కాకతీయుల కాలం.. తెలంగాణ చరిత్రలో స్వర్ణయుగం

ABN , First Publish Date - 2022-09-13T21:45:14+05:30 IST

చరిత్ర రచనకు ఆధారాలు అవసరం. వస్తు సంబంధ ఆధారాలను పురావస్తు ఆధారాలుగా, లిఖిత సంబంధమైన వాటిని చారిత్రక ఆధారాలుగా గుర్తిస్తారు. తెలంగాణ చరిత్ర రచనలో, అధ్యయనంలో పరిపూర్ణ ఆధారాలతో లిఖించిన చరిత్ర కాకతీయులది.

కాకతీయుల కాలం.. తెలంగాణ చరిత్రలో స్వర్ణయుగం

చరిత్ర రచనకు ఆధారాలు అవసరం. వస్తు సంబంధ ఆధారాలను పురావస్తు ఆధారాలుగా, లిఖిత సంబంధమైన వాటిని  చారిత్రక ఆధారాలుగా గుర్తిస్తారు. తెలంగాణ చరిత్ర రచనలో, అధ్యయనంలో పరిపూర్ణ ఆధారాలతో లిఖించిన చరిత్ర కాకతీయులది. 


శాసనాలు, నాణాలు, కట్టడాలు ప్రధానంగా చెరువులు కాకతీయ చరిత్రను వర్తమాన సమాజానికి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా కాకతీయ చరిత్రకు అనేక కన్నడ, తెలుగు భాషల్లో లభ్యమైన ఈ సాహిత్యం కాకతీయులకు సంబంధించిన అనేక వివరాలను ప్రస్తుత తరానికి వివరిస్తున్నాయి.


గ్రూప్‌-1, గ్రూప్‌-2 తదితర ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు, అదేవిధంగా ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ లాంటి పోలీస్‌ సర్వీసులకు ప్రిపేర్‌ అవుతున్న వారు, భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న గురుకుల్‌ టీచర్స్‌, లైబ్రేరియన్స్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారందరూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి అర్థం కావడం కోసం కాకతీయుల గూర్చి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇటీవలి కాలంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో కూడా కాకతీయ చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ప్రశ్నల రూపంలో లభించింది.


కాకతీయుల చరిత్ర - సంస్కృతి - వారసత్వం నేటికీ ప్రజానీకంపై, ప్రభుత్వ పథకాలపై పడుతున్నందువల్ల, ఆ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, విస్తృత సమాచారం విద్యార్థులకు అందించడం కోసం కాకతీయుల చరిత్ర, సంస్కృతి - వారసత్వం విభాగాలుగా లేదా వివిధ పార్టులుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. సీరియల్‌గా ప్రచురితమవుతున్న ఈ వ్యాసాలను మీ ప్రిపరేషన్‌ కోసం ఉపయోగించుకోండి.


కాకతీయులు తెలంగాణ ఖ్యాతిని, ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పారు. కాకతీయ రాజ్యం భారతదేశ చరిత్రలో గుర్తింపుపొందిన అధ్యాయం. 1882లో ఫ్లీట్‌ అనే చరిత్రకారుడు కాకతీయులకు చెందిన హనుమకొండ శాసనాన్ని శాస్త్రీయంగా చదివి వీరి చరిత్రపై నూతన ఆవిష్కరణలు చేశాడు. 

1914లో 7వ నిజాం పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం ద్వారా వీరి చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు సేకరించి భద్రపర్చడం వీలైంది. 1964లో పి.వి.పరబ్రహ్మశాస్త్రి పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రత్యేక అధ్యయనం నిర్వహించి వెయ్యి కాకతీయ శాసనాలను సేకరించాడు. ఇతని కృషి ఫలితంగానే కాకతీయుల చరిత్ర క్రమపద్ధతిలో లఖితమైంది.


చారిత్రక ఆధారాలు - శాసనాలు

మాంగల్లు శాసనం(956): కృష్ణాజిల్లాలో లభ్యమైన ఈ శాసనం కాకతీయుల తొలి చరిత్రను వివరిస్తుంది. రాష్ట్రకూటుల ప్రతినిధిగా నాలుగో గుండన.. బ్రాహ్మణునికి మాంగల్లు గ్రామాన్ని దానం చేసిన సంఘటన ఈ రాగి శాసనంలో ఉంది.

శనిగరం శాసనం(1149): కరీంనగర్‌ జిల్లాలో లభ్యమైన ఈ శాసనం రెండో ప్రోలరాజుకు చెందింది. ఈ శాసనమే సామంతులుగా కాకతీయులు వేసిన చివరి శాసనం.

