాగరికత తరవాత లోహయుగ నాగరికత ఆరంభమవుతుంది. దానిలోనూ రాతియుగ నాగరికత అనంతరం, ఇనుప యుగ నాగరికత కొనసాగుతుంది. అయితే తెలంగాణ నాగరికతల్లో ఈ పరిణామ క్రమం విడివిడిగా కాక, ఒక సందర్భంలో అవిచ్ఛిన్నంగా సాగినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ భౌగోళిక ప్రాంతాల్లో అనేక చోట్ల  బూడిద కుప్పలు విరివిగా లభించాయి. ఇనుమును కాల్చడంలో టన్నుల కొద్దీ కలపను మండించడం వలన ఇవి ఏర్పడ్డాయి. వీటి ఆధారంగా తెలంగాణ ప్రజలకు ఆర్యుల రాకముందే ఇనుము పరిచయం ఉన్నదనే విషయం రూఢీ అవుతోంది. సిరియా, డెమాస్క్‌సలో లభ్యమైన కత్తులు తెలంగాణలోని కోనసముద్రం, లింగంపల్లి ప్రాంతాల నుంచే ఎగుమతి అయ్యాయని గుర్తించారు. అదేవిధంగా పోచంపాడు తవ్వకాల్లో  ‘గుర్రం’ అస్థిపంజరం దొరకడం మరో విశేషం. దక్షిణ భారతీయులకు ప్రధానంగా ప్రాచీన తెలంగాణవాసీయులకు ‘గుర్రం’ ముందే పరిచయమున్న జంతువు.


తెలంగాణలో తొలి మహాజనపదం ‘అస్సాక’

  • భారతదేశ ప్రాచీన వాజ్మయమంతా అస్సాక రాజ్యం గూర్చి ప్రస్తావన చేశాయి.
  • వీటిలో ప్రధానమైనవి బౌద్ధమత గ్రంథం సుత్తానిపాతం, జైన మత గ్రంథం పట్టావళి. బౌద్ధ జాతక కథ ‘సెరివనజ’ ప్రకారం ఈ రాజ్యం అతి ప్రాచీనమైనది. 
  • జైన మత గ్రంథమైన ‘పట్టావళి’ ప్రకారం జైన మత తొలి తీర్థంకురుడైన వృషభనాథుని కుమారుడు ‘బాహుబలి’ బోధన్‌ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని 52 ధనస్సుల పొడవైన విగ్రహం ఇక్కడ ఉండేది. 
  • ఈ విగ్రహ స్ఫూర్తితోనే కర్ణాటక రాజు రాజమల్లుడి మంత్రి చాముండ రాయుడు ‘గోమటేశ్వర’ విగ్రహాన్ని శ్రావణ బెళగలో స్థాపించాడు.
  • జైన మత గ్రంథాలను అనుసరించి బాహుబలి సోదరుడు భరతుడు
  • బాహుబళి ధర్మం కోసం రాజ్యాన్ని త్యజించిన యోధుడిగా జైన మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
  • తరువాత కాలంలో వెలువడిన బౌద్ధ మత గ్రంథాలు అస్సాక రాజ్యాన్ని  సుజీవుడు పరిపాలించేవాడని, అతడు బుద్దుని సమకాలికుడిగా గుర్తించాయి. చివరకు అస్సాక రాజ్యాన్ని నందులు జయించారు.
  • ఈ నేపథ్యంలో ప్రాచీన తెలంగాణలో శాతవాహన రాజ్యానికి ముందే కోటిలింగాల కేంద్రంగా ‘గోభదడు’, అతని వారసులు పాలించారు. మత్స్య పురాణం ప్రకారం  మంజీరక దేశం ఉంది. ఈ ప్రాంతంలో అంధేరి లేదా ఆంధ్ర, ముతక, దురద, పారధ, పహ్లవ జాతి ప్రజలు ఉండే వారని వాయుపురాణం పేర్కొంది. ఈ ప్రజలే ‘తెలింగ’ ప్రజలుగా గుర్తింపు పొందారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో జనావాస కేంద్రాలు ప్రాచీన కాలం నుంచే వర్థిల్లుతున్నాయి.