గూడూరు శాసనం(1124): జనగామ జిల్లాలో ఈ శాసనాన్ని విరియాలకాను సాని(మెరుకసాని) వేయించింది.  ఆమె మేనల్లుడైన గరుడ భేతరాజు అనుమకొండ(నేటి హన్మకొండ)ను రాజ్యంగా పొందినట్లు ఈ శాసనంలో ప్రస్తావన ఉంది.

వేయిస్థంభాల శాసనం/హన్మకొండ శాసనం(1163): ఈ శాసనం రుద్రదేవుడు కాలానిది. అజితేంద్రుడు అనే లేఖకుడు ఈ శాసనాన్ని రాశాడు. కాకతీయులు సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్న తొలి శాసనం ఇది.

మంథని శాసనం(1199): ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఉంది. గణపతిదేవుడు రాజుగా ప్రకటించుకున్న శాసనం ఇది.

రామప్ప/పాలంపేట శిలాశాసనం(1213): కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన సంఘటనలు ఇందులో ఉన్నాయి.

బయ్యారం చెరువు శాసనం(1229): ఈ శాసనాన్ని గణపతి దేవుని చెల్లెలు మైలాంబ, ఆమె తల్లి బయ్యాంబ పేరున వేయించింది. ఈ చెరువునే ‘ధర్మ కీర్తి చక్ర’ అనే పేరుతో గుర్తిస్తున్నారు. ఈ శాసనం ఆధారంగా కాకతీయుల వంశ క్రమం గుర్తించారు.

మోటుపల్లి అభయ శాసనం(1244): ప్రకాశం జిల్లాలోనిది. ఈ శాసనం గణపతిదేవుని కాలానిది. ఆ కాలంనాటి వ్యాపార నిబంధనలు, విదేశీ వాణిజ్యం వివరాలను తెలియజేస్తుంది.

బీదర్‌ శాసనం(1262/1263): రుద్రమదేవి దేవగిరి రాజు మహదేవుడిని జయించిన అంశం ప్రస్తావిస్తుంది. రుద్రమదేవి సమాచారాన్ని వెలగపూడి శాసనం(అమరావతి), మల్కాపురం(అమరావతి) శాసనం, మొగిలిచెర్ల(వరంగల్‌)  శాసనం తెలియజేస్తున్నాయి.

చందుపట్ల శాసనం(1289): ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉంది. ఈ శాసనాన్ని రుద్రమదేవి అనుచరుడు పువ్వుల ముమ్మడి వేయించాడు. ఈ శాసనం రుద్రమదేవి వీరమరణాన్ని వివరిస్తుంది.

కలువ చెరువు విలాప శాసనం(1323): పశ్చిమగోదావరి జిల్లాలో లభించింది. రెడ్డితల్లి అనతల్లి కాకతీయ సేనాని(ప్రోలయ నాయకుని తల్లి) వేయించింది. ఈ శాసనం ప్రతాపరుద్ర మరణం గురించి వివరించింది.


కాకతీయుల కాలం నాటి నాణాలు

కాకతీయుల నాణాలు అరుదుగా లభ్యమయ్యాయి. వీటిపై ‘దాయగజకేసరి’ అని రాసి ఉంది. చెరువు గుర్తు, మూడు కొండల గుర్తు, ఏనుగు గుర్తు వీటిపై  ఉన్నాయి. కాకతీయుల నాణాలను వరాహాలు, మాడ, రూక అనే పేర్లతో గుర్తిస్తున్నారు.


కాకతీయుల కట్టడాలు

వేయిస్థంభాల గుడి: వేసర శైలిలో నిర్మించిన త్రికూటాలయం

రామప్ప దేవాలయం: వేసర శైలిలో నిర్మించిన ఏకకూట ఆలయం

వరంగల్‌ కోట: రెండో ప్రోలుడు, రుద్రదేవుడు, గణపతి దేవుడు నిర్మించారు. దీనిలోని కీర్తి తోరణాన్ని గణపతి దేవుడు నిర్మించాడు(ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో ఇది ఉంది). చుట్టూ రాతికోటను రుద్రమ దేవి నిర్మించింది. 

గణపురం  గుళ్లు/కోటప్ప గుళ్లు(భూపాలపల్లి): గణపతిదేవుని కాలానికి చెందినవి.

నగునూరు కోట: కరీంనగర్‌ జిల్లాలో ఉంది. 

పానగల్లు కోట/పిల్లలమర్రి: సూర్యాపేట జిల్లాలో ఉంది. కందూరు చోడుల నిర్మాణం


కాకతీయుల సాహిత్యం(స్థానిక భాషలు)

  • కాకతీయ రుద్రదేవుడు - నీతిసారం
  • బద్దెన - నీతిశాస్త్రముక్తావళి (సుమన శతకం)
  • విద్యానాథుడు- ప్రతాపరుద్ర యశోభూషణం
  • వినుకొండ వల్లభరాముడు - క్రీడాభిరామం(శ్రీనాథుడు తిరిగి రచించాడు)
  • పాలకుర్తి సోమనాథుడు(తొలిదేశ కవి)- పండితారాధ్య చరిత్ర, బసవపురాణం
  • కొలను గణపతి- శివయోగ సారం
  • జయప్ప సేనుడు - నృత్తరత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి 
  • సిద్ధి దేవయ్య - పురుషార్థ సారం
  • అప్పయ చార్యుడు- జీనేంద్ర కళ్యాణాభ్యుదయం
  • కుప్పాంబ - చక్రబంధం
  • ఏకాంబ్రనాథుడు - ప్రతాప చరిత్ర(తెలంగాణలో తొలి చరిత్ర గ్రంథం)  
  • కాసె సర్వప్ప - సిద్దేశ్వర చరిత్ర
  • జగ్గకవి - సోమదేవరాజీవం
  • సదాశివ శాస్త్రి - వెలుగోటివారి వంశ చరిత్ర
  • పి.వి.పరబ్రహ్మ శాస్త్రి- కాకతీయులు


పర్షియన్‌ రచనలు

  • ఫెరిస్టా : తారిఖ్‌ - ఇ - ఫెరిస్టా
  • ఇసామియా : పత్‌- ఉల్‌ - సలాటిన్‌
  • బరాని : తారిఖ్‌ - ఇ- ఫిరోజ్‌షాహి
  • అమీర్‌ ఖుస్రూ : తుగ్లక్‌ నామా 


యాత్రికుల రచనలు

  • మార్కోపోలో(వెనిస్‌ యాత్రికుడు): ద ట్రావెల్స్‌
  • ఇబిన్‌ బటూటా(మెరాకో యాత్రికుడు): రెహ్ల


కాకతీయుల మూలాలు

వీరి మూలాలపై అస్పష్టత ఉంది. ప్రతాపరుద్రీయం, క్రీడాభిరామం అనే గ్రంథాలను అనుసరించి వీరు ‘కాకతి’ అనే దేవతను ఆరాధించడం వల్ల కాకతీయులు(కాకతి, ఏకవీర)గా పిలువబడ్డారు.


బయ్యారం శిలాశాసనం మాత్రం వీరు ‘దుర్జయ’ వంశీయులని, కాకతీపురాన్ని పాలించడం వల్ల కాకతీయులుగా పిలువబడ్డారని తెలియజేస్తుంది. కాకతి ప్రాంతం ప్రస్తుత చత్తీస్‌గఢ్‌లోని ‘కాంకేర్‌’ అని ఒక అభిప్రాయం. పురావస్తు శాఖాధిపతి లక్ష్మీనారాయణ ప్రకారం కాకతి అనే పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఉంది. వీరు రాష్ట్రకూటులతో తెలంగాణకు వలస వచ్చారు. మరికొంతమంది చరిత్రకారులు కాకతీయులు స్థానిక శూద్రులు. జైన మతాన్ని స్వీకరించి సాంఘిక ఉన్నతిని సాధించారని అభిప్రాయపడుతున్నారు. గణపతిదేవుని సేనాని అయిన మల్యాలగుండ వేయించిన భూత్పూరు, వర్ధమానపురం శాసనాల్లో వీరు చతుర్త కులస్థులని పేర్కొన్నారు.


కాకతీయులు రాష్ట్రకూటుల ద్వారా తెలంగాణలోకి ప్రవేశించారు. సైనికులుగా, సైనాధ్యక్షులుగా, సామంతులుగా చివరికి సార్వభౌమాధికారులుగా మారారు. తొలుత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండటం వల్ల గరుడ చిహ్నంను, తరవాత కాలంలో కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మారడం వల్ల వరహంను చిహ్నంగా ధరించారు.


తొలి కాకతీయులు

వెన్ననృపుడు(వెన్న భూపాలుడు), గుండన - 1, గుండన - 2, కాకతీయ గుండన - 3, ఎఱయ, బేతయ, గుండన -4(పిండి గుండన), గరుడ బేతయ్య, ప్రోలరాజు-1, బేతరాజు- 2, దుర్గరాజు, ప్రోలరాజు -2


-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌, 

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-09-13T21:45:14+05:30 IST