తెలంగాణలో తొలి జనావాసాలు

  • తెలంగాణలో తవ్వకాల్లో బయల్పడిన నాణాల ఆధారంగా, టెర్రకోట వస్తువులు, ముద్రల ఆధారంగా, జైన, బౌద్ద పవిత్ర స్థలాల ఆధారంగా శాతవాహన రాజ్యాల కంటే ముందే తెలంగాణలో జనావాస కేంద్రాలు ఉన్నాయని, గణతంత్ర రాజ్య వ్యవస్థలు ఉనికిలో కొనసాగాయని తెలుస్తోంది. గోదావరీ నదీ తీరాల్లో కోటి లింగాల, రాయపట్టణం, పెద్దబంకూరు, రాజుపల్లి; మంజీర తీరంలోని కొండాపూర్‌; కృష్ణానదీ పరివాహక ప్రాంతానికి చెందిన ఫణిగిరి, గాజుల బండ ఈ చరిత్రకు సాక్ష్యాలు.
  • అనేక టెర్రకోట ముద్రలు(బెకెడ్‌ ఎర్త్‌) ‘మహాతలవర’ అనే అక్షరాలతో గుర్తించారు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు డి.డి.కోశాంబి అభిప్రాయపడినట్లుగా, అశోకుడి కళింగ యుద్ద దండయాత్రల సమయానికి దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాల ఏర్పాటు దశ ఆరంభం కాలేదు. ఆ ప్రాంతమంతా చిన్న, చిన్న గణ రాజ్యాలతోనే నిండి ఉంది. ఈ అభిప్రాయం తెలంగాణ విషయంలో కూడా రూఢి అవుతుంది. పెద్ద బంకూర్‌, కదంబపూర్‌, పాలకొండ, ధూళికట్ట, ఏలేశ్వరం తదితర ప్రాంతాల్లో లభ్యమైన ఆధారాలు వీటికి సాక్ష్యాలు. దాదాపు 100 ఎకరాల స్థలాల్లో గుర్తించిన పెద్ద బంకూర్‌ ఆవాస స్థలంలో ఆవిష్కరించిన గుర్రం బొమ్మతో కూడిన ఎర్రమన్ను టెర్రకోట ముద్రపై బ్రహ్మీ లిపిలో ‘ మహాతలవర వాజ సమీక్ష సేవ సభ’ అని రాసి ఉంది. కొండాపూర్‌ పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వెలువడిన నాణాలు, ముద్రల ప్రాతిపదికగా ఈ ప్రాంతం ఒకప్పుడు నాణాల తయారీ కేంద్రం లేదా టంకశాలగా గుర్తింపు పొందిందని కొండాపూర్‌ను ‘తక్షశిల’తో పోల్చిన చరిత్రకారులు అన్నారు.
  • తొలిమహాజన పదాలు - తెలంగాణ:- భారతదేశ చరిత్ర పరిశోధన గ్రంథాల్లో డబ్ల్యూ.ఎం.రైస్‌ రాసిన ‘బుద్ధిస్ట్‌ ఇండియా’ ప్రముఖమైనది. ఈ గ్రంథంలో భారతదేశంలో 72 జనపదాలు ఉన్నట్లుగా గుర్తించాడు. వీటిలో 16 మహాజన పదాలు. బౌద్ధ గ్రంథం ‘అంగౌత్తరనికాయ’ మహాజనపదాలకు సంబంధించిన పట్టికను ప్రస్తావించింది. అవి..
  • కాశీ, వ్రజ, వత్స్య, కాంభోజ, కోసల, మాళవ, మత్స్య, అవంతి, అంగ, భేది, పాంచాల, గాంధార, మగధ, కురు, సూరసేన, ఆస్మక లేదా అస్సాక.
  • పై పట్టిక ఆధారంగా గుర్తించిన షోడశ జనపదాల్లో అస్సాక రాజ్యం ఒకటిగా ఉంది. ఈ అస్సాక రాజ్యమే తెలంగాణలోని బోధన్‌ లేదా పౌదన్‌ లేదా పౌద్యనపురి రాజధానిగా ఏర్పడిన తొలి దక్షిణ భారత మహాజనపదం. మరో బౌద్ధ గ్రంథమైన సుత్తానిపాత కూడా గోదావరి ఒడ్డున అస్సాక రాజ్యం వర్ధిల్లినట్లుగా వివరిస్తోంది.

ఇనుము వాడకం ఒక సామాజిక ఆర్థిక విప్లవం

వాస్తవంగా ఇనుము వాడకం, మానవ జీవన విధానంలో ఒక మహత్తర విప్లవాన్ని సృష్టించింది.

  • పదునైన ఆయుధాలు తయారు చేశారు. దీంతో కూృర మృగాల నుంచి మానవులకు రక్షణ ఏర్పడింది.
  • నాగలిని రూపొందించారు. ఒక రకంగా నాగలి తయరీ నాగరికతను సృష్టించింది. నాగలి ఫలితంగా భూమిని దున్నడం, విత్తనాలు వేయడం ఆరంభమైంది. కాపు కోసం వేచి చూడటం స్థిర నివాసాన్ని తయారు చేసింది. ఫలితంగా వ్యవసాయం ఒక విప్లవంలా వర్ధిల్లింది. ఠ  ఇనుము వాడకం వల్ల బండి చక్రానికి ఇరుసు తయారైంది. బండి చక్రాలు ప్రగతి చక్రాలుగా నాగరికతకు ఉపకరించాయి. రవాణా పెరిగింది. పండిన పంటను ఇంటికి చేర్చడం సులభమైంది. మచ్చిక చేసుకున్న జంతువులకు ఆహారం అందజేశారు.
  • తెలంగాణ ప్రాచీన సమాజంలో ఈ మార్పునకు సంబంధించిన ఆధారాలు అనేకం లభ్యం అయ్యాయి. మానేరు నదీ తీరంలో, మంజీర నదీ తీరంలో వర్ధిల్లిన ఆవాస కేంద్రాలు వీటికి ప్రధాన సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.


ముగింపు

గ్రూప్స్‌ పరీక్షలకు అదేస్థాయి ఉన్నత పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు తెంగాణ తొలి జనావాస కేంద్రాలను గుర్తించగలగాలి. పట ఆధారిత అభ్యసనం.. అవగాహన సామర్థ్యా న్ని, వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా స్వీయ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం వలన విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది.


తెలంగాణ సంస్కృతి ఉద్యమ మూలాలు అర్థం కావడం కోసం ప్రాచీన తెలంగాణ  జనావాస కేంద్రాలు, తొలి జనపదాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. భారతదేశ చారిత్రక మూలాలతో సమన్వయం చేస్తూ, తెలంగాణ ప్రత్యేక గుర్తింపు కోణంలో అధ్యయనం కొనసాగాలి.


-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ 

డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-07-11T22:44:13+05:30 IST